Share News

AP Politics: వైసీపీకి వరుసగా నేతల షాక్..! టీడీపీలోకి పార్థసారథి, పెండెం దొరబాబు..?

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల హీటెక్కింది. సర్వేల ఆధారంగా సిట్టింగ్ సీట్లను వైసీపీ మారుస్తుంది. టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కొందరు తెలుగుదేశంపార్టీలో చేరగా, మరికొందరు చేరేందుకు సిద్ధం అవుతున్నారు.

 AP Politics: వైసీపీకి వరుసగా నేతల షాక్..! టీడీపీలోకి పార్థసారథి, పెండెం దొరబాబు..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల హీటెక్కింది. సర్వేల ఆధారంగా సిట్టింగ్ సీట్లను వైసీపీ మారుస్తుంది. టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కొందరు తెలుగుదేశం (Telugu Desam Party) పార్టీలో చేరగా, మరికొందరు చేరేందుకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు వైసీపీ ఇంచార్జీలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ అభ్యర్థే ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ స్పష్టంచేసింది. టికెట్ దక్కదని తెలిసి పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత సి రామచంద్రయ్య, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అధికార పార్టీకి రాజీనామా చేశారు. వారి బాటలో పార్థసారథి, పెండెం దొరబాబు చేరబోతున్నారు.

టీడీపీలోకి పార్థసారథి..?

మాజీ మంత్రి, సీనియర్ నేత పార్థసారథి వైసీపీని వీడేందుకు సిద్దమయ్యారు. పెనమలూర్ టికెట్ విషయంలో హైకమాండ్‌ నుంచి స్పష్టత లేదు. సీఎం జగన్‌ను కలిసినప్పటికీ హామీ రాలేదు. పెనమలూర్ కాకుండా గన్నవరం టికెట్ ఇస్తామని ప్రతిపాదన చేశారని తెలిసింది. అక్కడి నుంచి పోటీ చేసేందుకు పార్థసారథి సుముఖంగా లేరు. పెనమలూర్ నియోజకవర్గంతో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని చెబుతున్నారు. ఇక్కడి నుంచి కాకుండా గన్నవరం టికెట్ ఎందుకు ఇస్తానని చెబుతున్నారని అడిగారు. శుక్రవారం హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ అవుతారు. తెలుగుదేశం పార్టీలో చేరతారని అతని అనుచరులు చెబుతున్నారు. పెనమలూరు టికెట్‌ ఇస్తామని మాట ఇచ్చారని, అందుకే టీడీపీలో చేరనున్నారని విశ్వసనీయ సమాచారం.

దొరబాబు కూడా..?

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా పార్థసారథి బాటలో నడవనున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తారని విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరతారని తెలిసింది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా కాకినాడ ఎంపీ గీతకు బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం దొరబాబు పుట్టిన రోజు కావడంతో అనుచరులతో సమావేశం నిర్వహించారు. వారి అభీష్టం మేరకు టీడీపీలో చేరే అవకాశం ఉంది.

ఆవిర్భావం నుంచి ఉన్నాను

మాజీమంత్రి, సీనియర్ నేత సి రామచంద్రయ్య వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. మూడేళ్ల పదవీ ఉండగానే ఎమ్మెల్సీ పదవీకి రిజైన్ చేశారు. టీడీపీ-జనసేన కూటమితో రాష్ట్రానికి మంచి, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. తన కోడలు- బ్రాహ్మణి క్లాస్ మేట్స్ అని, అందుకే పార్టీ మారానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు. రాజంపేట ఎమ్మెల్యే టికెట్‌ను తన కుమారుడికి ఇప్పించేందుకు టీడీపీలోకి వచ్చానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నానని, మధ్యలో ఇతర పార్టీలకు వెళ్లింది వాస్తవమేనని రామచంద్రయ్య వెల్లడించారు.

సంజీవ్ రిజైన్

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. కర్నూలు పార్లమెంట్ పార్టీ ఇంచార్జీ పదవీ నుంచి తప్పించడంతో పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవీకి రాజీనామా చేశారు. సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించిన వీలు కాలేదని తెలిపారు. ఇలా ఒక్కో నేత వైసీపీని వీడుతున్నారు. టికెట్ ఇవ్వకపోవడం ఓ కారణమైతే, గుర్తింపు లభించడం లేదని మరొకరు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 12 , 2024 | 06:10 PM