Share News

Venkaiah Naidu : ఆరోగ్య సంరక్షణా సౌధానికి నైతిక విలువలే పునాది

ABN , Publish Date - Mar 06 , 2024 | 10:33 PM

ఆరోగ్య సంరక్షణా సౌధానికి నైతిక విలువలే పునాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) అన్నారు. ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బుధవారం నాడు ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు.

Venkaiah Naidu : ఆరోగ్య సంరక్షణా సౌధానికి నైతిక విలువలే పునాది

నెల్లూరు: ఆరోగ్య సంరక్షణా సౌధానికి నైతిక విలువలే పునాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) అన్నారు. ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బుధవారం నాడు ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడుతూ...వైద్య రంగం ఓ వృత్తి మాత్రమే కాదు... కరుణ, నైపుణ్యం, శ్రేయస్సు, నిబద్ధతల సంగమమని చెప్పారు. ఆదాయం సంపాదించాలన్న ఒత్తిడి వైద్య రంగానికి ఏ విధంగానూ మంచిది కాదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై యువ వైద్యులు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. మారుతున్న కాలం, ఆహారపు అలవాట్లు తదితర అంశాల పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు. సమాజంలో మనధైర్యం పెంచాల్సిన బాధ్యత కూడా యువవైద్యుల మీద ఉందని అన్నారు. వృత్తిలో నిబద్ధత, అంకితభావంతో ఆరోగ్యకరమైన సమాజానికి బాటలు వేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైద్యశాల, మెడికల్ కాలేజీ ఆస్పత్రిగా తయారవడం ఆనందదాయకమని చెప్పారు. మా అమ్మాయి దీపావెంకట్ కూడా ఇక్కడే జన్మించిందని తెలిపారు. పౌరులు నిజాయితీగా ఉండాలని.. నిజాయితీగా పనిచేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాజకీయ, వైద్య వృత్తిలో ఉన్నవారంతా అంకితభావంతో సేవలు అందించాలని.. రాజ్యాంగ నిర్మాతలు అదే కోరుకున్నారని అన్నారు.

జీవనశైలిలో మార్పులతో అనారోగ్యం

ఏ దేశమైనా శక్తివంతంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలి. 60 శాతం మంది గ్రామాల్లో ఉన్నారని చెప్పారు. వైద్యులందరూ గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం కొంత సమయమైనా పనిచేయాలని చెప్పారు. జీవనశైలిలో వచ్చిన మార్పులవల్ల అనారోగ్యాలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజలు దేవుడి తర్వాత వైద్యులను దేవుడిలా భావిస్తారని వివరించారు. అందరి జీవితం స్వచ్ఛంగా ఉండాలని.. మనం, మన ఇళ్లు, గ్రామం శుభ్రంగా ఉండాలని చెప్పారు. అందుకే మన ప్రధాని స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు చేస్తున్నారని అన్నారు. జర్మనీ, రష్యా, చైనా వంటి దేశాలు మాతృబాషలోనే విద్యాభోధన సాగిస్తున్నాయన్నారు. మన ప్రభుత్వాలు కూడా మాతృబాషకి ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపాలని అన్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నవారు ఉన్నతస్థానాలకి వెళ్లారని.. బాగా సంపాదించి, సొంత ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని వివరించారు. వైద్యం కూడా కమర్షియల్ అయిపోయిందన్నారు. ఫైవ్ స్టార్ హాస్పిటల్స్ వచ్చేశాయని.. అవసరమైన పరీక్షలే చేయించి, అవసరమైన మందులు ఇవ్వాలని చెప్పారు. వైద్యులు పేదల దగ్గరి నుుంచి అత్యధిక ఫీజులు తీసుకోవడం సరికాదని అన్నారు. రోగులకు ఖర్చులు తగ్గించి, మంచి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడినప్పుడే వైద్యులకి ఆత్మసంతృప్తి అని వెంకయ్యనాయుడు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 11:02 PM