Vijayawada Metro: బెజవాడకు మెట్రోహారం ..
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:58 AM
Vijayawada Metro Trains: విజయవాడ మెట్రో రైల్ స్టేషన్లు ఖరారయ్యాయి. తొలి దశలో గన్నవరం నుంచి ఏలూరు రోడ్డు మీదుగా పీఎన్‌బీఎస్ వరకు కారిడార్-1, పెనమలూరు సెంటర్ నుంచి పీఎన్‌బీఎస్ సెంటర్ వరకు కారిడార్-2ను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే.
విజయవాడ నగరానికి మరో మణిహారం రూపుదిద్దుకుంటోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. నగరానికి మెట్రో స్టేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా రెండు కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి గన్నవరం బస్టేషన్ నుంచి పీఎన్‌బీఎస్ వరకు, రెండోది పెనమలూరు సెంటర్ నుంచి పీఎన్‌బీఎస్ వరకు నిర్మిస్తారు. అయితే కారిడార్ -1లో గన్నవరం నుంచి రామవరప్పాడు రింగ్ వరకు వీఐపీ కారిడార్‌ను డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌గా నిర్మించనున్నారు. తర్వాతి దశలో రాజధాని అమరావతికి విస్తరించే కారిడార్-3ని నగరంలోని పీఎన్‌బీఎ్‌సకు అనుసంధానం చేయనున్నారు.
- ఆంధ్రజ్యోతి, విజయవాడ
విజయవాడ మెట్రో రైల్ స్టేషన్లు ఖరారయ్యాయి. తొలి దశలో గన్నవరం నుంచి ఏలూరు రోడ్డు మీదుగా పీఎన్‌బీఎస్ వరకు కారిడార్-1, పెనమలూరు సెంటర్ నుంచి పీఎన్‌బీఎస్ సెంటర్ వరకు కారిడార్-2ను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కారిడార్లకు సంబంధించి మెట్రో రైళ్లలో ప్రయాణించటానికి వీలుగా మొత్తం 34 మెట్రో స్టేషన్లకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీఎల్) ఖరారు చేసింది. ఇందులో కారిడార్ - 1లో 22 మెట్రో స్టేషన్లను ఖరారు చేయగా.. కారిడార్ - 2 లో 12 మెట్రో స్టేషన్లను ఖరారు చేసింది.
కారిడార్ - 1 ఎన్‌హెచ్ - 16 మీదుగా వీఐపీ కారిడార్‌లో గన్నవరం నుంచి రామవరప్పాడు రింగ్ వరకు సాగుతుంది. అక్కడి నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్, పీఎన్‌బీఎ్‌సకు చేరుకుంటుంది. ఈ కారిడార్‌లో గన్నవరం బస్టాండ్, గన్నవరం సెంటర్, యోగాశ్రమం, విజయవాడ ఎయిర్‌పోర్టు, కేసరపల్లి, వేల్పూరు, గూడవల్లి, శ్రీ చైతన్య కాలేజీ, నిడమానూరు రైల్వేస్టేషన్, నిడమానూరు, ఎనికేపాడు, ఎంబీటీ సెంటర్, ప్రసాదంపాడు, రామవరప్పాడు రింగ్, గుణదల, పడవలరేవు, మాచవరం డౌన్, సీతారామపురం సిగ్నల్, బీసెంట్ రోడ్డు, రైల్వేస్టేషన్ ఈస్ట్, రైల్వేస్టేషన్ సౌత్, పీఎన్‌బీఎస్ దగ్గర మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మెట్రో స్టేషన్లు పూర్తిగా ఎలివేటెడ్ విధానంలో ఉంటాయి.
తొలిదశలో చేపట్టే మరో కారిడార్-2లో పెనమలూరు సెంటర్, పోరంకి, తాడిగడప, కానూరు సెంటర్, కృష్ణానగర్, అశోక్‌నగర్, ఆటోనగర్, బెంజ్‌సర్కిల్, టిక్కిల్ రోడ్, మునిసిపల్ స్టేడియం, విక్టోరియా జూబిలీ మ్యూజియం, పీఎన్‌బీఎస్ వద్ద ఈ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ బందరు రోడ్డు మధ్యభాగంలో ఎలివేటెడ్ విధానంలో ఏర్పాటు చేస్తారు. పండిట్ నెహ్రూ బస్టేషన్ వద్ద పీఎన్‌బీఎస్ తరహాలో ప్రధాన మెట్రోస్టేషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రధాన మెట్రో స్టేషన్ భవిష్యత్తులో అమరావతికి విస్తరించే మెట్రో కారిడార్ - 3 కు అనుసంధానంగా ఉంటుంది. ప్రధాన మెట్రో స్టేషన్‌ను ఎన్‌హెచ్ - 65 పై ఎలివేటెడ్ విధానంలో నిర్మిస్తారు. పీఎన్‌బీఎ్‌సలో కొంత మేర భూమిని ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని మెట్రో కార్పొరేషన్ కోరబోతోంది.
కారిడార్ -1లో నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్డు వరకు నాలుగున్నర కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ఏర్పాటు కానుంది. నిడమానూరు జంక్షన్ నుంచి మహానాడు జంక్షన్ వరకు ఎన్‌హెచ్ నేతృత్వంలో 6.50 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ మంజూరైన సంగతి తెలిసిందే. ఇదేమార్గంలో మెట్రో కారిడార్ రామవరప్పాడు రింగ్ వరకు వెళుతున్న నేపథ్యంలో ఇక్కడి వరకు దీన్ని డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌గా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన డిజైన్‌ను కూడా మెట్రో రైల్ కార్పొరేషన్ చేపడుతోంది. కేవలం ఒక్క డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికే రూ.1000 కోట్లు వ్యయం అవుతుందని తెలుస్తోంది.