Amaravati: జగన్‌కు మరో పంచ్.. నారా లోకేష్‌ను కలవనున్న వైసీపీ ఎమ్మెల్యే..
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:33 AM
అమరావతి: వైసీపీ పెద్దలతో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఆయన కలవనున్నారు.

అమరావతి: ‘నా బొమ్మ చూసే జనం వాళ్లకు ఓట్లు వేశారు. నా వల్లే వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యారు. నా మాటకు వాళ్లు కట్టుబడి ఉంటారు. ఉండాల్సిందే!’.. అనుకుంటున్న ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకం, విశ్వాసం, ధీమా అన్నీ చెరిగిపోయాయి. ‘మాకు మళ్లీ టికెట్ ఇస్తేనే మిమ్మల్ని గౌరవిస్తాం’ అని అసంతృప్త ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. ఒకరూ.. ఇద్దరూ కాదు! ఏకంగా... 42 మంది ఎమ్మెల్యేలు జగన్‌పై తిరుగుబాటు తుపాకీ గురిపెట్టారు. వాళ్లను శాంతింపజేసేందుకు తన దూత ద్వారా చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో జగన్ నాలుగు అడుగులు కిందికి దిగి మరీ అసంతృప్త ఎమ్మెల్యేలకు ‘తాడేపల్లి కోట’ ద్వారాలు తెరవాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్‌కు మరో పంచ్ పడింది. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పార్టీని వీడుడుతున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ పెద్దలు ఎమ్మెల్యేతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పార్థసారథి కలవనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీపై పార్థసారథి బహిరంగంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక టీడీపీలో చేరే అంశంపై ఈరోజు మీడియాకు ఒక స్పష్టమైన సమాచారం ఇచ్చే అవకాశం ఉంది.
కాగా పెనమలూరు నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ పెద్దలు కోరగా పార్థసారథి తిరస్కరించారు. ఎంపీగా గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకుంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పార్థసారథి వినలేదు. దీంతో పార్థసారథి పార్టీ మారుతున్నారని సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే.. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు రావడంతో.. పార్థసారథి క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు. సమన్వయకర్తలు అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్‌తో భేటీ అయ్యారు పార్థసారథి. ఈ భేటీలో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, కొడాలి నాని కూడా పాల్గొన్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు పార్థసారథిని ఒప్పించే ప్రయత్నం చేసినా.. అందుకు ఆయన అంగీకరించలేదు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని పార్థసారథి స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో జగన్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులకిందటే 11 మంది శాసన సభ్యులను ఇతర నియోజకవర్గాలకు మార్చేశారు. వీరిలోనూ చాలామందికి చివరి నిమిషంలో టికెట్లు ఎగవేస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా 80 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తమకున్న మార్గాల ద్వారా ‘అసలేం జరుగుతోంది? ఆ సర్వే సంగతులేంటి? టికెట్లు దక్కని వారి జాబితాలో మేమూ ఉన్నామా?’ అని ఆరాలు మొదలు పెట్టారు. తమను పక్కనపెట్టేశారని తెలిసి భగ్గుమంటున్నారు. అనుయాయుల వద్ద బాహాటంగానే జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడికక్కడ ‘అసమ్మతి’ సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు.