Share News

Chandrababu: జగన్ ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదు..

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:55 PM

స్మగ్లర్లకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదని, ఎర్ర చందనం దొంగల దాడిలో పోలీసులు చనిపోవడం బాధాకరమని తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ నేతల స్మగ్లింగ్‌కు అడ్డురాకుండా ప్రభుత్వం టాస్క్ ఫోర్స్‌ను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

Chandrababu: జగన్ ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదు..

అమరావతి: స్మగ్లర్లకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదని, ఎర్ర చందనం దొంగల దాడిలో పోలీసులు చనిపోవడం బాధాకరమని తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల స్మగ్లింగ్‌కు అడ్డురాకుండా ప్రభుత్వం టాస్క్ ఫోర్స్‌ను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం దొంగల చేతిలో పోలీసు కానిస్టేబుల్ చనిపోవడం బాధాకరమన్నారు. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులు చేయడంపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎర్ర చందనం తరలిస్తున్న వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన పోలీసులను స్మగ్లర్లు తమ వాహనంతో ఢీ కొట్టారని, ఈ క్రమంలో వారిని అడ్డుకోబోయిన 14వ బెటాలియన్ కానిస్టేబుల్ గణేష్ మృతి చెందడం బాధాకరమని అన్నారు.

ఎర్రచందనం స్మగ్లర్లకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చే సంస్కృతి ఉన్న పార్టీ అధికారంలో ఉంటే... వ్యవస్థలు ఎలా మనగలుగుతాయని చంద్రబాబు ప్రశ్నించారు. స్మగ్లర్లు, గూండాలకు సీఎం ప్రాధాన్యమిస్తుంటే వాళ్లు పోలీసులను ఏం లెక్క చేస్తారని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎర్రచందనం దొంగలపై కఠినంగా వ్యవహరించామని, ఎర్రచందనం వైపు స్మగ్లర్లు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని ఈ సందర్బంగా గుర్తుచేశారు. నాడు స్మగ్లింగ్‌ను అరికట్టడం కోసం పటిష్టంగా పనిచేసిన టాస్క్ ఫోర్స్‌ను ఈ ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. వ్యవస్థలు గాడి తప్పినప్పుడు అందులో అందరూ బాధితులే అవుతారని, ఇప్పుడు గణేష్ మృతికి ఈ అధికారులు, ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులపై ఎర్రచందనం దొంగలు దాడులు చేయడం, ప్రాణాలు తీయడం రాష్ట్రంలో దారుణ పరిస్థితులకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా ఎర్ర చందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Updated Date - Feb 06 , 2024 | 01:55 PM