Share News

Pawan Kalyan: నేను బతికి ఉండగా.. రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను..

ABN , Publish Date - May 04 , 2024 | 09:46 PM

తాను బతికి ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శనివారం ఆయన రేపల్లెలో జరిగిన వారాహి విజయభేరి సభలో ప్రసంగించారు. ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందన్నారు.

Pawan Kalyan: నేను బతికి ఉండగా.. రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను..

రేపల్లె: తాను బతికి ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శనివారం ఆయన రేపల్లెలో జరిగిన వారాహి విజయభేరి సభలో ప్రసంగించారు. ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందన్నారు. ఐదు కోట్ల మందికి జనసేన ధైర్యాన్ని నూరిపోసిందని చెప్పారు. ఆత్మగౌరవం దెబ్బతింటే ఎదురు తిరగాలనిపిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నట్లు పవన్ తెలిపారు.


రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం చాలా అవసరమని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు అన్ని పార్టీలు కలిసిరావాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం కనీసం పూడికలు కూడా తీయలేదన్నారు. ఉపాధి అవకాశాలు రావాలంటే పెట్టుబడులు రావాలని చెప్పారు. వైసీపీ నాయకులు రేపల్లెను పేకాట స్థావరంగా మార్చారని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. మట్టి మాఫియాలు, దోపిడీలు తప్ప అభివృద్ధి కనిపించలేదని చెప్పారు. జగన్‌ ల్యాండ్ గ్రాబింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చారని, ఇతరుల ఆస్తులు దోచుకునే నీచ స్వభావం జగన్‌ది అంటూ ధ్వజమెత్తారు.


రేపల్లె స్టేషన్‌లో దారుణ ఘటనకు శిక్ష పడి ఉండాల్సిందని చెప్పారు. తన అక్కను ఏడిపించినందుకు అమర్‌నాథ్‌ అనే వ్యక్తి ప్రశ్నించారని, అయితే అలా ప్రశ్నించినందుకు అమర్‌నాథ్‌పై పెట్రోల్‌ పోసి చంపడం దారుణమన్నారు. ఓ వైపు ఇంత జరుగుతుంటే.. మరో వైపు.. ఒకటో రెండో రేప్‌లు జరుగుతాయి అంటూ హోంమంత్రి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని తెలిపారు. ఒక ఎస్‌ఐ రెండు వారాల్లో రౌడీలను అదుపు చేయవచ్చని, అయితే వైసీపీ పాలనలో పోలీసులను ఎప్పుడూ పనిచేయించలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. బలమైన శాంతిభద్రతల చట్టం తీసుకొస్తుందని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

Updated Date - May 04 , 2024 | 10:15 PM