Share News

RK Roja: రోజా రాజకీయ జీవితం అయిపోయినట్లేనా?

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:25 PM

ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. ఏపీలో మంత్రులంతా దాదాపు ఇంటి బాట పడుతున్నారు. వారిలో రోజా కూడా ఒకరు. రెండు రౌండ్లు పూర్తవగానే రోజా ఇంటి బాట పట్టారు. వైసీపీలో ఎగిరెగిరి పడిన నేతల్లో రోజా ఒకరు. ఆమె నోటికి ఎవరైనా భయపడాల్సిందే. నియోజకవర్గానికి చేసిందేమీ లేదు కానీ పార్టీకి మాత్రం అన్నీ తానయ్యారు. అంటే పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కాదు.

RK Roja: రోజా రాజకీయ జీవితం అయిపోయినట్లేనా?

అమరావతి: ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. ఏపీలో మంత్రులంతా దాదాపు ఇంటి బాట పడుతున్నారు. వారిలో రోజా కూడా ఒకరు. రెండు రౌండ్లు పూర్తవగానే రోజా ఇంటి బాట పట్టారు. వైసీపీలో ఎగిరెగిరి పడిన నేతల్లో రోజా ఒకరు. ఆమె నోటికి ఎవరైనా భయపడాల్సిందే. నియోజకవర్గానికి చేసిందేమీ లేదు కానీ పార్టీకి మాత్రం అన్నీ తానయ్యారు. అంటే పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కాదు. అధినేత జగన్‌పై ఏ చిన్న విమర్శ వచ్చినా విరుచుకుపడటంలో.. మీడియా ముందు ప్రత్యక్షమై నోటికి పనిచెప్పే నేతల్లో కొడాలి నాని తర్వాత స్థానం రోజాదే. అలాంటి రోజా ఓటమి ముందుగానే ఫిక్స్ అయిపోయింది. ఆమెకసలు సీటే ఇవ్వొద్దని వైసీపీ నేతలంతా అధినేత వద్ద నెత్తీ నోరు కొట్టుకున్నారు. మోనార్క్ అయిన జగన్ వింటే కదా.


అధికారం రోజాది.. పెత్తనం అన్నలది..

ఎవరి మాటా వినకుండా రోజాకు టికెట్ కేటాయించారు. ఇంకేముంది? అసలే టీడీపీ హవా పెద్ద ఎత్తున వీస్తోంది. పైగా రోజాకు సొంత పార్టీ నుంచి కూడా ఏ మాత్రం బలం లేదు. అంతా వ్యతిరేకమే. జే ట్యాక్స్ మాదిరిగా తన నియోజకవర్గమైన నగరిలో రోజా ట్యాక్స్ పెట్టారు. పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారు. దందాలకు హద్దు లేకుండా పోయింది. అధికారం రోజాది.. పెత్తనం ఆమె అన్నలది. ఎన్ని కంప్లైంట్స్ వెళ్లినా అధిష్టానం కూడా పట్టించుకోలేదు. రోజా విషయంలో కన్నెర్ర చేయలేదు. వెరసి రోజా దారుణ పరాజయం దిశగా దూసుకెళుతున్నారు. ఇప్పుడు రోజా ఓటమి అయితే దాదాపు ఫిక్స్ అయినట్టే. దీనిలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ఇప్పుడు ఉద్భవిస్తున్న ప్రశ్న ఏంటంటే.. రోజా రాజకీయం జీవితం అయిపోయినట్టేనా?


వైసీపీ రాజకీయ భవిష్యత్తే అంధకారం..

వైసీపీ పరిస్థితే ఇప్పుడు ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదు. నిన్న మొన్నటి వరకూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఇటు అసెంబ్లీ, అటు లోక్‌సభలో వైసీపీ దారుణ పరాజయం పాలైంది. ఇక మీదట కేంద్రం సపోర్ట్ కూడా ఉండదు. మొత్తమ్మీద వైసీపీ అధినేతకు గడ్డుకాలమే ఇక మున్ముందు. ఇలాంటి పరిస్థితిలో రోజా రాజకీయ జీవితం మాత్రం దేదీప్యమానంగా వెలుగుతుందా? దాదాపు ఖల్లాస్. టీడీపీ కానీ.. జనసేన కానీ ఆమెను తమ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోదు. ఉంటే వైసీపీలోనే ఉండాలి. ఇప్పుడు వైసీపీ రాజకీయ భవిష్యత్తే అంధకారంగా మారింది. ఇక రోజాను పక్కనబెట్టుకుని ఏం చేస్తుంది? మొత్తానికి రోజా రాజకీయ జీవితం దాదాపు అయిపోనట్టేనని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:25 PM