AP POLITICS : మాచర్లలో నువ్వా నేనా ?
ABN , Publish Date - May 11 , 2024 | 05:16 AM
అలనాటి పల్నాటి పోరు కేంద్రమైన మాచర్లలో ఈ సారి హోరాహోరీ పోరు నెలకొంది. సమవుజ్జీలైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డి నడుమ పోరు ప్రతిష్ఠాత్మకంగా సాగుతోంది.
అలనాటి పల్నాటి పోరు కేంద్రమైన మాచర్లలో ఈ సారి హోరాహోరీ పోరు నెలకొంది. సమవుజ్జీలైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డి నడుమ పోరు ప్రతిష్ఠాత్మకంగా సాగుతోంది. తలవాకిటనే కృష్ణమ్మ.. అయినా తాగునీరు లేదు. గిరిజన తండాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి సరైన రోడ్లు లేవు. అయినా అడగడానికి వీల్లేదు.
గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు అడిగితే వారి పైకి ట్రాక్టర్లు వెళ్తాయి. గొడ్డళ్లు వీపుల మీద తారంగమాడతాయి. ఇంతటి అరాచకం రాజ్యమేలుతున్న మాచర్లపై విజయానికి రెండు ప్రధాన పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇప్పటికి నాలుగు సార్లు ఇక్కడి నుంచి గెలిచిన పిన్నెల్లి ఐదోసారి కూడా పైచేయి సాధించడానికి కృషి చేస్తున్నారు. 2004, 09ల్లో ఆయనపై పోటీచేసి ఓడిన జూలకంటికి.. టీడీపీలోని వర్గాలన్నీ ఏకతాటిపైకి వచ్చి మద్దతిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా పిన్నెల్లిని ఓడించాలన్న కసితో ఆ పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి.
మాచర్లలో 2004 నుంచి ఇప్పటి వరకు పసుపుజెండా ఎగురలేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత నాలుగు సార్లు 1983, 89, 94, 99 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందగా.. 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆయన జగన్మోహన్‌రెడ్డి పక్షాన నిలిచారు. 2012 ఉప ఎన్నికల్లో, 2014, 19ల్లో వైసీపీ నుంచే విజయం సాధించారు.
బ్రహ్మారెడ్డిది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆయన తండ్రి నాగిరెడ్డి 1972లో ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. ఆయన తల్లి దుర్గాంబ 1999లో టీడీపీ తరఫున ఎన్నికయ్యారు.
పిన్నెల్లికి వ్యతిరేక పవనాలు..
వరుసగా నాలుగు సార్లు గెలిచిన పిన్నెల్లిపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన సాగించిన అక్రమాలు, హింసాకాండ చూసి జనం నివ్వెరపోయారు. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి లిక్కర్ డాన్‌గా వ్యవహరిస్తూ అరాచకాలకు చిరునామాగా నిలిచారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి అనుచరులు చెలరేగిపోతున్నారు. టీడీపీకి ఓటు వేసిన వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు, వేధింపులు, గ్రామ బహిష్కరణలు, రాజకీయ ప్రత్యర్థులను పట్టపగలే గొంతుకోసి చంపేయడం వంటి అసాధారణ హింస చోటుచేసుకుంది.
స్థానిక ఎన్నికల్లో మాచర్ల మున్సిపాలిటీతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులన్నీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకుంది. మద్యం బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈసారి వైసీపీకి చెక్ పెట్టాలని జూలకంటి బ్రహ్మానందరెడ్డిని టీడీపీ రంగంలోకి దించింది. మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి, మరో సీనియర్ నేత చిరుమామిళ్ల మధుబాబు కూడా ఆయనకే మద్దతిస్తున్నారు.
- మాచర్ల టౌన్.
నియోజకవర్గ స్వరూపం..
కారంపూడి, దుర్గి, రెంటచింతల,
మాచర్ల, వెల్దుర్తి మండలాలు
మొత్తం ఓటర్లు: 2,62,518,
పురుషులు: 1,28,639,
మహిళలు: 1,33,743,
ట్రాన్స్‌జెండర్లు: 22
కీలక సామాజిక వర్గాల ఓటర్లు..
మాదిగ-31 వేలు, మాల-9 వేలు, రెడ్లు-28 వేలు, కమ్మ-22 వేలు, యాదవ-22 వేలు, కాపులు-17 వేలు, వడ్డెర-17 వేలు, ముస్లిం-17 వేలు, సుగాలి-17 వేలు, వైశ్యులు-12 వేలు, రజక-9 వేలు.
పిన్నెల్లి బలాలు..
వైసీపీ కేడర్ బలంగా ఉండడం.. ఆర్థికంగా సంపన్నుడు.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవం.
బలహీనతలు..
దౌర్జన్యాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం.. మామూళ్ల వసూలు.. ప్రభుత్వ భూములన్నీ బినామీల పేరిట బదిలీ.. బెదిరింపులతో కాంట్రాక్టర్లు పరార్.. పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి అరాచకాలు.
జూలకంటి బలాలు..
రాజకీయ కుటుంబ నేపథ్యం.. టీడీపీ కేడర్ అంతా ఈసారి విజయం కోసం కసిగా పనిచేస్తుండడం.. పిన్నెల్లిని ఎదుర్కోవడానికి వర్గాలన్నీ ఏకం కావడం.. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత.. 2004, 09ల్లో రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి.
బలహీనతలు..
ఆర్థికంగా అంత బలంగా లేకపోవడం...