Big Alert: భారీ ఈదురు గాలులు, అతి భారీ వర్ష సూచన..
ABN , First Publish Date - 2024-10-15T20:47:12+05:30 IST
AP Weather Report: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
అమరావతి, అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వాయుగుండం గురువారం తెల్లవారుజాము సమయానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి భారీ ఈదురు గాలులు వీస్తాయి. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
పరిస్థితి భయానకంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లవొద్దని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో బుధవారం నాడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవిన్యూ-విపత్తుల నిర్వహణ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అలర్ట్ జారీ చేశారు.