Health Department : ‘ఆరోగ్యానికి’ దిక్కెవరు బాస్!
ABN , Publish Date - Dec 24 , 2024 | 04:27 AM
వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఆరోగ్యశాఖలో రెగ్యులర్ ఐఏఎస్‌లను నియమించలేదు. ఇన్‌చార్జిలతోనే విభాగాలను నడిపించేశారు.
8 మంది ఉండాల్సిన చోట ముగ్గురు ఐఏఎస్‌లు
కీలక విభాగాలకు ఇన్‌చార్జి అధికారులే దిక్కు
వైద్య ఆరోగ్యశాఖలో విధులపై తీవ్ర ఒత్తిడి
క్షేత్రస్థాయి పర్యటనలకు ఆ ఐఏఎ్‌సలు దూరం
సచివాలయాల్లోనే ఎక్కువగా గడిపేస్తున్న వైనం
అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఆరోగ్యశాఖలో రెగ్యులర్ ఐఏఎస్‌లను నియమించలేదు. ఇన్‌చార్జిలతోనే విభాగాలను నడిపించేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి..ఆరోగ్యశాఖ ఏమైనా మారిందా అంటే.. ఇన్‌చార్జీల పాలనలోనే ఇప్పటికీ కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆరోగ్యశాఖను నడిపించేది ఎనిమిదిమంది ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారి. ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సర్వీసెస్ సెక్రటరీ, ఆరోగ్యశాఖ కమిషనర్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో, ఆయుష్ కమిషనర్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, సెకండరీ హెల్త్ కమిషనర్ పోస్టుల్లో ఐఏఎ్‌సలు ఉండాలి. ఔషధ నియంత్రణ మండలి డీజీగా సీనియర్ ఐపీఎస్ అఽధికారిని నియమించాలి. ఆంధ్రప్రదేశ్ హెల్త్ హ్యూమన్ రిసోర్సెస్ విభాగానికి ఐఏఎస్ ఉండాలి. కానీ ప్రస్తుతం ఆరోగ్యశాఖలో ముగ్గురు ఐఏఎస్‌లు, ఒక ఐఆర్‌ఎస్ అధికారి ఉన్నారు. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎ్‌సగా ఎంటీ కృష్ణబాబు ఉండగా, కమిషనర్‌గా వాకాటి కరుణ, సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా డా.ఎ.సిరి విధులు నిర్వహిస్తున్నారు. సర్వీసెస్ సెక్రటరీగా ఐఆర్‌ఎస్ అధికారిణి మంజుల హోస్మనీ కొనసాగుతున్నారు. మిగిలిన విభాగాలు ఇన్‌చార్జులతో నడుస్తున్నాయి. ఔషధ నియంత్రణ మండలి డీజీ పోస్టు భర్తీ మరిచిపోయారు.
గందరగోళం... అస్తవ్యస్తం..
సర్వీసెస్ సెక్రటరీగా ఉన్న మంజుల హోస్మనీ అదనంగా ఆయుష్ కమిషనర్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవోగా ఇన్‌చార్జీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న డా.ఎ.సిరి...ఏపీఎంఎ్‌సఐడీసీ ఎండీగా, ఔషధ నియంత్రణ మండలి డీజీగా, ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీతో పాటు మరికొన్ని అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా.. ఒకే అధికారిణికి నాలుగైదు విభాగాలను అప్పగించడం వల్ల పరిపాలన గాడి తప్పుతోందన్న అభిప్రాయం ఆరోగ్యశాఖ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఇన్‌చార్జి పోస్టుల వల్ల వారి రెగ్యులర్ విభాగాలపై అధికారులకు పట్టు తప్పుతుండటమే దీనికి కారణమని చెబుతున్నాయి. పైగా నిత్యం మీటింగ్‌ల పేరుతో సచివాలయంలోనే ఉంటున్నారు. కనీసం వారి హెచ్‌ఓడీ కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉండడం లేదు. క్షేత్రస్థాయి పర్యటనల ఊసే లేదు. ఆరోగ్యశాఖలో అధికారులు నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తేనే ఆస్పత్రుల్లో సమస్యలు తెలుస్తాయి. రోగుల ఇబ్బందులు వారి దృష్టికి వచ్చి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్యశాఖలో ఉన్న ముగ్గురు ఐఏఎ్‌సలూ ఏదో ఒక మీటింగ్ పేరుతో సచివాలయంలోనే ఉంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎక్కడివక్కడ తిష్ఠ వేసుకున్నాయి. ఎక్కువ విభాగాలకు ఇన్‌చార్జిలుగా ఉండాల్సి రావడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖాళీ పోస్టుల్లో రెగ్యులర్ ఐఏఎ్‌సలను నియమించాల్సిన అవసరం ఉన్నదని ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి.