Share News

AP NEWS: బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ABN , Publish Date - Feb 10 , 2024 | 04:43 PM

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే తమకు బకాయిలు, మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ జేఏసీ, అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) డిమాండ్ చేశారు.

AP NEWS: బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి:   బొప్పరాజు వెంకటేశ్వర్లు

అమరావతి: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే తమకు బకాయిలు, మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ జేఏసీ, అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) డిమాండ్ చేశారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగుల్లో మహిళల సంఖ్య 50 శాతం కంటే ఎక్కువగా ఉందని.. అందుకే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర , జిల్లాల మహిళా యూనిట్లను ఏర్పాటు చేసుకుందని తెలిపారు. ఉద్యోగ సంఘాల చరిత్రలోనే మహిళా విభాగాలు ఏర్పాటు కావడం ఇదే తొలిసారని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించారని చెప్పారు. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఇంతగా వైసీపీ ప్రభుత్వానికి తాము సహకరిస్తే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడం లేదని మండిపడ్డారు.

గతంలో ఉద్యమం చేసి ఆర్థికేతర అంశాలను సాధించు కున్నామని తెలిపారు. కానీ ఇప్పటికీ ఆర్థిక పరమైన అంశాలు పరిష్కారం కాలేదన్నారు. మంత్రివర్గం ఉప సంఘం బకాయిలపై ప్రభుత్వాన్ని అడగకుండా కాలయాపన చేస్తోందన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం రూ.6700 కోట్ల మేర బకాయిలు పడిందన్నారు. పోలీసులకు సరెండర్ లీవ్‌లు ఇవ్వలేదని అన్నారు. గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలు పెట్టలేదన్నారు. ఉద్యోగులుగా తాము బోనస్‌లు అడగటం లేదని.. తమకు రావాల్సిన బకాయిలను మాత్రమే అడుగుతున్నామని అన్నారు. ఇప్పటికే ఎన్నికల విధుల్లో చేరిన ఉద్యోగులకు ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు పడిందని వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. హెల్త్ స్కీమ్‌కే జబ్బు వచ్చిందని.. దానిని నయం చేస్తే ఉద్యోగులు వైద్యం చేయించుకుంటారని అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం బకాయిలను నిర్లక్ష్యం చేసిందన్న ఆవేదన, అసంతృప్తి, బాధ ఉద్యోగుల్లో ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Updated Date - Feb 10 , 2024 | 04:50 PM