Share News

Ganta Srinivasa Rao: పింఛన్ల పంపిణీపై శవ రాజకీయం చేస్తున్న సీఎం జగన్

ABN , Publish Date - Apr 04 , 2024 | 03:26 PM

పింఛన్ల పంపిణీపై సీఎం జగన్ (CM Jagan) శవ రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆరోపించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై జగన్, వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

Ganta Srinivasa Rao: పింఛన్ల  పంపిణీపై శవ రాజకీయం చేస్తున్న సీఎం జగన్

విశాఖపట్నం: పింఛన్ల పంపిణీపై సీఎం జగన్ (CM Jagan) శవ రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆరోపించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై జగన్, వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ డబ్బులను జగన్ తొత్తులకు, కాంట్రాక్టులకు ఇవ్వడంతోనే ఇబ్బందులు వచ్చాయని అన్నారు. అవ్వా తాతల ఉసురు జగన్‌కి కచ్చితంగా తగులుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 4 వేల పెన్షన్ ఇంటింటికీ వెళ్లి ఇస్తామని తెలిపారు.


గురువారం నాడు పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు వైసీపీకి రాజీనామా చేసి గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జగన్‌ పాలనకి చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భీమిలీ నుంచి తాను పోటీ చేస్తున్నానని చెప్పారు.ముగ్గురు సర్పంచులు, మాజీ సర్పంచులతో సహా 200 మంది కార్యకర్తలు ఈరోజు టీడీపీలో చేరారని తెలిపారు. పెద్దసంఖ్యలో యువత తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు.

AP News: ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తా..


చేరికలకు ఇది ఆరంభం మాత్రమేనని.. ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. జగన్ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం ఆయ్యారని విమర్శించారు. ప్రజావేదికను కూల్చి పాలన ప్రారంభించారని.. విధ్వంసంతోనే జగన్ పాలన మొదలు పెట్టారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది టీడీపీ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని వివరించారు.

సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయాలి కానీ అప్పులు చేసి కాదని ఈ విషయం జగన్ గుర్తించుకోవాలని అన్నారు. గత ఎన్నికల సమయంలో 900కు పైగా జగన్ హామీలు ఇచ్చారని.. కానీ 85 శాతం పైగా హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విభజన హామీలు సాధించడంలో జగన్ విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. కేసులకు భయపడి కేంద్రం నుంచి ఏమీ సాధించ లేకపోయారని ఎద్దేవా చేశారు.

Bhuvaneswari: కడపలో భువనేశ్వరి పర్యటన.. ఎండను కూడా లెక్క చేయకుండా...


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని జగన్ నిలదీయలేక పోయారని అన్నారు. మోదీ దగ్గరకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లే దమ్ము, దైర్యం ఆయనకు లేదని చెప్పారు. ఏపీ నుంచి పరిశ్రమలను వెళ్లగొట్టారన్నారు. విశాఖలో కవరేజ్‌కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై వైసీపీ నేతలు దాడి చేయడం అమానుషమన్నారు. వలంటీర్లు వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదని అన్నారు. వైన్ షాప్ దగ్గర టీచర్లతో మద్యాన్ని అమ్మించారని ధ్వజమెత్తారు.


ఏపీలో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపొతున్నారని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను పగడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. జగన్ అనాలోచిత చర్యలతో అమర్ రాజా, లులూ లాంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని ధ్వజమెత్తారు. జగన్ ఎన్ని ‘సిద్ధం’ సభలు పెట్టిన ఎన్డీఏ కూటమిదే ఘన విజయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ తలకిందులుగా తపస్సు చేసిన ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవదని చెప్పారు. తాను ఎవరిని వ్యక్తి గతంగా విమర్శించలేదన్నారు. ఉగాది మరుసటి రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని గంటా శ్రీనివాసరావు అన్నారు.

Gottipati Ravikumar: పేదలకు పెన్షన్ కోసం ఎందాకైనా పోరాడుతాం...

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 03:28 PM