Share News

AP Election Results: ఏపీలో రెడ్‌ అలర్ట్‌.. ఇళ్లిళ్లూ జల్లెడ పడుతున్న పోలీసులు..!

ABN , Publish Date - May 22 , 2024 | 04:24 AM

ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

AP Election Results: ఏపీలో రెడ్‌ అలర్ట్‌.. ఇళ్లిళ్లూ జల్లెడ పడుతున్న పోలీసులు..!
AP Police Cordon Search

సాధారణంగా పోలింగ్‌ రోజు పోలీసులు టెన్షన్‌తో గడుపుతారు. హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలుంటాయనే అంచనాతో అదనపు బలగాలను రప్పించి పోలింగ్‌ కేంద్రాలకు పహారాను పెంచుతారు. కానీ, రాష్ట్రంలో పోలింగ్‌ మరుసటి రోజున భారీగా హింస చోటు చేసుకుంది. ఫలితాలు వెల్లడయ్యే జూన్‌ 4వ తేదీన కూడా హింస పెచ్చరిల్లవచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం బలంగా అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారణాయుధాలు, నాటుబాంబుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇళ్లలోని అటకలు, పశువుల పాకల్లోని గడ్డివాములు, ఊరి చివర పాడుబడ్డ షెడ్లలో కార్డన్‌ సెర్చ్‌లు కొనసాగుతున్నాయి. పోలింగ్‌ బందోబస్తు కోసం వచ్చిన కేంద్ర బలగాలు... ఫలితాలు వెలువడిన తర్వాత 15 రోజులపాటు రాష్ట్రంలోనే ఉండాలని ఈసీ ఇదివరకే ఆదేశించింది.

  • ఓట్ల లెక్కింపు రోజు హింసాత్మక ఘటనలు?

  • రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల విస్తృత సోదాలు

  • మారణాయుధాలు, బాంబుల కోసం ఇల్లిల్లూ జల్లెడ

  • అటకలు, గడ్డివాములు, పాడుబడ్డ షెడ్లలో సోదాలు

  • పోలింగ్‌ అనుభవాల దృష్ట్యా పూర్తి అప్రమత్తత

  • బాణసంచా అమ్మకాలు, బాటిళ్లలో పెట్రోల్‌పై నిషేధం

  • సరైన రికార్డులు లేని వాహనాలు వందల్లో సీజ్‌

  • అనుమానితులపై సమాచారం ఇవ్వాలన్న డీజీపీ

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌): ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరస్పరం దాడులకు దిగే అవకాశం ఉందంటూ నిఘా విభాగం వరుస హెచ్చరికలతో చర్యలకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో ముమ్మర గాలింపు చర్యలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగాలు పల్నాడు, రాయలసీమ జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేశాయి. పోలింగ్‌ తర్వాత జరిగిన అల్లర్లను అడ్డుకోలేకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఎస్పీల నుంచి ఎస్‌ఐల దాకా అధికారులపై ఈసీ చర్యలతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. కౌంటింగ్‌ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకు అవకాశం

ఇవ్వకుండా పోలీస్‌ యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లాల్లో ఎక్కడికక్కడ కార్డెన్‌ సెర్చ్‌ (తనిఖీలు) చేపట్టి గట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఆదేశించారు. ఈ ఆదేశాలతో ఎస్పీలు... జిల్లాల్లో బృందాలను ఏర్పాటుచేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసేవరకూ ఎలాంటి సెలవుల్లేవంటూ సిబ్బందితో పోలీసు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. పోల్‌ డే హింస జరిగిన ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి... ప్రతి ఇల్లూ, ప్రతి మలుపులోనూ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి మారణాయుధాలు ఉన్నా స్వచ్ఛందంగా ఇవ్వాలని, తాము గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ ఇళ్ల వద్దకెళ్లి అడుగుతున్నారు. కౌంటింగ్‌ హిస్టరీ షీట్స్‌ ఉన్న ప్రతి ఒక్కరినీ అదుపులోకి తీసుకుని బైండోవర్‌ చేస్తున్నారు. సంఘ విద్రోహశక్తుల కదలికలపై నిఘాపెట్టి ఏ మాత్రం అనుమానం వచ్చినా అరెస్టు చేస్తున్నారు. వారిని దూరంగా ఉండే పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలింగ్‌ రోజు హింసకు పాల్పడిన వేలాది మందిని వెతికేందుకు పదుల సంఖ్యలో పోలీసు బృందాలు తిరుగుతున్నాయి. రాష్ట్రం దాటి వెళ్లినవారిని సైతం రప్పించి మరీ అదుపులోకి తీసుకొంటున్నారు.


జిల్లాలు జల్లెడ...

నిఘా వర్గాల హెచ్చరికతోపాటు పోలీసులకు అందిన సమాచారంతో మంగళవారం వేకువజాము నుంచే జిల్లాల్లో కార్డన్‌ సెర్చ్‌ మొదలైంది. సమస్యాత్మక ప్రాంతాలు, అనుమానిత వ్యక్తులు, ముఖ్యమైన కూడళ్లు, గడ్డి వాములు, పశువుల పాకలు, పండ్ల తోటలు.....ఇలా ఒకచోటంటూ లేకుండా జల్లెడ పడుతున్నారు. కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలు, బరిసెలు, పేలుడు పదార్థాలు, మద్యం నిల్వలు, రికార్డుల్లేని వాహనాలు, అనుమానితుల కదలికలు ఏదీ వదిలి పెట్టడం లేదు. ఎటువంటి పత్రాలులేని 1104వాహనాలను జప్తు చేశామని, 482లీటర్ల నాటుసారా, సుమారు 480లీటర్ల నాన్‌ డ్యూటీ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుడివాడ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరిగి పోలీసులు తనిఖీలు సాగించారు. నూతన వ్యక్తుల సంచారంపై ఆరా తీశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సమస్యాత్మక గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, పరిసరాలు, గడ్డి వాములలో మంగళవారం సోదాలు నిర్వహించారు. మారణాయుధాల కోసం అణువణువూ గాలించారు. అనకాపల్లి జిల్లాలో పోలీసులు మంగళవారం తనిఖీలు జరిపారు. ఎటువంటి పత్రాలు లేని 119 ద్విచక్ర వాహనాలను, ఐదు ఆటోలను, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇళ్లిళ్లూ గాలింపు..

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గడ్డి కుప్పలను, పాడుబడిన షెడ్లను పోలీసులు తనిఖీచేశారు. నంద్యాల జిల్లావ్యాప్తంగా పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. రౌడీషీటర్లు, నేరచరిత్ర గలవారికి, అనుమానితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 17మోటార్‌సైకిళ్లు, ఒక ఆటో, ఒక కారు....మొత్తం 19వాహనాలకు సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా సీజ్‌ చేశారు. త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దేవనగర్‌ వీసీ కాలనీలో 15మోటార్‌సైకిళ్లు, ఒక ఆటోను మొత్తం 16వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట, మట్కా, మద్యానికి దూరంగా ఉండాలని, మద్యం అమ్మేవారి సమాచారం ఇవ్వాలని నంద్యాల ఎస్పీ రఘువీర్‌ రెడ్డి ప్రజలకు సూచించారు. ఏలూరు జిల్లాలో ప్రతి రోజూ తనిఖీలను ఏదోఒక ప్రాంతంలో నిర్వహిస్తూనే ఉన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా కలసపాడు మండలం చింతలపల్లెలో నాకాబంది, పోలీసు కవాతు నిర్వహించారు. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలో గడ్డివాములు, ఇళ్లు తనిఖీ చేశారు. కడప నగరంలో మాక్‌డ్రిల్‌ చేశారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో కవాతు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో ఎన్నికల పోలింగ్‌ బందోబస్తు విఽధులకు వచ్చిన కేంద్ర బలగాలతో పాటు తమిళనాడు పోలీసులు కూడా ఇక్కడే మకాం వేశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పెట్రోల్‌, డీజిల్‌ బంకులలో బాటిళ్లలో ఇంధనం పోయడాన్ని ఇప్పటికే నిషేధం విధించారు. కౌంటింగ్‌ ముగిసేవరకు ఎవరికీ బాణాసంచా విక్రయాలు జరపరాదంటూ యజమానులకు నోటీసులు జారీచేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం గాంధీనగర్‌, ఇందిరానగర్‌, చవటపాలెం, టిడ్కో ఇళ్ళ సముదాయం తదితర ప్రాంతాలను పోలీసు బలగాలు చుట్టుముట్టి విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఉదయం 8 గంటల నుంచీ 10 గంటల వరకూ దాదాపు ఇల్లిల్లూ గాలించారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు, టంగుటూరు పంచాయతీ, వెలిగండ్ల మండలంలోని మరపగుంట్ల, కొత్తపట్నం మండలంలోని రెడ్డిపాలెం, మద్దిపాడు, గిద్దలూరు, మార్కాపురం పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

మూడు రోజుల్లో 301ప్రాంతాల్లో తనిఖీలు: డీజీపీ గుప్తా

రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లో 301 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 4,668మందిని గుర్తించి, పలువురిని అరెస్టు చేశామని చెప్పారు. పోలింగ్‌ ముందు రోజు నమోదైన కేసుల్లో 1522, పోలింగ్‌ రోజు నమోదైన కేసుల్లో 2790, పోలింగ్‌ తర్వాత నమోదైన కేసుల్లో 356మందిని గుర్తించినట్లు వివరించారు. ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఏదైనా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉన్నా, అనుమానిత వ్యక్తుల కదలికలపైనా పోలీసులకు(డయల్‌ 100) సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేర నియంత్రణలో పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఓట్ల లెక్కింపు తర్వాతా కేంద్ర బలగాలు

ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జూన్‌ 4న ముగిసినా నెలాఖరు వరకూ కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రంలోనే కొనసాగించాలని సీఈసీ ఆదేశించింది. ఇప్ప్డటికే కేంద్ర హోంశాఖ పంపిన 25 కంపెనీల ఫోర్స్‌....రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఉంది. కౌంటింగ్‌ అనంతరం అఽధికారంలోకి వచ్చే పార్టీ, ఓడిన పార్టీకి చెందిన శ్రేణులు పరస్పరం దాడులు చేసుకునే అవకాశం ఉందన్న నిఘా హెచ్చరికలతో ఈ బలగాలను కొనసాగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాతే కేంద్ర సాయుధ బలగాలు రాష్ట్రం నుంచి తిరిగి వెళ్లనున్నాయి.

టీడీపీ వర్గీయులపై కొడవళ్లతో దాడి

శింగనమలలో వైసీపీ నాయకుల దాష్టీకం

శింగనమల, మే 21: ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేశారన్న ఆక్రోశంతో అనంతపురం జిల్లాలో వైసీపీ వర్గీయులు దాడులకు తెగబడుతున్నారు. శింగనమల మండలం శివపురం గ్రామానికి చెందిన బోయ పెద్దన్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పనిచేశారు. దీంతో వైసీపీ వర్గీయులు ప్రసాద్‌, మురళి, శేఖర్‌, రాజు, వెంకటరమయ్య, భాస్కర్‌, క్రాంతి తదితరులు మంగళవారం సాయంత్రం మద్యంతాగి పెద్దన్న ఇంటిపై దాడి చేశారు. తప్పించుకున్న పెద్దన్న తన అన్న కొండప్ప ఇంట్లోకి దూరాడు. వెంబడించిన వైసీపీ వర్గీయులు.. కొండప్ప, ఆయన కూతురు హిమజ కుమారి, అల్లుడు మురళి, పెద్దన్న భార్య పద్మావతిపై దాడి చేశా రు. తీవ్రగాయాల పాలైన నలుగురినీ అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసినందుకు వైసీపీ అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్‌ ఇంటిపై ఆ పార్టీ నాయకులు దాడికి యత్నించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నజలాలపురంలో మంగళవారం జరిగింది. శింగనమల వైసీపీ టికెట్‌ను సిటింగ్‌ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వర్గీయుడైన వీరాంజనేయులుకు ఆ పార్టీ కేటాయించింది. దీంతో ఎమ్మెల్యే, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డిని వ్యతిరేకించే వర్గం టీడీపీ తరఫున పనిచేసింది. వీరిలో పట్నం నగేశ్‌ ఉండ టంతో ఆగ్రహించిన సాంబశివారెడ్డి మేనమామ బొమ్మన శ్రీరామిరెడ్డి, ఆయన బావమరిది బాలిరెడ్డి, సొదనపల్లి సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి తదితరులు నగేశ్‌ ఇంటికెళ్లి బకాయి డబ్బులు చెల్లించాలంటూ దూషణలకు దిగడంతో పాటు దాడికి యత్నించారు. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడినుంచి జారుకున్నారు. ఈ ఘటనపై శింగనమల పోలీ్‌సస్టేషన్‌లో నగేశ్‌ ఫిర్యాదు చేశారు. శ్రీరామిరెడ్డికి తాను బకాయి లేనని, ఇవ్వాల్సిన రూ.3.50లక్షలు గతంలోనే ఇచ్చేశానని తెలిపారు.

Updated Date - May 22 , 2024 | 02:30 PM