Share News

AP Politics: జగన్‌ సేవలో జవహర్‌.. ఈసీ, కేంద్రం ఆదేశాలు బేఖాతర్..!

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:22 AM

ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందంటే... ఈసీ చెప్పినట్లు వినాల్సిందే. ఈసీ ఆదేశాలు పాటించాల్సిందే. కేంద్రం సూచనలు, ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. కానీ... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి తీరే వేరు! ఆయన ఇప్పటికీ జగన్నామ స్మరణ చేస్తూనే ఉన్నారు. గీత దాటి మరీ జగన్‌

AP Politics: జగన్‌ సేవలో జవహర్‌.. ఈసీ, కేంద్రం ఆదేశాలు బేఖాతర్..!
CS Jawahar

  • ఈసీ ఆదేశాలు, కేంద్రం ఉత్తర్వులూ బేఖాతర్‌

  • అంతా మా ఇష్టమంటున్న సీఎస్‌ జవహర్‌ రెడ్డి

  • ‘రెవెన్యూ ఇంటెలిజెన్స్‌’కు రాజేశ్వర్‌ రెడ్డే కావాలట

  • ఆయనను వెనక్కి పంపాలని కేంద్రం ఆదేశాలు

  • ‘కీలక సమయం’లో కష్టమంటూ జవహర్‌ జవాబు

  • సచివాలయ ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డికి రక్షణ

  • పొలిటికల్‌ ప్రచారం చేస్తూ దొరికిపోయినా అంతే

  • సస్పెండ్‌ చేయాలని ఈ నెల 8న ఈసీ ఆదేశం

  • ఫైలు తొక్కిపెట్టిన సీఎస్‌ జవహర్‌ రెడ్డి

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందంటే.. ఈసీ చెప్పినట్లు వినాల్సిందే. ఈసీ(Election Commission) ఆదేశాలు పాటించాల్సిందే. కేంద్రం(Central Government) సూచనలు, ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. కానీ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి (CS Jawahar) తీరే వేరు! ఆయన ఇప్పటికీ జగన్నామ స్మరణ చేస్తూనే ఉన్నారు. గీత దాటి మరీ జగన్‌ సేవ చేస్తున్న ‘అక్రమార్కులను’ కాపాడుతున్నారు. ‘మనోడైతే చాలు, వైసీపీకి రాజకీయంగా పనికొస్తారనుకుంటే చాలు’... వారి మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఆదేశాలిచ్చింది ఈసీ అయినా.. కేంద్రం అయినా.. రాష్ట్రంలో ఉన్న వైసీపీ బాస్‌ ఆదేశాలే తనకు శిరోధార్యమన్నట్టు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. విపక్ష నేతల వ్యాపారాలే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్న రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ స్పెషల్‌ కమిషనర్‌ చిలకల రాజేశ్వర్‌ రెడ్డి డిప్యూటేషన్‌ను రద్దు చేసి, తిరిగి తమ సేవలకు పంపించాలని కేంద్రం ఆదేశించినా సీఎస్‌ పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగినని మరిచిపోయి.. జగన్‌ కోసం ‘పొలిటికల్‌’ ప్రచారంలోకి దిగిన సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్‌ చేయాలని ఈసీ ఆదేశించినా జవహర్‌రెడ్డి వినిపించుకోలేదు.


పంపించమన్నా.. వినని సీఎస్‌

ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఆదాయపు పన్నుశాఖలో పని చేస్తున్న చిలకల రాజేశ్వరరెడ్డిని జగన్‌ సర్కారు రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ స్పెషల్‌ కమిషనర్‌గా నియమించింది. 2021 ఆగస్టులో... ఐదేళ్ల డిప్యుటేషన్‌పై ఆయన రాష్ట్రానికి వచ్చారు. ఇటీవల ఆయన వ్యవహార శైలి మరింత వివాదాస్పదంగా మారింది. విపక్ష నేతలు, సానుభూతిపరులే ఆయన లక్ష్యం. మంగళగిరిలో చేనేత వస్త్ర వ్యాపారులపై దాడులు చేసినా... చీమకుర్తి, చిలకలూరిపేటలో గ్రానైట్‌ పరిశ్రమల్లో సోదాలు చేసినా అంతే! ఇటీవల టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు తనయుడిపై కేసులు పెట్టి అరెస్టు చేయించింది ఈయనే. టీడీపీ నేతలే కానక్కర్లేదు... ఆ పార్టీ సానుభూతిపరులైనా, మద్దతుదారులైనా రాజేశ్వర్‌రెడ్డి ఊరుకోరు. ‘జగన్‌కు మద్దతు పలికితే ఈ సమస్యలు ఉండవు కదా’ అని నేరుగానే వ్యాపారులకే ఉచిత సలహాలు ఇచ్చిన చరిత్ర ఆయనది. ఆయన నిర్వాకాలపై విపక్షాలు సాక్ష్యాధారాలతో సహా కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. స్పందించిన కేంద్రం... తక్షణం ఆయనను ఢిల్లీకి పంపించాలని సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆదేశించింది. తమకు అధికారుల కొరత ఉందని మాత్రం తెలిపింది. డిప్యుటేషన్‌ కాలం ముగియడానికి ఏడాదిన్నర ముందే ఆయనను తిరిగి పంపించాలని ఆదేశించింది. కానీ... ‘కీలకమైన సమయం’లో రాజేశ్వర్‌ రెడ్డిని వదులుకునేందుకు సీఎస్‌ ఇష్టపడలేదు. ఆయనను ఈ సమయంలో పంపడం కుదరదని సదరు ఫైలు పక్కన పెట్టారు. ఈ నెల 10 నుంచి అలాగే పెండింగ్‌లో ఉంచారు. రాష్ట్రంలో ఇతర అధికారులే లేరా అన్నట్టు రాజేశ్వర్‌ రెడ్డి సేవలే కావాలని ఎందుకు అడుగుతున్నట్లు?


సమస్యలపైనే చర్చించారట!

వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయిన వెంకట్రామి రెడ్డి బుకాయింపులు మొదలుపెట్టారు. బద్వేలు, మైదుకూరు, కడపలో ఆర్టీసీ ఉద్యోగులను కలిపి కేవలం వారి సమస్యలపై మాత్రమే చర్చించానని, ఎలాంటి ప్రసంగాలు చేయలేదని మంగళవారం సీఈవో మీనాకు వినతిపత్రం ఇచ్చారు. సస్పెండ్‌ చేసిన 11 మంది ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తనను సస్పెండ్‌ చేయాలంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలను తొక్కిపెట్టి, ఇప్పటికే సస్పెండ్‌ చేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలంటూ వివరణ ఇప్పించడమే ఇక్కడ విశేషం.

సంఘం గుర్తింపు రద్దు చేయాలి

రోసా నిబంధనలు 2 ఏ (8) ప్రకారం ఏ సంఘం నాయకుడైనా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే ప్రభుత్వం ఆ సంఘం గుర్తింపు ఉపసంహరించుకోవాలి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణకు ఈ నిబంధనను వర్తింపజేసిన ప్రభుత్వం వెంకట్రామిరెడ్డికి ఎందుకు వర్తింపజేయడం లేదు?


వెంకట్రామిరెడ్డికి సీఎస్‌ రక్షణ..

ఆయన పేరు వెంకట్రామి రెడ్డి. పేరుకే ఉద్యోగ సంఘం నాయకుడు! తీరు మాత్రం... వైసీపీ సేవకుడు! ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు. మార్చి 31న కడప, బద్వేలు, మైదుకూరు ఆర్టీసీ డిపోల్లో వెంకట్రామిరెడ్డి ఏకంగా ఎన్నికల ప్రచారమే చేశారు. ‘ప్రజారవాణా శాఖ మిత్రులారా! ప్రభుత్వ రుణం తీర్చుకోండి’ అంటూ తన పేరిట ముద్రించిన రెండు పేజీల కరపత్రాలను పంచిపెట్టారు. దీనిపై ఈసీ తీవ్రంగా స్పందించింది. వెంకట్రామిరెడ్డిని సస్పెండ్‌ చేయాలంటూ ఈ నెల 8న ఆదేశాలిచ్చింది. ఈసీ ఆదేశించిందంటే... అమలు చేయాల్సిందే. ముందు సస్పెండ్‌ చేయాలి. ఆ తర్వాతే సంజాయిషీలు, వివరణలు! తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీశ విషయంలోనూ ఇదే జరిగింది. ముందుగా ఆయనను సస్పెండ్‌ చేసి, వివరణ కోరారు. ఆ వివరణపై సీఎస్‌, సీఈవో స్పందనల ఆధారంగా తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకున్నారు. కానీ... వెంకట్రామి రెడ్డికి స్వయంగా సీఎస్‌ అండగా నిలిచారు. ఈ నెల 8 నుంచి 13 వరకు ఆ ఫైలు జీఏడీలోని వివిధ అధికారుల మధ్య తిరిగింది. 14న సీఎస్‌కు చేరింది. వెంకట్రామిరెడ్డిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వైసీపీకి వీరవిధేయుడు వెంకట్రామిరెడ్డిని కాపాడుతూ వస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే... బస్‌ డిపోల్లో వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారంటూ తిరుపతి డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ చంద్రయ్య సహా మరి కొందరిని ఆర్టీసీ యాజమాన్యం 4వ తేదీనే సస్పెండ్‌ చేసింది. వెంకట్రామిరెడ్డిని మాత్రం సీఎస్‌ కాపాడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 07:09 AM