Share News

AP Elections 2024: ఈసీ కీలక ప్రకటన.. ఆ ఓటర్లకు మరో అవకాశం

ABN , Publish Date - May 05 , 2024 | 04:03 PM

ఎలక్షన్ కమిషన్ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. త‌మ ఎన్నిక‌ల‌ డ్యూటీ ఆర్డర్‌, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేష‌న్ సెంట‌ర్‌కు తీసుకువెళ్లి ఓటు పొందవచ్చని తెలిపింది. ఇలాంటి వారి కోసం..

AP Elections 2024: ఈసీ కీలక ప్రకటన.. ఆ ఓటర్లకు మరో అవకాశం

ఎలక్షన్ కమిషన్ (Election Commission) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. త‌మ ఎన్నిక‌ల‌ డ్యూటీ ఆర్డర్‌, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేష‌న్ సెంట‌ర్‌కు తీసుకువెళ్లి ఓటు పొందవచ్చని తెలిపింది. ఇలాంటి వారి కోసం ఈ నెల 7, 8 తేదీల్లో ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఈ మేరకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) కీలక ప్రకటన చేశారు. విజయనగరం జిల్లా జేఎన్టీయూ గుర‌జాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేష‌న్ సెంట‌ర్‌ను ఆయన సందర్శించారు. ఓటింగ్‌కు చేసిన ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ‌, హెల్ప్ డెస్క్స్, క్యూలెన్లు, పోలింగ్ బూత్‌ల‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా.. ఓట‌ర్లతో మాట్లాడి వారి స‌మ‌స్యల‌ను, ఏర్పాట్లపై వారి అభిప్రాయాల‌ను సీఈవో ముఖేష్ కుమార్ తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌక‌ర్యాన్ని వినియోగించుకునేందుకు గాను ఈ నెల 7, 8 తేదీల్లో మ‌రో అవకాశం ఇస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ స‌దుపాయాన్ని క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా తాము పని చేస్తున్నామని అన్నారు. అన్ని ఫెసిలిటేష‌న్ సెంట‌ర్లలో క‌నీస మౌలిక స‌దుపాయాల‌ను, హెల్ప్ డెస్క్‌ల‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌కు రాష్ట్రవ్యాప్తంగా ప‌క్కా ఏర్పాట్లు చేశామని.. ఎన్నిక‌ల సిబ్బందికి ఇప్పటికే రెండు విడ‌త‌ల శిక్షణ ఇచ్చామని చెప్పారు. వివిధ విభాగాల‌ నుంచి తాము ఫిర్యాదుల్ని స్వీక‌రిస్తున్నామన్న ఆయన.. సీ-విజిల్ ద్వారా ఎక్కువ ఫిర్యాదుల అందుతున్నాయన్నారు. ఇప్పటివ‌ర‌కు సుమారు 16,000 ఫిర్యాదులు వచ్చాయని.. వీటిలో 99 శాతం ఫిర్యాదుల‌పై చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. ఇప్పటివ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.450 కోట్లు విలువైన న‌గ‌దు, మ‌ద్యం, విలువైన ప‌రిక‌రాలు, వ‌స్తువుల‌ను సీజ్ చేశామన్నారు.


సీఎం సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ విఫలం: రాజ్‌నాథ్ సింగ్

అంతేకాదు.. స్వయంగా త‌మ కార్యాల‌యానికే 500 ఫిర్యాదులు రాగా.. వాటిల్లో 450 ఫిర్యాదుల‌పై చర్యలు తీసుకున్నామని ముఖేష్ కుమార్ పేర్కొన్నారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే పోస్టుల‌పై ఫిర్యాదు వచ్చినా.. వెంటనే యాక్షన్ తీసుకుంటున్నామన్నారు. తొలుత సంబంధిత పోస్టుల‌ను ఆ సోష‌ల్ మీడియా వేదిక‌ల నుంచి తొలగిస్తున్నామని, ఆ తర్వాత సంబంధిత పార్టీ లేదా అభ్యర్ధిపై కేసులు న‌మోదు చేస్తున్నామని తెలిపారు. ఎన్నిక‌ల‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు, ప్రలోభాలను అరిక‌ట్టేందుకు ప‌టిష్టమైన నిఘా వ్యవ‌స్థను ఏర్పాటు చేశామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్‌, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామ‌ని.. ప్రతి మండ‌లంలో మండ‌ల అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అక్రమ మ‌ద్యం రాకుండా ప‌టిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. మ‌ద్యం ఉత్పత్తి కేంద్రాలు, డిస్ట్రిబ్యూష‌న్ సెంట‌ర్ల వ‌ద్ద సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశామన్న ఆయన.. వాహ‌నాల‌కు జీపీఎస్ ఏర్పాటు చేసి, మ‌ద్యాన్ని ఎక్కడికి ర‌వాణా చేస్తున్నారనే విషయాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఇత‌ర రాష్ట్రాల‌నుంచి మ‌న రాష్టంలోకి అక్రమ మ‌ద్యం రాకుండా చ‌ర్యలు తీసుకున్నామన్నారు.

మంత్రి అంబటికి సొంత అల్లుడు ఝలక్.. సంచలన వీడియో విడుదల..!

రాష్ట్రంలో సుమారు 12,400 సున్నిత‌, అతి సున్నిత పోలింగ్ కేంద్రాల‌ను గుర్తించి.. ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని సీఈవో ముఖేష్ వెల్లడించారు. సున్నిత‌, అతి సున్నిత ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్‌, కేంద్ర బ‌ల‌గాల‌ను వినియోగించ‌డం, మైక్రో అబ్జర్వర్ల నియామ‌కం, వీడియోగ్రఫీ త‌దిత‌ర చర్యలు తీసుకున్నామన్నారు. రాజ‌కీయంగా సున్నితంగా ఉన్న 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల సూచ‌న‌ల మేర‌కు అద‌న‌పు భ‌ద్రతా చ‌ర్యలు, వెబ్ కాస్టింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. వేస‌విని దృష్టిలో ఉంచుకొని.. ఓటింగ్‌ రోజు ప్రత్యేక చ‌ర్యలు చేప‌డుతున్నామన్నారు. ఎండ త‌గ‌ల‌కుండా క్యూలైన్ల వద్ద నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేశామని.. అలాగే మ‌హిళ‌లు, వృద్దులు, విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక క్యూలైన్లను సిద్ధం చేశామన్నారు. అలాగే.. త్రాగునీరు, వైద్య శిబిరాల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 05 , 2024 | 04:03 PM