Share News

AP Elections 2024: సూపర్‌ సిక్స్‌ ముందు.. జగన్‌ మేనిఫెస్టో వెలవెల!

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:36 AM

రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల ముందు సీఎం జగన్‌ మేనిఫెస్టో తేలిపోయిందని టీడీపీ వ్యాఖ్యానించింది...

AP Elections 2024: సూపర్‌ సిక్స్‌ ముందు.. జగన్‌ మేనిఫెస్టో వెలవెల!

  • అభివృద్ధి చేయలేనని సీఎం చేతులెత్తేశారు

  • పింఛన్లపై అవ్వాతాతలకు షాకిచ్చారు: టీడీపీ

  • ఎల్లుండి కూటమి మేనిఫెస్టో విడుదల

అమరావతి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన సూపర్‌ సిక్స్‌ (TDP Super Six) హామీల ముందు సీఎం జగన్‌ మేనిఫెస్టో (YS Jagan Manifesto) తేలిపోయిందని టీడీపీ వ్యాఖ్యానించింది. అందులో అభివృద్ధి ఊసే లేదని.. అభివృద్ధి చేయలేనని జగన్‌ చేతులెత్తేశారని విమర్శించింది. టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి, ఎమ్మెల్సీ అశోక్‌బాబు శనివారమిక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘అవ్వా తాతలకు జగన్‌ షాక్‌ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి నెలకు రూ.4 వేలు పింఛను ఇస్తానని చంద్రబాబు హామీఇస్తే తాను నాలుగేళ్లపాటు కేవలం రూ.3 వేలే ఇస్తానని జగన్‌ చెప్పారు. ఎప్పుడో 2028లో రూ.250 పెంచుతానన్నారు. 2019 మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేసి ఓట్లడుగుతానని చెప్పారు. ఇప్పుడా ఊసే లేదు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని పోయినసారి డంబాలు పలికి ఈసారి దాని మాటే ఎత్తలేదు. పోలవరం ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తానని గతంలో చెప్పి ఈసారి పోలవరం అన్న పదమే లేకుండా జాగ్రత్తపడ్డారు. వైసీపీ మేనిఫెస్టో చూసి ఆ పార్టీ శ్రేణులే తిట్టుకుంటున్నాయి’ అని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.20 లక్షల కోట్లని, ఐదేళ్లలో ఇది రూ.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నా ఇంకా పాత హామీలే కొనసాగిస్తానని జగన్‌ చెప్పడం సిగ్గుచేటని జీవీ రెడ్డి విమర్శించారు.

అంతా మోసం.. మాట తప్పాడు!

‘2014-19 మధ్య కాలంలో రైతు భరోసా కింద జగన్‌ రాష్ట్రంలోని రైతులకు ఒక్కో కుటుంబానికి రూ.37,500 ఇచ్చారు. టీడీపీ హయాంలో రుణ మాఫీ కింద ఒక్కో రైతుకు రూ.75 వేలు ప్రయోజనం చేకూరింది. అన్నదాత పథకం కింద రైతులకు రూ.20 వేలు ఇస్తామని టీడీపీ చెబితే తాను కేవలం రూ.16 వేలే ఇస్తానని జగన్‌ చెబుతున్నారు. మద్య నిషేధం, కరెంటు చార్జీలు, ఇసుక, పెట్రోలు, డీజిల్‌పై తాను ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. పాతిక లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు. అంగన్‌వాడీ, ఆశా, హోంగార్డులను మోసగించారు. సీపీఎస్‌ రద్దు, మెగా డీఎస్సీపై మాట తప్పాడు. మేనిఫెస్టోలో 85 శాతం హామీలు అమలు చేయలేదు. కానీ 99ు అమలు చేశామని అసత్యాలు చెబుతున్నాడు. తనకు మేనిఫెస్టో బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతతో సమానమంటూ ఆ పవిత్ర గ్రంఽథాలను కూడా జగన్‌ అవమానిస్తున్నాడు’ అని విమర్శించారు. కాగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ మేనిఫెస్టోను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నాయి. మూడు పార్టీల ముఖ్య నేతలు సంయుక్తంగా దీనిని విడుదల చేస్తారు.

Updated Date - Apr 28 , 2024 | 08:59 AM