Share News

Chandrababu: పీలేరు సభా వేదికపైకి చేరుకున్న చంద్రబాబు

ABN , Publish Date - Jan 27 , 2024 | 12:47 PM

Andhrapradesh: ‘‘రా.. కదలిరా’’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ తీరు, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Chandrababu: పీలేరు సభా వేదికపైకి చేరుకున్న చంద్రబాబు

చిత్తూరు, జనవరి 27: ‘‘రా.. కదలిరా’’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ తీరుపై, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు నేటి (శనివారం) నుంచి వరుసగా మూడు రోజులు ఆరు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ముందుగా అన్నమయ్య జిల్లా పీలేరు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. కాసేపటి క్రితమే ప్రత్యేక హెలికాప్టర్‌లో చంద్రబాబు పీలేరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు వేదికపైకి చేరుకున్నారు. వేదికపైన చంద్రబాబు నాయుడు పక్కనే జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌తో పాటు ఇతరు నేతలు ఆసీనులయ్యారు.

వైసీపీపై మండిపడ్డ నేతలు...

ఈ సందర్భంగా సభా వేదికపై నేతల ప్రసంగాలు కొనసాగాయి. రాష్ట్రాన్ని గంజాయి మయం చేసి, అభివృద్ధికి, అనేక హామీలకు నో చెప్పిన జగన్‌కు కూడా ప్రజలు నో చెప్పి ఇంటికి పంపుతారని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌ హెచ్చరించారు.

రాజంపేట పరిధిలోని వైసీపీ ఒకే ఒక బీసీ ఎమ్మెల్యేను కనీసం నియోజక వర్గంలో తిరగనీయలేదని.. అది బీసీల పట్ల వాళ్లకు ఉన్న గౌరవమని తంబళ్ళ పల్లి టీడీపీ ఇంచార్జి శంకర్ యాదవ్ మండిపడ్డారు. తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఓ రాక్షసుడన్నారు. మూడువందల ఎకరాలు మల్లయ్య ఆలయ భూములు ఆక్రమించారని మండిపడ్డారు. తంబళ్లపల్లెకు ఏ రకమైన సంబంధం లేకపోయినా ఇక్కడికి వలస వచ్చి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వెయ్యి ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. 800 కోట్లు ఇసుకను కర్ణాటకకు తరలించారని శంకర్ యాదవ్ మండిపడ్డారు.

వరుసగా మూడు రోజులూ సభలే...

కాగా.. పీలేరుతో పాటు ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పీలేరు మండలంలోని వేపులబయలకు చేరుకున్నారు. అక్కడి బహిరంగ సభలో టీడీపీ చీఫ్ ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం ఉరవకొండ బహిరంగ సభలో పాల్గొననున్నారు. రేపు (28న) నెల్లూరు రూరల్, పత్తికొండల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న రాజమండ్రి రూరల్, పొన్నూరులో జరగనున్న సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.


అన్నగారి స్ఫూర్తితో ముందుకు...

‘రా.. కదలిరా!’ అన్న పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలిరా’ అని ఇచ్చిన నినాదానికి అశేష తెలుగు ప్రజానీకం మంత్రముగ్ధులయ్యారు. టీడీపీని అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆ నినాదాన్ని పేరుగా మార్చుకుని ఎన్నికల రణరంగంలోకి దిగాలని టీడీపీ నిర్ణయించింది. ‘రా.. కదలిరా’ పేరుతో ఈ నెలలో 12 రోజుల్లో మొత్తం 22 సభలు నిర్వహించాలని చంద్రబాబు తలపెట్టారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 27 , 2024 | 01:03 PM