Madanapalle Incident: మదనపల్లి ఘటనపై ఏపీ డీజీపీ అనుమానాలు ఇవీ..
ABN , Publish Date - Jul 22 , 2024 | 07:39 PM
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఘటన (Madanapalle Incident) తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. అసలేం జరిగింది..?..
అన్నమయ్య జిల్లా/మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఘటన (Madanapalle Incident) తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. అసలేం జరిగింది..? ఇది ప్రమాదవశాత్తు జరిగినదా..? లేకుంటే కుట్రా..? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు..? అని తేల్చడానికి లోతుగా విచారణ జరుగుతోంది. ఘటనపై ఎస్పీడీసీఎల్, ఫైర్ సిబ్బంది నుంచి ప్రాథమిక నివేదిక కోరిన డీజీపీ ద్వారకా తిరుమలరావు.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్వయంగా ఘటనాస్థలికి వెళ్లి నిశితంగా పరిశీలించారు. ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదని, ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందని డీజీపీ అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమే లేదని.. కిటికీ బయట అగ్గిపుల్లలు కూడా కనిపించాయన్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు.

యాక్సిడెంట్ కానే కాదు..!
‘మదనపల్లె ఆర్డీఓ ఆఫీసులో నిన్న రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇది యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్. 3 గంటల పాటు సంఘటన స్థలాన్ని పరిశీలించాను. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అగ్ని ప్రమాదంగా అనిపించట్లేదు. ఆర్డిఓ ఆఫీసులో కొద్దిరోజులుగా సీసీ టీవీ కెమెరాలు పని చేయట్లేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం ఆర్డీవోకు తెలిసింది కానీ.. ఎందుకో కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. స్థానిక సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా.. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశమే లేదని విచారణలో తేలింది. కేసు దర్యాప్తునకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. జిల్లా అదనపు ఎస్పీ రాజకమల్ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నియమిస్తున్నాం. అవసరాన్ని బట్టి కేసును సీఐడీకు బదిలీ చేసే ఆంశంపై నిర్ణయం తీసుకుంటాం. ఆఫీసులో ఫైల్స్ అన్నీ ఒకచోట కాకుండా చాలా దూరంగా కాలి పడివున్న తీరు పలు అనుమానాలు కలిగిస్తోంది. కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. ఇవన్నీ అనుమానాలను మరింత పెంచుతున్నాయి’ అని డీజీపీ తిరుమల రావు మీడియాకు వెల్లడించారు.

తప్పించుకోలేరు..!
‘ఆర్డీఓ ఆఫీసులో ఇక్కడ వోల్టేజ్ తేడాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా చెప్పారు. బీరు బాటిళ్లు కూడా పడి ఉన్నాయి. అధికారులు అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్‌లో అన్ని తేలుతాయి.. అన్ని వివరాలూ బయటకొస్తాయి. కొన్ని ఫైల్స్ ఈ- ఆఫీసులో అందుబాటులో ఉన్నాయి. తప్పు చేసినవారు తప్పించుకోలేరు. ఇటీవల కాలంలో సాక్ష్యాలను నాశనం చేసే ఘటనలు కొన్ని జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించాం. కేసు సీఐడీకి బదిలీ చేసే అంశంపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. అసలు ఈ ఘటన యాక్సిడెంట్ కాదు.. కుట్రో కాదో విచారణలో నిగ్గు తేలుస్తాం. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. పోలీసు శాఖ కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందించాలి’ అని ప్రజలు, అధికారులకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. మొత్తం 25 అంశాలకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయని కలెక్టర్ చెబుతున్నారు. అసలు ఆ కాలిపోయిన ఫైళ్లు ఏంటో గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు.