AP Deputy CM : ఇక నెలలో 14 రోజులు జనంలోనే..
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:20 AM
కార్యాలయాల్లో కూర్చొని ప్రజల సమస్యలకు పరిష్కారాలు వెతకాలని చూస్తే గందరగోళానికి గురవుతామనీ, అందుకే జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

కార్యాలయంలో కూర్చుంటే సమస్యలు తెలియవు
తనిఖీలు చేసి తిరిగొచ్చేస్తే పెద్ద ఫలితం ఉండదు
అందుకే జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నా
జనసేనలో పనితీరే ప్రామాణికంగా పదవులు
నాకు బంధుప్రీతి ఉంటే నాగబాబుకు మొదట్లోనే పదవి
ప్రస్తుతానికి ఎమ్మెల్సీ చేస్తాం..
మా పాలన సంతృప్తికరం
మీడియాతో పవన్ చిట్‌చాట్
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : కార్యాలయాల్లో కూర్చొని ప్రజల సమస్యలకు పరిష్కారాలు వెతకాలని చూస్తే గందరగోళానికి గురవుతామనీ, అందుకే జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నెలలో 14 రోజులు జిల్లాల్లో ప్రజల మధ్య ఉండాలని అనుకుంటున్నానని ఆయన వివరించారు. సోమవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాప్రతినిధులతో పవన్ కల్యాణ్ చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి పంచాయతీల్లోనేఉందని, ఆ శాఖను చూడటం వరంగా భావిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ‘‘అక్కడెక్కడో ఉంటాడు... ఏం వస్తాడులే’ అనే నిర్లక్ష్యం పోగొట్టడానికే కడప జిల్లాకు వెళ్లాను. అవసరమైతే ఎంత దూరమైనా వస్తాననే గట్టి సంకేతం అందించాను. ఉద్యోగి ఎవరనేది కాదు.. దాడి జరిగితే వెళ్లి పరామర్శిస్తాను’’ అని ఆయన తెలిపారు. ‘‘రోడ్ల నిర్మాణంలో నాణ్యత ఉండటం లేదని, సర్పంచ్‌లు పట్టించుకోవడం లేదని ఏజెన్సీ ప్రాంత పర్యటనలో నాకు చెప్పారు. వేసిన రోడ్లను తనిఖీ చేసి వెనక్కి రావడం కాదు.. అక్కడే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దానివల్ల మెటీరియల్ పక్కదారి పట్టకుండా ఉంటుంది. అధికారుల్లో జవాబుదారితనం నెలకొంటుంది.’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..
అయినా.. ముందుకే..
’’రాష్ట్రంలో పాలనావ్యవస్థలను వైసీపీ చిందరవందర చేసింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా నలిపేసింది. పని సంస్కృతిని పాడు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ మేం ఆరు నెలల పాలనను పూర్తి చేయగలిగాం. ఏదీ ఆగకుండా అందించగలుగుతున్నాం. పాలన విషయంలో వైసీపీకి, మాకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. రాష్ట్రంలో ఆనాడుతప్పులు జరుగుతుంటే ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని కలెక్టర్లను ప్రశ్నిస్తే వారి వద్ద సమాధానం లేదు. అప్పుడు చెప్పడానికి భయపడ్డారు.. ఇప్పుడు మేం అడిగితే ‘మేం అధికారులం.. ఏం చేయగలం’ అని అంటున్నారు లోపం ఎక్కడనేది అధికారులు బయటకు చెప్పకపోయినా.. తమ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. పాలనా యంత్రాంగంలో స్పందన తగ్గిపోతోందని సీఎం చంద్రబాబు చెప్పిన మాట నిజమే’’
భార్య పేరు మీద గోదాము ఎందుకు పెట్టారు?
‘‘ఆయన (మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి) సతీమణి పేరుతో గోదాము ఎందుకు పెట్టారు. అదేగనుక తన పేరుతో రేషన్ బియ్యం గోదాం నిర్వహిస్తే ఆయనపైనే కేసు పెట్టేవారు. తప్పు చేయకపోతే బియ్యం ఎలా మాయం అయ్యాయి? ఇది చాలా పెద్ద స్కామ్. ఆయన సతీమణిపై కేసు పెట్టకపోతే మరి ఏం చేయాలి? ‘మాజీ మంత్రి సతీమణి అయితే వదిలేస్తారా’ అంటూ మళ్లీ మీడియానే రాస్తుంది. తప్పు చేయకపోతే రూ.కోటిన్నర కడతామని ఆయన ఎందుకు ఆఫర్ చేశారు?’’
పనితీరే ప్రామాణికం..
‘‘రాజకీయాల్లో పని తీరే ప్రామాణికం. నాగబాబు నా సోదరుడు కాకపోయినా.. ఆయన పని ఆధారంగా తప్పక అవకాశం ఇచ్చేవాడిని. నాకు బంధుప్రీతి ఉంటే.. హరిప్రసాద్‌ని కాదని నాగబాబుకే మొదట ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవాడిని. నాగబాబును గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి కూడా.. బీజేపీతో పొత్తు కారణంగా చివరి నిమిషంలో తప్పించాం. అప్పుడు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించి రాజ్యసభకు పంపాలనుకున్నాం. కానీ, అదీ కుదరలేదు. నాగబాబును ముందుగా ఎమ్మెల్సీని చేస్తాం. మంత్రి పదవి విషయం తర్వాత చర్చిస్తాం. మా ఎమ్మెల్యే పంతం నానాజీ ఉదంతంలో 15 నిమిషాల్లో స్పందించాం. ఆయన వెంటనే డాక్టర్‌కు క్షమాపణ చెప్పారు. ఆయనపై కేసుకూడా నమోదైంది’’
లౌకికవాదం ముసుగులో..
‘‘దేశంలో సెక్యులరిజం కేవలం హిందువులకేనా? సెక్యులరిజం ముసుగులో చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. 15 నిమిషాలు పోలీసులు కళ్లు మూసుకుంటే హైదరాబాద్‌లో హిందువు అంటూ లేకుండా చేస్తామని కొందరు ప్రకటన చేసే... ఒక్క కమ్యునిస్టు నాయకుడు కూడా మాట్లాడలేదు. అదే ఇతర మతాల వారి మనోభావాలను దెబ్బ తీస్తే మాత్రం వామపక్షవాదులు హిందువుల మీద పడిపోతారు. సెక్యూలరిజం అనేది అన్ని మతాలకూ సమానంగా వర్తించాలి’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.