Share News

AMBIKA : అంబికాకు అదిరే మెజార్టీ

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:30 AM

టీడీపీ కూటమి తరఫున అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగిన అంబికా లక్ష్మీనారాయణ భారీ మెజార్టీని సొంతం చేసుకున్నారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణపై 1,88,555 ఓట్ల మెజార్టీతో ఆయన ఘన విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరూ శ్రీసత్యసాయి జిల్లావాసులే కావడం గమనార్హం. అంబికా లక్ష్మీనారాయణ టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి శంకర్‌నారాయణ పెనుకొండ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. పార్టీ అధినాయకత్వాల ఆదేశాల మేరకు వీరిద్దరూ అనంతపురం పార్లమెంటు స్థానంలో పోటీ పడ్డారు. అంబికా లక్ష్మీనారాయణది బోయ సామాజికవర్గం. ...

AMBIKA : అంబికాకు అదిరే మెజార్టీ
Leaders wish Ambika in Ananta

వైసీపీ అభ్యర్థిపై 1,88,555 ఓట్ల ఆధిక్యం.. తొలిసారి బరిలో దిగినా బంపర్‌ మెజార్టీ

టీడీపీ కూటమి అభ్యర్థికి తిరుగులేని విజయం

శంకర నారాయణకు సొంతపార్టీ ఓట్లూ తక్కువే

అనంతపురం, జూన 5(ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి తరఫున అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగిన అంబికా లక్ష్మీనారాయణ భారీ మెజార్టీని సొంతం చేసుకున్నారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణపై 1,88,555 ఓట్ల మెజార్టీతో ఆయన ఘన విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరూ శ్రీసత్యసాయి జిల్లావాసులే కావడం గమనార్హం. అంబికా లక్ష్మీనారాయణ టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి శంకర్‌నారాయణ పెనుకొండ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. పార్టీ అధినాయకత్వాల ఆదేశాల మేరకు వీరిద్దరూ అనంతపురం పార్లమెంటు స్థానంలో పోటీ పడ్డారు. అంబికా లక్ష్మీనారాయణది బోయ సామాజికవర్గం.


మాలగుండ్ల శంకర్‌నారాయణది కురబ సామాజికవర్గం. ఈ రెండు సామాజికవర్గాలు అనంతపురం పార్లమెంటు నియోజకరవ్గ పరిధిలో బలంగా ఉన్నాయి. అందుకే రెండు పార్టీలూ గెలుపును ఆశించి బరిలో దించాయి. ఎంపీ అభ్యర్థులుగా ఇద్దరూ తొలిసారి పోటీ చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ కూటమి అభ్యర్థి ఆధిక్యత చాటుకున్నారు. ప్రతి రౌండులోనూ అంబికా హవా కొనసాగింది. అంబికాకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 12,383, మొత్తం ఓట్లు 7,68,245 వచ్చాయి. శంకరనారాయణకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 5,921, మొత్తం ఓట్లు 5,79,690 వచ్చాయి. దీంతో అంబికాకు 1,88,555 ఓట్ల భారీ మెజార్టీ లభించింది. ఇండియా కూటమి తరఫున బరిలో దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి వజ్జల మల్లికార్జునకు (పాల మల్లి) పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 1,263, మొత్తం 43,217 ఓట్లు వచ్చాయి. ఇందులో సుమారు సగం అనంతపురం అర్బన(11,282), గుంతకల్లులో (10,733 ఓట్లు) రావడం గమనార్హం.


వైసీపీలో క్రాస్‌ ఓటింగ్‌

వైసీపీ ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారాయణకు మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకు 6,05,514 ఓట్లు రాగా... ఎంపీ అభ్యర్థికి 5,73,769 ఓట్లు వచ్చాయి. ఎంపీ అభ్యర్థికి మొత్తం 34,869 ఓట్లు తగ్గాయి. అనంతపురం అర్బనలో అత్యధికంగా ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 13,817 ఓట్లు శంకరనారాయణకు తక్కువగా వచ్చాయి. ఇక్కడ క్రాస్‌ ఓటింగ్‌ భారీగా జరిగింది. ఆ తరువాతి స్థానంలో గుంతకల్లు నియోజకవర్గం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికంటే 9,194 ఓట్లు తక్కవగా వచ్చాయి. కళ్యాణదుర్గంలో 4,401, తాడిపత్రిలో 3,310, రాయదుర్గంలో 2,585, ఉరవకొండలో 1,271 ఓట్లు ఎంపీ అభ్యర్థికి తక్కువగా వచ్చాయి. అత్యల్పంగా శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 291 ఓట్లు మాత్రమే తగ్గాయి.

సంబరాలు.. సంతోషాలు..

చారిత్రక విజయం సాధించిన టీడీపీ కూటమి అభ్యర్థులు బుధవారం సంబరాల్లో మునిగిపోయారు. కొందరు ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించారు. విజేతల ఇళ్లకు కార్యర్తలు, అభిమానులు, నాయకులు పోటెత్తారు. పూల మాలలు, పుష్పగుచ్ఛాలు, స్వీట్లు తీసుకువెళ్లి విజేతలను సత్కరించారు. తమ గెలుపుకోసం శ్రమించిన పార్టీ శ్రేణులకు విజేతలు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ శ్రేణుల్లో నిస్తేజం అవరించగా.. ఐదేళ్ల తరువాత టీడీపీ నాయకుల నివాసాలు, పార్టీ కార్యాలయాలలో సందడి కనిపించింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 06 , 2024 | 12:30 AM