Minister Atchannaidu : జగన్ అవినీతి వల్లే విద్యుత్ చార్జీల భారం
ABN , Publish Date - Dec 27 , 2024 | 05:01 AM
గత సీఎం జగన్మోహన్‌రెడ్డి అడ్డగోలుగా అవినీతికి పాల్పడటం వల్లే రాష్ట్రంలో ప్రజల నడుం విరిగేలా విద్యుత్ చార్జీలు పెరిగాయని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.

దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి: అచ్చెన్నాయుడు
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): గత సీఎం జగన్మోహన్‌రెడ్డి అడ్డగోలుగా అవినీతికి పాల్పడటం వల్లే రాష్ట్రంలో ప్రజల నడుం విరిగేలా విద్యుత్ చార్జీలు పెరిగాయని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీనిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన వైసీపీకి సవాల్ విసిరారు. గురువారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేశారు. ‘ఐదేళ్లపాటు ఎడాపెడా విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని చార్జీలపై ధర్నాలు, ర్యాలీలకు పిలుపు ఇస్తున్నారు? ఐదేళ్లపాటు సీఎం పదవిలో కూర్చుని అవినీతి సంపాదనకు అలవాటు పడిన జగన్ ఆ సంపాదన లేకుండా ఐదు నెలలు కూడా ఉండలేకపోతున్నారు. ఆ అక్కసుతోనే తమ కేడర్‌తో నిరసన కార్యక్రమాలు చేయిస్తున్నారు. 2022-24 మధ్య కాలంలో విద్యుత్ వాడకానికి సంబంధించి కరెంటు చార్జీలు పెంచాలని ఆయన ప్రభుత్వం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు ప్రతిపాదనలు పంపి ఆమోదం తీసుకొంది. రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించడం వల్లే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. అవే ఇప్పుడు బిల్లుల్లో వస్తున్నాయి. చార్జీలు తాను పెంచి వాటికి వ్యతిరేకంగా తానే ధర్నాలు చేయడం ఒక్క జగన్‌కే చెల్లింది. విద్యుత్ చార్జీలు ఎవరు పెంచారో ప్రజల సమక్షంలోనే చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నేతలకు చేతనైతే ముందుకు రావాలి’ అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.