Share News

Fake Form-7: ఫేక్ ఫామ్-7 దరఖాస్తులు, 70 కేసులు నమోదు.. కాకినాడ సిటీలో అత్యధికం

ABN , Publish Date - Jan 23 , 2024 | 08:31 AM

ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితాను సోమవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. నకిలీ ఫామ్-7 దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్టు గుర్తించింది. రాష్ట్రంలో 70 కేసులు నమోదు చేసింది. అత్యధికంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో 23 కేసులు నమోదు చేశారు.

 Fake Form-7: ఫేక్ ఫామ్-7 దరఖాస్తులు, 70 కేసులు నమోదు.. కాకినాడ సిటీలో అత్యధికం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. నకిలీ ఫామ్-7 దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్టు గుర్తించింది. 70 కేసులు పోలీసులు నమోదు చేశారని వివరించింది. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఎక్కువ కేసులు ఉన్నాయి.

ఫామ్-7 అంటే ఏంటీ..?

ఫామ్-6 ద్వారా 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలి. ఫామ్-8 ద్వారా ఎపిక్ కార్డుల్లో మార్పు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. ఫామ్-7 అంటే చనిపోయిన ఓట్లను తొలగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫామ్-7 దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఫేక్ సర్టిఫికెట్లు చూపి ఓట్లు తొలగించాలని కోరి ఉండొచ్చు. అలాంటి దరఖాస్తులను గుర్తించి 70 కేసులు నమోదు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. ఇందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. నకిలీ ఫామ్-7 దరఖాస్తు చేసిన 70 కేసుల వివరాలను మీడియాకు వివరించారు.

కాకినాడలో 23 కేసులు

కాకినాడ సిటీ నియోజకవర్గంలో అత్యధికంగా 23 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో 16 కేసులు నమోదు చేశారు. నియోజకవర్గ ఇంచార్జీగా వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ ఉన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో 10 కేసులు ఫైల్ చేశారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో 8 ఎఫ్‌ఐఆర్‌లు, అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్‌, రాప్తాడులో 4, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో గల కొత్తపేట నియోజకవర్గంలో 3, అన్నమయ్య జిల్లా రాజంపేటలో 2, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 2, గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలో 1 కేసు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో 1కేసు నమోదు చేశారు. కొన్ని కేసుల్లో చార్జిషీట్లు ఫైల్‌ చేశారని వివరించారు. బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

కలెక్టర్ సస్పెండ్.. అధికారులు కూడా

ఎపిక్‌ కార్డుల అంశంలో ఇప్పటికే ఒక ఐఏఎస్‌ అధికారి, మరో ముగ్గురిని సస్పెండ్‌ చేశామని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి కాలేజీలు, యూనివర్సిటీల్లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపడుతామని వివరించారు. రాష్ట్రంలో జీరో, జంక్‌ ఓటర్లు ఉన్నారని, వాటిని 98 శాతం మేర సరి చేశామని వివరించారు. 10 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న 1.51 లక్షల ఇళ్లను తనిఖీ చేశామని తెలిపారు. మరో 2 శాతం మేర సరిదిద్దాల్సి ఉందన్నారు. 14 లక్షల ఓటర్ల గురించి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయని పేర్కొన్నారు. వీరిలో 5.6 లక్షల ఓటర్లు అర్హులు కాకపోవడంతో తొలగించారు. ఓటర్ల జాబితాలో ఫిర్యాదులు అభ్యంతరాలపై ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. తుది జాబితాను అన్ని పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

ఫిర్యాదు రావడంతో చర్యలు

గత ఏడాది అక్టోబరు 27వ తేదీన విడుదల చేసిన ముసాయిదా జాబితాపై విమర్శలు వెల్లువెత్తాయి. జీరో డోర్‌ నెంబర్లతో ఓట్లు, డుప్లికేటు ఓట్లుపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. అందుకే తుది ఓటర్ల జాబితా రూపొందించారు. ఇందులో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మీనా వివరించారు. దేశంలో సర్వీస్‌ ఓటర్లు ఎక్కువగా ఉండే టాప్‌-20 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాకు గుర్తింపు లభించింది. ఇక్కడ మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో 16,100 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 19,08,498 మంది ఓటర్లు ఉండగా పురుషుల కన్నా మహిళా ఓటర్లు 37,999 మంది అధికంగా ఉన్నారు. తిరుపతి జిల్లాలో ఇదే పరిస్థితి. పురుషుల కంటే 42,324 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బాపట్ల జిల్లాలో ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 1,316 ఓట్లు తగ్గాయి. పర్చూరులో తేడా కనిపించడంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనుమానాలను వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అనకాపల్లి జిల్లాలో 6 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 12,73,591 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 33,457 మంది ఎక్కువగా ఉన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 23 , 2024 | 08:39 AM