CBI: సీబీఐ విచారణ అనంతరం కీలక విషయాలు చెప్పిన అవినాష్ రెడ్డి
ABN, First Publish Date - 2023-02-24T22:08:44+05:30 IST
సీబీఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు అవినాష్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ (CBI) ఎదుట రెండోసారి హాజరయ్యారు. సీబీఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు అవినాష్ రెడ్డి చెప్పారు. బాధ్యతగా వార్తలు ప్రచారం చేయాలని మీడియా ప్రతినిధులకు అవినాష్ రెడ్డి మనవి చేశారు. తాను విజయమ్మతో కలిసి మాట్లాడితే.. బెదిరించి వచ్చానని చర్చలు పెట్టి ప్రచారం చేశారని మండిపడ్డారు. తాను దుబాయ్ వెళ్లిపోయానని వార్తలు రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ జరుగుతుండగానే మీడియా ట్రయల్ పూర్తి చేసి దోషులు, నిర్దోషులను మీడియానే నిర్ణయిస్తుందా అని ప్రశ్నించారు. ఈ ప్రచారం వల్ల విచారణపై ప్రభావం చూపుతుందని అవినాష్ రెడ్డి అన్నారు. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి 100కు పెంచే ప్రయత్నం జరుగుతోందని, ఒక నిజాన్ని 100 నుంచి సున్నాకు తెచ్చే ప్రయత్నం జరుగుతోందని అవినాష్ రెడ్డి చెప్పారు. వాస్తవాలు బయటకు రావాలంటే సంయమనం పాటించాలని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందన్నారు. అది గూగుల్ టేకౌటా?.. టీడీపీ టేకౌటా?. పర్సన్ టార్గెట్గా విచారణ కొనసాగుతోందని, ఇది కరెక్ట్ కాదని, సీబీఐ కేసు ఐవో, సీబీఐ డైరెక్టర్‌కు ఒక వినతి పత్రం ఇచ్చానని అవినాష్ రెడ్డి తెలిపారు.
వివేకా హత్యకేసులో అవినాష్ పాత్ర కీలకంగా ఉందని సీబీఐ భావిస్తోంది. ఆయనతోపాటు తండ్రి భాస్కర్‌రెడ్డి (Bhaskar Reddy) ప్రమేయానికి సంబంధించి ఓ అంచనాకు వచ్చింది. విచారణ ముగిసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.
ఈ కేసులో అవినాస్ రెడ్డిని తొలిసారి గతనెల 28వ తేదీన ప్రశ్నించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో సుదీర్ఘంగా ఈ విచారణ జరిగింది. అవినాశ్ రెడ్డి ‘కాల్ డేటా’ ఆధారంగా అప్పట్లో కీలక ప్రశ్నలు సంధించింది. వివేకా హత్య జరగడానికి ముందు, తర్వాత ఆయన రెండు నంబర్లతో మాట్లాడినట్లు గుర్తించారు. అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఈ నెల 23న, అవినాశ్‌రెడ్డిని 24న విచారణకు రావాలంటూ సీబీఐ ఈ నెల 18న నోటీసులు ఇచ్చింది. అయితే... 23న హాజరు కాలేనని భాస్కర్‌రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు.
Updated at - 2023-02-24T22:43:30+05:30