BRS MLAS : మా ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వొద్దు!

ABN , First Publish Date - 2023-08-17T03:25:33+05:30 IST

అధినాయకత్వం ఎవరికి టికెట్‌ ఇస్తే వారికోసమే పార్టీ శ్రేణులన్నీ పనిచేయడమే తెలిసిన బీఆర్‌ఎస్‌(BRS)లో ఈసారి కొత్త ట్రెండ్‌ మొదలైంది. పార్టీలో అసంతృప్తుల స్థాయి.. అసమ్మతిని దాటి మరింత తీవ్రరూపం దాల్చింది.

BRS MLAS : మా ఎమ్మెల్యేకు  టికెట్‌ ఇవ్వొద్దు!

అధికార బీఆర్‌ఎ్‌సలో కొత్త ట్రెండ్‌

అసంతృప్తి స్థాయి దాటిన అసమ్మతి

సిటింగ్‌ల తీరుతో తీవ్ర వ్యతిరేకత

పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు

వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్న శ్రేణులు

ప్రత్యేకంగా సమావేశాల నిర్వహణ

పార్టీ టికెట్‌ ఇవ్వొద్దని తీర్మానాలు

ఇస్తే ఓడిస్తామంటూ హెచ్చరికలు

తమ వర్గం నేతకే ఇవ్వాలని డిమాండ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): అధినాయకత్వం ఎవరికి టికెట్‌ ఇస్తే వారికోసమే పార్టీ శ్రేణులన్నీ పనిచేయడమే తెలిసిన బీఆర్‌ఎస్‌(BRS)లో ఈసారి కొత్త ట్రెండ్‌ మొదలైంది. పార్టీలో అసంతృప్తుల స్థాయి.. అసమ్మతిని దాటి మరింత తీవ్రరూపం దాల్చింది. ‘మా ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వొద్దు... ఇస్తే ఓడిస్తాం’ అంటూ సొంత పార్టీ నేతలే అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేసే స్థాయికి చేరింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటించనున్న నేపథ్యంలో.. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న అభిప్రాయభేదాలు బట్టబయలవుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలు(Sitting MLAs) అవినీతికి పాల్పడ్డారని, నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని, స్థానిక ప్రజాప్రతినిధుల పట్ల, సీనియర్‌ నాయకుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారంటూ.. అసంతృప్త నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యేల తీరును వ్యతిరేకిస్తూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఈసారి ఓడించాలని చర్చించుకుంటున్నారు. రహస్య సమావేశాల్లో ఓ వైపు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. మరోవైపు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఎమ్మెల్యేల పట్ల తమకున్న వ్యతిరేకతను బయట పెడుతున్నారు. పార్టీ అధిష్ఠానం ప్రకటనతో పనిలేకుండా వచ్చే ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వకూడదంటూ వారికి వారే తీర్మానాలు చేసుకుంటున్నారు. తాము సూచించిన నేతకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ మాట కాదని మరొకరికి టికెట్‌ ఇస్తే.. ఓడించాలని తీర్మానించుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇది మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. బీఆర్‌ఎస్‌లో కొత్తగా పుట్టుకొచ్చిన పరిస్థితులను చూసి సిటింగ్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

నియోజకవర్గాల్లో అసమ్మతి సెగ..

జనగామ(Janagama)లో ఈసారి తమ ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వవద్దంటూ అధిష్ఠానాన్ని కోరేందుకు నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు పలువురు బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(MLC Palla Rajeshwar Reddy)కే టికెట్‌ ఇవ్వాలంటూ ఆ నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్‌ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు హరితప్లాజాలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(MLA Muthireddy Yadagiri Reddy) నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, ప్రజా ప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈసారి ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని పార్టీ అధినేత కేసీఆర్‌(KCR)ను కోరేందుకు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్కడికి చేరుకోవడంతో ఆయనతో వారికి వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారంపై హరిత ప్లాజా వద్ద మూడు గంటలపాటు హైడ్రామా చోటుచేసుకుంది.


స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో సిటింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఈసారి టికెట్‌ ఇవ్వొద్దని అక్కడి బీఆర్‌ఎస్‌ శ్రేణులు అధిష్ఠానానికి సూచిస్తున్నాయి. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొనడంతో నియోజకవర్గంలో పార్టీ రెండు గ్రూపులుగా చీలింది. ఇటీవల ఇద్దరి మధ్య వైరం ముదిరి.. తనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాజయ్యను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించిన విషయం విదితమే.కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మద్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. వీరిద్దరూ వర్గాలుగా ఏర్పడి కార్యక్రమాలు చేపడుతున్నారు.. ఇటీవల కందుకూరు మండలంలోని ఓ ఫాంహౌ్‌సలో కసిరెడ్డి వర్గం.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించింది. ఈసారి జైపాల్‌యాదవ్‌కు టికెట్‌ ఇేస్త పనిచేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.వర్థన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరూరి రమే్‌షను అసంతృప్తుల బెడద తొలుస్తోంది. కొద్దిరోజుల క్రితం అక్కడ నిర్వహించిన పార్టీ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేతలు.. ఎమ్మెల్యే పట్ల తమ వ్యతిరేకతను బహిర్గతం చేశారు. ఈ విభేదాలు సద్దుమణిగేలా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మంత్రాంగం నడిపినప్పటికీ.. అసంతృప్తి మాత్రం చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉందని అంటున్నారు.

వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు అక్కడి సీనియర్‌ నేతలతో విభేదాలు ముదిరాయి. తమను పక్కనపెట్టి కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థుల కోసం పనిచేసిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని ఓ వర్గం దూరంగా ఉంటోంది. వారంతా ఈసారి ఆనంద్‌కు పార్టీ టికెట్‌ ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి టికెట్‌ కోసం ఆ పార్టీ యువనేత వడ్ల నందు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌ను సొంత పార్టీ నేతలే బలంగా వ్యతిరేకిస్తున్నారు ఆమె అసమర్థ నాయకత్వం వల్లనే నియోజకవర్గంలో పనులు జరగడం లేదని, పార్టీ కూడా నాశనమవుతోందని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మరోవైపు అధిష్ఠానం కూడా ఖానాపూర్‌ నియోజకవర్గంలో భూక్యా జాన్సన్‌ నాయక్‌ను క్షేత్రస్థాయిలో పని చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్‌, జాన్సన్‌ ఇద్దరూ క్లాస్‌మేట్స్‌ అని సమాచారం.

పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కింది స్థాయి నేతలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఆయనకు టికెట్‌ ఇవ్వవద్దని మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అవినీతికి పాల్పడుతున్నారని, ఈసారి ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని డిమాండ్‌ చేస్తూ సొంత పార్టీ నేతలే యాత్ర చేపట్టారు. అక్కడి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి, మిరియాల రాజిరెడ్డి, కొంకటిలక్ష్మి నారాయణ తదితరులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.

ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డిని మార్చాలంటూ జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వర్గం కొద్దిరోజుల క్రితం ప్రత్యేకంగా సమావేశమైంది. పార్టీ అధిష్ఠానం ఈసారి ఆయనకే టికెట్‌ ఇస్తే ఓడించాలని ఆ సమావేశంలో తీర్మానించినట్లు తెలిసింది.

Updated Date - 2023-08-17T05:06:05+05:30 IST