Share News

MLA Rajasingh: అమాంతం పెరిగిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆస్తులు.. మొత్తం ఎంతంటే...

ABN , First Publish Date - 2023-11-05T09:40:24+05:30 IST

గోషామహల్‌ బీజేపీ అభ్యర్థి టి.రాజాసింగ్‌(T. Rajasingh) ఆస్తులు అమాంతం పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయానికి

MLA Rajasingh: అమాంతం పెరిగిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆస్తులు.. మొత్తం ఎంతంటే...

మంగళ్‌హాట్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): గోషామహల్‌ బీజేపీ అభ్యర్థి టి.రాజాసింగ్‌(T. Rajasingh) ఆస్తులు అమాంతం పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయానికి ప్రస్తుతానికి దాదాపు మూడింతలకు పైగా పెరిగాయి. ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు సైతం భారీగా పెరిగిపోవడమే కాకుండా స్థిరాస్తులు సైతం పెరగడం విశేషం.

పెరిగిన ఆస్తుల వివరాలు ఇలా..

2014 ఎన్నికల సమయంలో రాజాసింగ్‌ చేతిలో రూ. 1.50 లక్షలు, 10 గ్రాముల బంగారం ఉండగా, ఆయన భార్య చేతిలో రూ.22,738 నగదు, 250 గ్రాముల బంగారం ఉన్నట్లు పత్రాల్లో చూపించారు. ఇక 2018 ఎన్నికల సమయంలో రాజాసింగ్‌ వద్ద రూ.2 లక్షల నగదు, బ్యాంకులో రూ.60,44,932లతో పాటు 50 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపారు. అంతేకాకుండా రూ. 14లక్షల విలువ గల టాటా సఫారీ వాహనం, రూ. 1.73 లక్షల రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌, రూ. 9.14 లక్షల విలువ గల మహీంద్రా బొలేరో వాహనాలు ఉన్నాయి. ఆయన పేరుమీద రూ. 87.52 లక్షల చరాస్తులు, రూ.2.29 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు చూపారు. ఆయన భార్య వద్ద రూ. లక్ష నగదు ఉండగా, అకౌంట్‌లో రూ.4.69 లక్షలున్నాయని, 300 గ్రాముల బంగారం, రూ. 14.29 లక్షల చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు.

gggg.jpg

భారీగా ఆస్తుల విలువ..

తాజాగా 2023 నాటి ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆయన వద్ద నగదు రూ.2 లక్షలు, భార్య వద్ద రూ. లక్ష ఉన్నట్లు చూపగా ఆస్తులు మాత్రం ఆమాంతం పెరిగాయి. రాజాసింగ్‌ వద్ద(వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లతో కలిపి) రూ. 1.84 కోట్లు ఉన్నట్లు చూపారు. అంటే గత ఎన్నికల నాటినుంచి నేటి వరకు రూ.1.23 కోట్లు పెరిగాయి. 250 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపారు. ఆయన భార్య ఉషాబాయ్‌ పేరుపై రూ.3,36,638లు ఉండగా.. 300 గ్రాముల బంగారం ఉందని చూపారు.

2018లో రూ.87 లక్షలుగా ఉన్న చరాస్తులు ఇప్పుడు 2.29 కోట్లకు పెరిగాయి. ఆయన భార్యకు ఉన్న చరాస్తులు సైతం రూ.14.29 లక్షలు కాస్తా.. రూ.34.70 లక్షలకు పెరిగాయి. రెండు పర్యాయాలు పెద్దగా లేని స్థిరాస్తులు 2023 వచ్చే నాటికి శంకర్‌పల్లి, వనపర్తి, బీబీనగర్‌, యాదగిరి గుట్ట, శంషాబాద్‌, బాలానగర్‌, మహబూబ్‌నగర్‌లలో ప్లాట్లు, భవనాలు కలిసి మొత్తం రూ.64,05లక్షల విలువ గల స్థిరాస్తులు, భార్య పేరున కూడా అదే ప్రాంతాల్లో రూ. 92లక్షల 76,941 విలువ గల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు. గత ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన విధంగా రాజాసింగ్‌ పేరుమీద రూ.14 లక్షల విలువ గల టాటా సఫారీ వాహనం, రూ.1.73 లక్షల రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌, రూ.9.14 లక్షల విలువ గల బొలేరో వాహనాలు ఉన్నాయి. ఇక 2014, 2018లో ఆయన భార్యపై ఎలాంటి వాహనాలు లేవు. ఈ సారి మాత్రం రూ.26 లక్షల విలువ గల హెక్టార్‌ ప్లస్‌ సెవన్‌ సీటర్‌ కారు, రూ.84,335 విలువ గల హోండా యాక్టివా వాహనం ఉన్నాయి. వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులు రూ.13.60 లక్షలు ఉన్నాయి. మొత్తానికి రాజాసింగ్‌ చూపించిన ఎకరాల కొద్దీ భూముల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో వంద కోట్లపైనే ఉండవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-11-05T09:40:25+05:30 IST