Harish Rao: ఈ నెలాఖరిలో గృహలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2023-06-05T13:41:11+05:30 IST

జిల్లాలోని పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో నూతనంగా నిర్మించిన 56 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ఆర్థిక ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం ప్రారంభించారు.

Harish Rao: ఈ నెలాఖరిలో గృహలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం

మెదక్: జిల్లాలోని పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో నూతనంగా నిర్మించిన 56 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ఆర్థిక ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) సోమవారం ఉదయం ప్రారంభించారు. లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రూపాయి ఖర్చు కాకుండా, చెమట చుక్క చిందించకుండా అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. పైరవీకారుల పని లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇల్లు అందేలాగా కలెక్టర్ చేతనే ఇళ్ల మంజూరు చేయించామని చెప్పారు. ఈ నెలాఖరిలోగా ఇంటి జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. కేంద్ర బీజేపీ బోరు బాయికాడ మీటర్ పెట్టి రైతులకు బిల్లు పంపించాలని తెలంగాణపై ఒత్తిడి తెచ్చిందని మండిపడ్డారు. రైతుపై ఇక్కడ మీటర్ పెట్టనందుకు 30 వేల కోట్లను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆపిందని తెలిపారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్ పెట్టేది లేదని తేల్చి చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మంత్రి కొనియాడారు.

‘‘కాంగ్రెస్ పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. కాంగ్రెస్ పాలన అంటే ఏంటిది మీరు మర్చిపోయారా... కాంగ్రెస్ పాలన అంటే నీళ్లకు కష్టం, కరెంట్‌కు కష్టం, పెన్షన్‌కు కష్టం’’ అని వ్యాఖ్యలు చేశారు. ఎంత కష్టమైనా గింజ పోకుండా వడ్లను కేసీఆరే కొన్నారని తెలిపారు. ఈనెల 14న న్యూట్రిషన్ కిట్టు ప్రారంభించబోతున్నామని చెప్పారు. గర్భిణీల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కేసీఆర్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి, బిడ్డ గర్భం దాలిస్తే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, ఆడబిడ్డ పురుడు పోస్తే కేసీఆర్ కిట్టు, ముసలోళ్లకు ఆసరా పెన్షన్, రైతుకు రైతుబంధు ఇలా అన్ని వర్గాలను అదుకుంటున్న నాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీష్‌రావు కొనియాడారు.

Updated Date - 2023-06-05T13:41:11+05:30 IST