CM KCR: ఆ మాట అన్నవాడిని బంగాళాఖాతంలో విసిరేయాలి

ABN , First Publish Date - 2023-08-23T19:55:21+05:30 IST

ధరణి(Dharani) తీసేస్తా అన్న వాడిని బంగాళాఖాతంలో విసిరేయాలని రైతులకు సీఎం కేసీఆర్(CM KCR) పిలుపునిచ్చారు.

CM KCR: ఆ మాట అన్నవాడిని బంగాళాఖాతంలో విసిరేయాలి

మెదక్: ధరణి(Dharani) తీసేస్తా అన్న వాడిని బంగాళాఖాతంలో విసిరేయాలని రైతులకు సీఎం కేసీఆర్(CM KCR) పిలుపునిచ్చారు. బుధవారం నాడు మెదక్ సీఎస్ఐ చర్చి మైదానంలో ‘‘ప్రగతి శంఖారావం’’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘బీజేపీ కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటోంది.. మీటర్లు పెట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 25 వేల రూపాయలను నష్టం కలిగించింది. నా ప్రాణం పోయినా మోటార్లకు మీటర్లు పెట్టానని కేంద్రంతో కొట్లాడాను. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదు. కోటి 3 లక్షల కుటుంబాలకు తాగునీరు ఇస్తున్నాం.24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ధరణి ఏం తప్పు చేసిందని కాంగ్రెస్ నాయకులు తీసేస్తామంటున్నారు. ధరణిలో భూమి రికార్డులు నమోదైతే సీఎం, సీఎస్ కూడా మార్చలేరు. ధరణితో భూమి హక్కులు పూర్తిగా రైతుల చేతికి వచ్చాయి. రుణమాఫీ రైతులకు ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది. కరోన, కేంద్ర ప్రభుత్వం వల్ల రుణమాఫీ జాప్యం అయింది.

ఇప్పటివరకు 36 వేల కోట్లను రుణమాఫీ చేశాం. కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ చాలు అంటోంది కాంగ్రెస్ వాళ్లవి ఆపద మొక్కులు. ఆసరా పింఛన్ మొత్తాన్ని క్రమంగా పెంచుతాం. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో మేనిఫెస్టోలో పథకాలను ప్రకటిస్తాం. రైతు బీమా పథకం ప్రపంచంలో తెలంగాణలో తప్ప ఎక్కడా అమలు చేయడం లేదు.ఎన్నికలు రాగానే ప్రజలు ఆగం కావొద్దు. తక్కువ కాలంలో తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్‌వన్‌గా ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలోనూ నంబర్ వన్. సంక్షేమ పథంలో సాగుతున్నాం... తెలంగాణ వచ్చాక పెన్షన్ల సంఖ్య డబుల్ అయింది. సమష్టి కృషితోనే ఈ అభివృద్ధి సాధ్యమైంది. రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగాలి.మోసకారుల మాటలు నమ్మితే ఘోసపోతాం. మరోసారి బీఆర్ఎస్‌ను నిండు మనసుతో ఆశీర్వదించాలి’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.


త్వరలో మెదక్‌కు గోదావరి జలాలు: సీఎం కేసీఆర్

త్వరలో మెదక్‌ జిల్లాకు గోదావరి జలాలు వస్తాయని.. ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.జిల్లాలోని 400 గ్రామ పంచాయతీలకు రూ. 15 లక్షల చొప్పున నిధులు విడుదల చేశారు. నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాల్టీలకు రూ. 25 కోట్ల చొప్పున, మెదక్ జిల్లా కేంద్రానికి రూ. 50 కోట్లు మంజూరు చేశారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ని చేస్తూ ఎల్లుండి సాయంత్రం లోగా జీవో ఇస్తామని ప్రకటించారు. మెదక్ జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్డు నిర్మిస్తాం. రామాయంపేట, కౌడిపల్లిలకు డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తామని చెప్పారు. దివ్యంగులకు పెంచిన పింఛన్లు 4,016 రూపాయలను పంపిణీ చేశారు. అలాగే బీడీ టెకేదార్లకు పింఛన్లు పంపిణీ చేశారు.

మెదక్ జిల్లాలో పలు కార్యాలయాల ప్రారంభం..

మెదక్ జిల్లాలో 32 ఎకరాల విస్తీర్ణంలో 67.07 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీ ప్లస్ 2 పద్ధతిలో నాలుగు బ్లాకులుగా కలెక్టరేట్ నిర్మాణం చేపట్టారు. దీంతో పాటు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీసు కార్యాలయాన్ని 63 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించారు. జీ ప్లస్ 3 పద్ధతిలో 38.50 కోట్లు వ్యయంతో నిర్మించారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే పరేడ్ గ్రౌండ్...పక్కనే పోలీస్ క్వార్టర్స్ ఉండేలా ఏర్పాటు చేశారు. మెదక్‌లో నిర్మించిన BRS పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఎకరం స్థలంలో 60 లక్షల వ్యయంతో ఈ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు.

Updated Date - 2023-08-23T20:28:17+05:30 IST