Minister Mallareddy: మళ్లీ రెచ్చిపోయిన మల్లారెడ్డి.. వారించిన ఆర్డీవోపై ఆగ్రహం

ABN , First Publish Date - 2023-02-16T20:14:18+05:30 IST

జాతరలో కోడేందీ.. గీడేంది అంటూ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) రెచ్చిపోయారు. ‘‘జై కేసీఆర్‌... జైజై కేసీఆర్‌.. నెంబర్‌వన్‌ సీఎం కేసీఆర్‌’’ అంటూ కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో..

Minister Mallareddy: మళ్లీ రెచ్చిపోయిన మల్లారెడ్డి.. వారించిన ఆర్డీవోపై ఆగ్రహం

కీసర: జాతరలో కోడేందీ.. గీడేంది అంటూ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) రెచ్చిపోయారు. ‘‘జై కేసీఆర్‌... జైజై కేసీఆర్‌.. నెంబర్‌వన్‌ సీఎం కేసీఆర్‌’’ అంటూ కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో మంత్రి రచ్చ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉందని వారించిన ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ (CM KCR)ను, ప్రభుత్వాన్ని పొగుడుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ఈ ఘటన గురువారం మేడ్చల్‌ జిల్లాలోని కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం కీసరగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ (Rangareddy, Mahabubnagar), హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC elections) జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి మంత్రి మల్లారెడ్డి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న క్రీడా పోటీల వద్దకు చేరుకున్న మంత్రి కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారు. అయితే, మంత్రి అక్కడకు రాక ముందే ఆర్డీవో క్రీడా పోటీలు ప్రారంభించారు.

ఆర్డీవోపై ఆగ్రహం

కీసరగుట్ట (Keesaragutta) రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి మల్లారెడ్డి నేరుగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు చేరుకొని స్టేజ్‌ ఎక్కే ప్రయత్నం చేసారు. దీంతో ‘ఎన్నికల కోడ్‌ ఉంది సార్‌.. మీరు స్టేజ్‌ పైకి రావొద్దు’ అని ఆర్డీవో రవి అభ్యంతరం తెలిపారు. దీంతో మంత్రి మల్లారెడ్డి ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన అనుచర గణంతో స్టేజ్‌పైకి ఎక్కారు. మైక్‌ పట్టుకొని జై కేసీఆర్‌.. జై తెలంగాణ అంటూ.. కేసీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. నెంబర్‌వన్‌ సీఎం కేసీఆర్‌.. అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సీఎం ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారని, ఎక్కడా లేని విధంగా గురుకుల పాఠశాలలు స్థాపించిన ఘనత కేసీఆర్‌ది అంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ‘‘నేను పాలు అమ్మినా, పూలు అమ్మినా, పాఠశాలలు స్థాపించి, మెడికల్‌ కాలేజ్‌లు నడుపుతున్నా.. నాలాగా విద్యార్థులు కష్టపడి అభివృద్ధి చెందాలి’’ అని మల్లారెడ్డి తన పాటను వినిపించారు. ఇంతటితో ఆగకుండా జాతరలో కోడేంది.. గీడేంది.. అంటూ స్టేజ్‌ పైనుంచి కిందకు దిగారు. గ్రౌండ్‌లో వెళ్లి వాలీబాల్‌ పోటీలను కూడా ప్రారంభించారు. కాగా, మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను వింటూ అధికారులు నిస్సహాయ స్థితిలో ఉండిపోగా, అక్కడున్న జనాలు విస్తుపోయారు.

Updated Date - 2023-02-16T20:14:19+05:30 IST