Share News

KTR: మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్.. మోదీ, రాహుల్‌ ఒక్కటయ్యిండ్రు..! కేసీఆర్‌ గొంతు పిసికే కుట్ర వారిది

ABN , First Publish Date - 2023-11-18T09:19:11+05:30 IST

‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ గొంతు పిసికేందుకు, రాష్ట్రంలో ఓడించేందుకు మోదీ, రాహుల్‌గాంధీ ఒక్కటైతున్నరు.

KTR: మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్.. మోదీ, రాహుల్‌ ఒక్కటయ్యిండ్రు..! కేసీఆర్‌ గొంతు పిసికే కుట్ర వారిది

- సీఎంను దించేందుకు 400 మందిని చంపిన చరిత్ర కాంగ్రెస్‏ది

- జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ రోడ్‌ షోలో కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ గొంతు పిసికేందుకు, రాష్ట్రంలో ఓడించేందుకు మోదీ, రాహుల్‌గాంధీ ఒక్కటైతున్నరు. ఢిల్లీ నుంచి పెద్దపెద్దోళ్లు దిగుతున్నరు’ అని బీఆర్‌ఎస్‌(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) అన్నారు. సొంత పార్టీకి చెందిన ఓ ముఖ్యమంత్రిని గద్దె దించి మరొకనిని కుర్చీలో కూర్చొబెట్టేందుకు పాతనగరంలో 400 మందిని పొట్టనబెట్టుకున్న దుర్మార్గపు కాంగ్రె్‌సకు అవకాశమిస్తే హైదరాబాద్‌ నాశనమైతదన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు మాగంటి గోపీనాథ్‌(Maganti Gopinath), దానం నాగేందర్‌తో కలిసి పలు ప్రాంతాల్లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రె్‌సకు పొరపాటున ఆ పార్టీ కి ఓటేస్తే.. పాత చీకటి రోజులు, కరెంట్‌ కోతలు, కంపెనీ మూతలు తప్పవన్నారు. ముస్లింలు పేదలుగా ఉన్నారని రాహుల్‌గాంధీ చెబుతున్నడు.. 55 యేళ్లుగా ఓటు బ్యాంకుగా వాడుకున్న కాంగ్రెస్‌ దీనికి కారణం కాదా..? ఆలోచించాలన్నారు. ఎప్పుడూ సెక్యులర్‌గా ఉండే పార్టీ బీఆర్‌ఎస్‌ అన్నారు. బీజేపీని కేంద్రంలో గద్దె దించే దమ్ము కేసీఆర్‌కే ఉందన్నారు. బీజేపీని ఢీకొట్టే దమ్ము కాంగ్రెస్‌, రాహుల్‌గాంధీకి లేదన్నారు. ‘ఢిల్లీకి తెలంగాణ బిడ్డలమైన మేం తలవంచం.. కేసులు పెట్టినా.. ఐటీ, ఈడీ దాడులు చేసినా ఎవరికీ భయపడేది లేదు.. మీ ఆదరణ ఉంటే దేశ రాజధానిలోనూ గులాబీ జెండా ఎగురేస్తాం’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. మీరు మాతో ఉన్నంత కాలం.. హైదరాబాద్‌ను అద్భుతంగా చేసి చూపిస్తామన్నారు. తొమ్మిదిన్నరేళ్లు హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉన్నందుకే కంపెనీలు వస్తున్నాయని, ఉపాధి లభిస్తుందన్నారు.

అజారుద్దీన్‌తో క్రికెట్‌ ఆడించండి..

అజారుద్దీన్‌ వస్తే పిల్లలతో క్రికెట్‌ ఆడించండి. ఓటు మాత్రం మాగంటి గోపీనాథ్‌కు వేయాలని కేటీఆర్‌ అన్నారు. ‘కోహ్లీ సెంచరీ కొట్టాడు.. బీఆర్‌ఎస్‌ వంద స్థానాల్లో గెలవాలి.. షమీ హ్యాట్రిక్‌ తీశాడు.. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం అవుతారు’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. అజారుద్దీన్‌ ఇతకుముందు రహ్మత్‌నగర్‌, బోరబండ, ఎర్రగడ్డలో ఎవరికైనా కనిపించాడా..? ఎన్నికలయ్యాక కనబడుతడా..? అని ప్రశ్నించారు. సామాన్యుడైన గోపీనాథ్‌ లాంటి వాళ్లతో మన పనులు జరుగుతాయన్నారు.

CC.jpg

షాదాబ్‌లో కేటీఆర్‌... ఫేమస్‌ ఐస్‌క్రీమ్‌ షాపులోనూ సందడి

ఎన్నికల వేళ సమావేశాలు, రోడ్‌ షోలతో బిజీగా ఉన్న కేటీఆర్‌ ప్రచారం ముగిశాక సరదాగా గడిపేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో రోడ్‌ షోలు ముగిసిన అనంతరం చార్మినార్‌ సమీపంలోని షాదాబ్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ బిర్యానీ తిని హోటల్‌లో ఉన్న వారితో సంభాషించారు. అక్కడి నుంచి మొజంజాహీ మార్కెట్‌లోని ఫేమస్‌ ఐస్‌ క్రీమ్‌ షాపులో ఐస్‌క్రీమ్‌ రుచి చూశారు. కేటీఆర్‌ రాక విషయం తెలుసుకున్న యువత భారీగా అక్కడకు తరలివచ్చారు. ఆయనతో కరచాలనం చేసేందుకు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఇటీవలే బంజారాహిల్స్‌లోని నిలోఫర్‌ కేఫ్‌కు వెళ్లిన కేటీఆర్‌ అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచారు.

Updated Date - 2023-11-18T09:19:13+05:30 IST