TSPSC Paper Leak Case: బండి సంజయ్‌, రేవంత్‌కు వారం గడువు ఇచ్చిన కేటీఆర్

ABN , First Publish Date - 2023-03-28T20:05:46+05:30 IST

ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు.

TSPSC Paper Leak Case: బండి సంజయ్‌, రేవంత్‌కు వారం గడువు ఇచ్చిన కేటీఆర్
TSPSC Paper Leak Case

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి(Bandi Sanjay Kumar), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి(Anumula Revanth Reddy) తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(KTR) లీగల్ నోటీసులు పంపారు. ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి పదేపదే అబద్దాలను మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పారు. కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారి పైన అసత్య ప్రచారం చేసే హక్కు వీరికి లేదన్నారు. ఇండియన్ పీనల్ కోడ్(IPC) లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. వారం రోజులలోగా తమ వ్యాఖ్యలను వెనకకు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు.

మరోవైపు టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ కేసులో(TSPSC Paper Leak Case) టెక్నికల్ సర్వీస్‌ నుంచి టీఎస్‌పీఎస్సీకి డిప్యుటేషన్‌పై వచ్చిన రాజశేఖర్ రెడ్డిని(Atla Rajashekar Reddy), సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌ ప్రవీణ్‌ను(Pulidindi Praveen Kumar), మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు రేణుక(Renuka)ను ఇతర నిందితులను సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు.

అక్టోబర్‌ 1 వ తేదీన శంకర్‌ లక్ష్మి డైరీ నుండి క్రెడెన్షియల్స్‌ ప్రవీణ్‌ కొట్టేసినట్లు సిట్‌ గుర్తించింది. ఏఈ, గ్రూప్‌ 1, టౌన్‌ ప్లానింగ్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు ప్రవీణ్‌, రాజశేఖర్‌ అక్టోబర్‌లోనే కొట్టేసి రేణుక, డాక్యానాయక్‌ ద్వారా మార్కెట్‌‌లో విక్రయించినట్టు సిట్‌ అదికారులు గుర్తించారు. డాక్యానాయక్‌ నుంచి ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన తిరుపతయ్య ప్రస్తుతం సిట్‌ అదుపులో ఉన్నాడు. అతన్ని విచారించిన అధికారులకు మరో రెండు కొత్త పేర్లు తెలిసాయి. ఆ ఇద్దరూ సెల్ ఫోన్‌లు స్విచ్చాఫ్‌ చేసి పరారీలో ఉన్నట్టు సిట్‌ గుర్తించింది. త్వరలోనే వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

Updated Date - 2023-03-28T20:07:42+05:30 IST