MLC Kavitha: ఢిల్లీకి కవిత... ఈడీ విచారణపై ఉత్కంఠ.. ఈ సారి కూడా హాజరు కాకుంటే..

ABN , First Publish Date - 2023-03-19T16:33:43+05:30 IST

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఢిల్లీ (Delhi) వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్ (Minister KTR), ఎంపీ సంతోష్ కూడా ఢిల్లీ వెళ్లారు.

MLC Kavitha: ఢిల్లీకి కవిత... ఈడీ విచారణపై ఉత్కంఠ.. ఈ సారి కూడా హాజరు కాకుంటే..

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఢిల్లీ (Delhi) వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్ (Minister KTR), ఎంపీ సంతోష్ కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam) ఈ నెల 20న కవితను విచారించాలని ఈడీ నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈడీ విచారణ, కోర్టు వాయిదాలు.. నిందితుల కస్డడీ ఇలా అనేకానేక పరిణామాలు ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈడీ విచారణకు డుమ్మా కొట్టి ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈడీ రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తోందని, మహిళా హక్కులను గౌరవించడం లేదని ఈడీపై కవిత విమర్శలు సంధిస్తున్నారు. ఆమె గత విచారణకు డుమ్మా కొట్టడం, కోర్టులో పిటిషన్ (Petition) వేయడంతో గందరగోళంగా మారింది.

ఈ నెల 11న కవితను ఈడీ అధికారులు విచారించారు. మళ్లీ ఈ నెల 16న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే ఆమె 16న ఢిల్లీ వెళ్లారు.. కానీ విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో సహ నిందితులతో పాటు కవితనూ విచారించాలని ఈడీ భావించింది. అందుకోసం ఈ నెల 20న విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలోనే ఈడీ విచారణపై అభ్యంతరాలు తెలుపుతూ కవిత సుప్రీంకోర్టు (Supreme Court) తలుపుతట్టింది. కవిత పిటిషన్‌ను 24న విచారిస్తామని న్యాయస్థానం షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కవిత ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు విచారణకు రావాలని ఈడీ నోటీసులిచ్చింది. ఉన్నపళంగా కవిత ఇప్పుడు ఢిల్లీ వెళ్లడంతో ఉత్కంఠ నెలకొంది. రేపు కవిత ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. కోర్టులో పిటిషన్‌ను సాకుగా చూపి.. ఈ సారి కూడా కవిత ఈడీ విచారణకు డుమ్మా కొట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రెండోసారి కూడా కవిత విచారణకు డుమ్మా కొడితే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ స్పందించింది. ఆమె పిటిషన్‌పై తమ వాదనలు వినకుండా ఎటువంటి ముందస్తు ఆదేశాలు జారీ చేయవద్దంటూ ఈడీ కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కవిత తన పిటిషన్‌లో ఈడీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళనైన తనను కార్యాలయానికి పిలిపించడం, రాత్రి 8.30 గంటల వరకు కూర్చోబెట్టడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈడీ బెదిరిస్తోందని, బలప్రయోగంతో పాటు థర్డ్‌ డిగ్రీ పద్ధతులు అవలంబిస్తోందని, తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. నళినీ చిదంబరం కేసులో మహిళను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఒత్తిడి చేయబోమని ఈడీ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిందని, అయినా కూడా తనను కార్యాలయానికి పిలిపించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. కవిత పిటిషన్‌ ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అదే రోజు ఈడీ వాదనలు కూడా న్యాయస్థానం వినే అవకాశం ఉంది.

Updated Date - 2023-03-19T16:34:41+05:30 IST