కామారెడ్డి బంద్ ప్రశాంతం
ABN , First Publish Date - 2023-01-06T19:12:06+05:30 IST
కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మాస్టర్ ప్లాన్‌లో ఇండస్ట్రియల్, గ్రీన్‌జోన్‌లను తొలగించాలంటూ రైతు....
కామారెడ్డి: కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మాస్టర్ ప్లాన్‌లో ఇండస్ట్రియల్, గ్రీన్‌జోన్‌లను తొలగించాలంటూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన కామారెడ్డి బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, రామారెడ్డి, రాజంపేట, సదాశివనగర్, ఎల్లారెడ్డి పట్టణంలోనూ స్వచ్ఛందంగా విద్యాసంస్థలకు యాజమాన్యాలు బంద్ ప్రకటించాయి. రైతులకు మద్దతుగా వ్యాపారులు కూడా తమ తమ వాణిజ్య, వ్యాపార సముదాయాలను మూసివేశారు. పలువురు రైతులు, బీజేపీ, కాంగ్రెస్ (BJP Congress) కార్యకర్తలు కామారెడ్డి పట్టణంతో పాటు ఆయా మండలాల్లోని ప్రధాన కూడళ్లలో బైక్ ర్యాలీలతో వెళ్లి తెరిచి ఉన్న దుకాణాలను మూసివేశారు. దీంతో రైతుల బంద్ పిలుపు ప్రశాంతంగా జరిగింది.
ఎక్కడికక్కడే రైతుల నిర్బంధం
కామారెడ్డి కొత్త మాస్టర్‌ప్లాన్ (Masterplan)ను రద్దు చేయాలంటూ రైతులు చేపడుతున్న ఆందోళనను కట్టడి చేసేందుకు పోలీసులు రైతులను ఎక్కడికక్కడే నిర్బంధం చేశారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా శుక్రవారం ఉదయం నుంచే కామారెడ్డి పట్టణంతో పాటు అడ్లూర్ ఎల్లారెడ్డి, టెక్రియాల్, ఇల్చిపూర్, అడ్లూర్, కామారెడ్డి, లింగాపూర్ (Lingapur) గ్రామాల్లోనూ పోలీసు బలగాలను మోహరించి భారీ బందోబస్తును చేపట్టారు. ఆందోళన, నిరసనలు చేపట్టే రైతులను, బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు ముందుగానే అరెస్టు చేసి ఆయా పోలీసుస్టేషన్‌లకు తరలించారు. అడ్లూర్ ఎల్లారెడ్డి, టెక్రియాల్‌కు చెందిన రైతులు కామారెడ్డి పట్టణానికి వస్తుండగా సీఎస్‌ఐ చర్చి, కొత్త బస్టాండ్ సమీపంలో అరెస్టు చేసి దేవునిపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. లింగాపూర్, ఇల్చిపూర్ గ్రామాలకు చెందిన రైతులను కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో అరెస్టు చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో పలువురు మహిళా రైతులను సైతం అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతల అరెస్టు
మాస్టర్‌ప్లాన్ బాధితులు, రైతు ఐక్యకార్యాచరణ కమిటీ కామారెడ్డి బంద్ పిలుపునకు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. బాధిత గ్రామాల రైతులతో పాటు ప్రధాన పార్టీల నేతలు ఆందోళన చేపడుతూ వస్తున్నాయి. బంద్ నేపథ్యంలో బీజేపీ నేత వెంకటరమణారెడ్డిని హౌస్ అరెస్టు చేసి రాజంపేట పోలీసుస్టేషన్‌కు తరలించారు. దాంతో పాటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్యనేతలను ముందస్తుగా అరెస్టు చేసి రామారెడ్డి, మాచారెడ్డి, దేవున్‌పల్లి తదితర పోలీసుస్టేషన్‌లకు తరలించారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి (Enagu Ravinder Reddy) పోలీసుల కళ్లుకప్పి మున్సిపల్ గోడదూకి కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రవీందర్‌రెడ్డి ఆయన అనుచరులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. రైతుల బంద్‌కు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్‌అలీ కాంగ్రెస్ కిసాన్‌సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డిలు, కాంగ్రెస్ ముఖ్యనేతలు కామారెడ్డిలోని ఇందిరాచౌక్ వద్ద ధర్నా చేపట్టారు. పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి కామారెడ్డి పోలీసుస్టేషన్‌కు తరలించారు.