TS Highcourt: ‘700 మందికి ఒక్కటే బాత్రూమా’?... విద్యాసంస్థల్లో వసతులపై హైకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2023-03-03T10:04:42+05:30 IST

ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస వసతులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

TS Highcourt: ‘700 మందికి ఒక్కటే బాత్రూమా’?... విద్యాసంస్థల్లో వసతులపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: ప్రభుత్వ విద్యాసంస్థ (Government Educational Institutions)ల్లో కనీస వసతులపై హైకోర్టు (Telangana High court) ఆగ్రహం వ్యక్తం చేసింది. 700 మంది విద్యార్థినులకు ఒక్కటే మూత్రశాలా? అంటూ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (Sarurnagar Government Junior College)లో సమస్యలపై ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్‌ (LLB student Manideep) రాసిన లేఖను న్యాయస్థానం సుమోటో (Sumoto) గా తీసుకుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని (Telangana Government) హైకోర్టు ప్రశ్నించింది. ఇంటర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభుత్వ విద్యాసంస్థల్లో బాలికలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎస్‌, విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. విద్యాసంస్థల్లోని వసతులపై ఏప్రిల్‌ 25లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

కాగా... కాలేజీలో కనీస వసతులు కల్పించాలంటూ కొద్దిరోజులగా విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ కనీస చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పీరియడ్స్ సమయంలో కాలేజీకి రాలేకపోతున్నామని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. నేచురల్ కాల్స్ రాకుండా టాబ్లెట్స్ వాడాల్సి వస్తుందని విద్యార్థినిలు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనానికి అరగంట మాత్రమే విరామం ఇస్తున్నారు. ఆ సమయంలోనే భోజనం చేయడంతో పాటు ఉన్న టాయిలెట్‌ను ఉపయోగించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితులకు భయపడి చాలా మంది విద్యార్థినిలు నెలసరి సమయంలో కాలేజీకి రావడం లేదు. కొంతమంది నీరు కూడా తాగడం లేదు. పరిస్థితులను వివరిస్తూ ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మనిదీప్ హైకోర్టుకు లేఖ రాశారు. దీనని సుమోటోగా స్వీకరించిని జస్టిస్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

Updated Date - 2023-03-03T11:42:13+05:30 IST