Swapnalok Fire Accident: పేరు ఘనం..నిర్వహణ అధ్వానం

ABN , First Publish Date - 2023-03-18T14:11:59+05:30 IST

జంటనగరాల్లోని(Twin Cities) పేరొందిన కాంప్లెక్స్‌ల్లో ఒకటి స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ (Swapnalok Complex). సికింద్రాబాద్‌ (Secunderabad)కు ల్యాండ్‌మార్కుగా నిలిచే స్వప్నలోక్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో భవన నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Swapnalok Fire Accident: పేరు ఘనం..నిర్వహణ అధ్వానం

హైదరాబాద్‌: జంటనగరాల్లోని(Twin Cities) పేరొందిన కాంప్లెక్స్‌ల్లో ఒకటి స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌(Swapnalok Complex). సికింద్రాబాద్‌ (Secunderabad)కు ల్యాండ్‌మార్కుగా నిలిచే స్వప్నలోక్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో భవన నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1980వ దశకంలో నిర్మించిన ఈ భవనం జంటనగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా సుపరిచితమే. గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు 8 అంతస్తులు కల్గిన కాంప్లెక్స్‌లో 200కు పైగా దుకాణాలు, పలు సంస్థలకు చెందిన కార్యాలయాలున్నాయి. దుస్తుల షాపులు, కంప్యూటర్‌ క్యాటరిడ్జ్‌ సంబంధిన షాపులు, చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌, బీమా సంస్థలు, చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌తోపాటు పలు కాల్‌సెంటర్‌ కార్యాలయాలు ఉన్నాయి. రోజూ కాంప్లెక్స్‌కు వేల సంఖ్యలో ప్రజలు పలు పనుల కోసం వస్తుంటారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కాంప్లెక్స్‌ చుట్టూ పెద్ద వాహనాలు రాకపోకలు సాగించేందుకు అనువుగా సెట్‌బ్యాక్‌లు ఉన్నా పలు షాపుల నిర్వాహాకులు ఇష్టానుసారంగా మరమ్మతులు చేసుకోవడంతో ఖాళీ స్థలం తగ్గిందని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రతి అంతస్తులో చెత్త..

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ఏ,బీ బ్లాక్‌లలో రెండు వందలకు పైగా దుకాణాలు, కార్యాలయాలు ఉన్నాయి. బి బ్లాక్‌లోని ఐదో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగినట్లు కొంతమంది షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. కొన్నేళ్లు కాంప్లెక్స్‌ నిర్వహణ అధ్వానంగా మారడంతో ప్రతి అంతస్తులో చెత్త పేరుకు పోయింది. భవనం నిర్వహణ సరిగా లేకపోవడంతో నాలుగు, ఐదో, ఆరు అంతస్తుల్లోని బాల్కానీలో పిచ్చి మొక్కలు పెరిగాయి. వర్షం పడితే కాంప్లెక్స్‌పై అంతస్తుల నుంచి కిందకు వర్షపు నీరు కారడంతోపాటూ, రెయిలింగ్‌ ఊడిపడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగితే మంటలు ఆర్పేందుకు ఏర్పాటు చేసిన ఫైర్‌ సేఫ్టీ పరికరాలు (Fire safety equipment)కూడా పనిచేయలేదు. ఒక బ్లాక్‌ నుంచి మరో బ్లాక్‌ వెళ్లేందుకు దారులు లేకపోవడం ప్రమాద తీవ్రతకు దారితీసింది. ఎమర్జెన్సీ మెట్లున్నా ఆ మార్గంలో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో దారులన్నీ మూసుకుపోయాయి. కాంప్లెక్స్‌ నిర్వహణపై ఫిర్యాదులు వచ్చినా జీహెచ్‌ఎంసీ(GHMC), అగ్నిమాపక శాఖ పట్టించుకోలేదనే పలువురు ఆరోపిస్తున్నారు.

ఏడేళ్లుగా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం

ఏడేళ్ల క్రితం స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ నిర్వహణ బాధ్యతలను మేము తీసుకున్నాము. నిర్వహణ మెరుగ్గా ఉంది. గురువారం సాయంత్రం 6.30గంటల తర్వాత కాంప్లెక్స్‌పై అంతస్తుల నుంచి పొగలు, మంటలు వచ్చాయి. దాంతో విద్యుత్‌ సరఫరాను నిలిపి వేయించాం. 5వ అంతస్తు నుంచి పొగలు, మంటలు ప్రారంభమయ్యాయని గుర్తించాం. అయితే, అగ్నిప్రమాదానికి కారణాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు. కాంప్లెక్స్‌లో కొందరు కాఫీ, టీ కోసం సిలిండర్లు పెట్టారని అంటున్నారు. ఆ సమాచారం కోసం ప్రయత్నిస్తున్నాం.

- శ్రీకాంత్‌, స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ నిర్వహణ ఇన్‌చార్జి

అగ్నిప్రమాద నివారణ సామగ్రి పనిచేస్తుందా..?

సిటీలోని నెంబర్‌ వన్‌ భవనాల్లో ఇదీ ఒకటి. కానీ, నిర్వహణ మాత్రం అధ్వాన్నంగా ఉంది. భవనం ముందు భాగం నుంచి నలువైపులా చూస్తే పిచ్చి మొక్కలు మొలవడం, వాటర్‌ లీకేజీలు కన్పిస్తున్నాయి. అగ్నిప్రమాద నివారణ సామగ్రి పని చేస్తుందో, లేదో కూడా ఎవరికీ తెలియదు. ప్రమాదాలు సంభవిస్తే ప్రాణాలతో బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిప్రమాద నివారణ సామగ్రి ఉన్న ప్రాంతం, భవనం నుంచి బయటకు వెళ్లేందుకు ఉన్న మార్గాలపై ఆయా ఆఫీసుల్లోని ఉద్యోగులకు అవగాహన కల్పించడం తప్పకుండా చేయాలి.

- అంచూర్‌ (ఇంజినీర్‌, ఆర్కిటెక్ట్‌)

Updated Date - 2023-03-18T14:12:29+05:30 IST