Congress House Arrest: కొనసాగుతున్న కాంగ్రెస్ నేతల హౌజ్ అరెస్ట్‌లు... రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ABN , First Publish Date - 2023-03-25T10:08:20+05:30 IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌కు సంబంధించి ఓయూ విద్యార్థులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతలను రెండో రోజు కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు.

Congress House Arrest: కొనసాగుతున్న కాంగ్రెస్ నేతల హౌజ్ అరెస్ట్‌లు... రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌ (TSPSC Leakage)కు సంబంధించి ఓయూ విద్యార్థుల (OU Students)కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతల (Congress Leaders)ను రెండో రోజు కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేతలను హౌజ్‌ అరెస్ట్ (House Arrect) చేసిన పోలీసులు ఈరోజు కూడా అదే తీరును కొనసాగిస్తున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ను గృహనిర్బంధం చేశారు. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ (TPCC Chief Revanth reddy) ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

నిన్న నిరుద్యోగ మహాదీక్షకు రేవంత్ హాజరుకావడంపై రేవంత్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దీక్షకు ముఖ్య అతిథిగా హాజరై రేవంత్ సంఘీభావం తెలపాలని టీపీసీసీ చీఫ్ నిర్ణయించారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదంటూ.. రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీకి (Osmania University) వెళ్ళకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేశారు. రేవంత్ ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఓయూ విద్యార్థులు చేపట్టిన నిరుద్యోగ మహాదీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే వారి దీక్షకు పోలీసులు అడ్డుతగిలారు. దీక్షకు ఎలాంటి అనుమతి లేదంటూ విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆర్ట్స్ కాలేజీకి దఫధఫాలుగా వస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూ అధికారులు కూడా గేట్లను మూసివేశారు. అయితే మధ్యాహ్నం తర్వాత ఓయూలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులు పూలదండలతో ఆర్ట్స్ కాలేజీ మెట్ల దగ్గర దీక్షకు కూర్చుకున్నారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దీక్ష కూర్చున్న విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నగేష్ అనే విద్యార్థి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

Updated Date - 2023-03-25T10:08:20+05:30 IST