KTR: సినిమా చూసేందుకు వచ్చి మేమూ ట్రాఫిక్‌లో ఇరుక్కునే వాళ్లం.. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవంలో కేటీఆర్

ABN , First Publish Date - 2023-08-19T12:02:03+05:30 IST

నాయిని నర్సింహా రెడ్డి స్టీల్ బ్రిడ్జి‌ను మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు ప్రారంభించిన నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఎస్సార్డీపీ కింద 36వ ఫలితం అని చెప్పుకొచ్చారు.

KTR: సినిమా చూసేందుకు వచ్చి మేమూ ట్రాఫిక్‌లో ఇరుక్కునే వాళ్లం.. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవంలో కేటీఆర్

హైదరాబాద్: నాయిని నర్సింహా రెడ్డి స్టీల్ బ్రిడ్జి‌ను (Steel Bridge) మంత్రి కేటీఆర్ (Minister KTR) శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు ప్రారంభించిన నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఎస్సార్డీపీ కింద 36వ ఫలితం అని చెప్పుకొచ్చారు. ‘‘మేము కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమా చూసేందుకు వచ్చే వాళ్ళం... ట్రాఫిక్‌లో చిక్కుకునే వాళ్ళం’’ అంటూ ఆనాటి రోజులను మంత్రి గుర్తుచేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలో హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీరుతున్నాయన్నారు. ఇందిరా పార్కును అభివృద్ధి చేస్తామని తెలిపారు. ట్యాంక్ బండ్, లోయర్ ట్యాంక్ బండ్లను కలుపుతూ ఓ వ్యవస్థను సృష్టిస్తామని ప్రకటించారు. గతంలో మాదిరిగా హైదరాబాద్‌లో కర్ఫ్యూలు లేవన్నారు. హిందువులు, ముస్లింలు కలిసి బతుకుతున్నామని తెలిపారు. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో ప్రతి పక్షాలకు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి హాజరయ్యారు.


కాగా... గ్రేటర్‌లో అతి పెద్దదైన స్టీల్‌ వంతెన మరికాసేపట్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఎస్సార్డీఏలో భాగంగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నాలుగు చౌరస్తాల మీదుగా 2.81 కి.మీల మేర రూ.450 కోట్లతో ఈ స్టీల్‌ వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంలో 12,500 మెట్రిక్‌ టన్నుల ప్రత్యేక అలాయ్‌ స్టీల్‌, 20 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వినియోగించారు. స్టీల్‌ను ఉక్రెయిన్‌ నుంచి తీసుకువచ్చారు. వంతెనలో మొత్తం 81 స్టీల్‌ పిల్లర్లు, 46 పైల్‌ ఫౌండేషన్లు ఉన్నాయి. నాలుగు లేన్లుగా నిర్మించిన దీనిలో 426 గర్డర్లు ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ చౌరస్తాలో మెట్రో కారిడార్‌ మీదుగా 26.54 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించడం విశేషం. నగరంలో ఇప్పటి వరకు వంతెనల మీదుగా మెట్రో కారిడార్‌ ఉండగా.. ఇక్కడ మాత్రమే మెట్రో కారిడార్‌పై వంతెన నిర్మాణం జరిగింది. బయో డైవర్సిటీ తరహాలో రెండో లెవల్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వద్ద స్టీల్‌ బ్రిడ్జి ఉంటుంది. ఎస్‌ఆర్‌డీపీలో పూర్తయిన వంతెనల్లో ఇది 20వది కాగా.. మొత్తం 47 పనులకుగాను 36 అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో అక్కడి ట్రాఫిక్‌ కష్టాలకు చెక్ పడనుంది. సాధారణ సమయాల్లో వీఎస్టీ నుంచి ఇందిరాపార్కు వద్దకు రావడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుండగా.. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభంతో కేవలం ఐదు నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది.

Updated Date - 2023-08-19T12:41:01+05:30 IST