Jeedimetla: హైదరాబాద్‌లోని జీడిమెట్ల, బొల్లారంలో ఉంటున్నారా..? ఎంత డేంజర్ వచ్చి పడిందంటే..

ABN , First Publish Date - 2023-03-06T16:52:30+05:30 IST

హైదరాబాద్(Hyderabad) నగర శివారులోని పారిశ్రామిక వాడల్లో (Industrial Areas) ప్రమాదాలు రోజుకురోజుకు పెరిగిపోతున్నాయి..

Jeedimetla: హైదరాబాద్‌లోని జీడిమెట్ల, బొల్లారంలో ఉంటున్నారా..? ఎంత డేంజర్ వచ్చి పడిందంటే..

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్(Hyderabad) నగర శివారులోని పారిశ్రామిక వాడల్లో (Industrial Areas) ప్రమాదాలు రోజుకురోజుకు పెరిగిపోతున్నాయి.. రియాక్టర్లు పేలి (Reactors Exploding) వరుస ప్రమాదాలతో కార్మికులు, కెమిస్ట్‌లు(Chemist) ప్రాణాలు కోల్పోతున్నారు. తీవ్రగాయాలపాలై శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నారు. ఫార్మా కంపెనీల్లో (Pharma Industries) వరుసగా జరుగుతున్న రియాక్టర్ల ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యధిక వేడి, పీడనం వద్ద పనిచేసే ఈ రియాక్టర్ల వినియోగంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయా..? అధికారుల పర్యవేక్షణా లోపంతో రియాక్టర్లు పేలుతున్నాయా? మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమా..?

ఫార్మా రాజధాని (Pharma Capital)గా పేరుగాంచిన నగరం చుట్టూ ఉన్న పారిశ్రామికవాడల్లో వివిధ రకాల ఔషధాలు(Medicines) తయారుచేసే వందల పరిశ్రమలు (Pharma industries) ఉన్నాయి. తనిఖీలు చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయా పరిశ్రమల్లో ప్రమాదకర రియాక్టర్ల (Reactor)వద్ద నైపుణ్యంలేని దినసరి కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఒకవేళ ప్రమాదం (Accident) జరిగి ప్రాణాలు పోతే వారి కుటుంబ సభ్యులకు ఎంతోకొంత పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు.

జాగ్రత్తలు పాటించకుంటే..

ఫార్మా సంస్థల్లో తరచూ పేలుతున్న రియాక్టర్లు కార్మికుల ఉసురు తీస్తున్నాయి. సాధారణంగా ఫార్మా సంస్థల్లో బ్యాచ్‌ రియాక్టర్లు, కంటిన్యూయస్‌ స్టిర్డ్‌ రియాక్టర్లు, ప్లగ్‌ ఫ్లో రియాక్టర్లను వినియోగిస్తారు. అత్యధిక వేడి, పీడనం వద్ద పనిచేసే ఈ రియాక్టర్ల వినియోగంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుంటే పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

తరచూ తనిఖీ..

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బల్క్‌ డ్రగ్‌ తయారీ సంస్థల్లో విరివిగా వినియోగించే రియాక్టర్లను తరచూ తనిఖీ చేయాలి. చిన్నచిన్న లోపాలను వెంటనే సరిదిద్దాలి. బ్యాచ్‌ పూర్తికాగానే శుభ్రం చేసి తర్వాతి బ్యాచ్‌ కెమికల్స్‌ వేయాలి. భారీగా ఉత్పత్తి పెంచేందుకు రియాక్టర్‌లో లోడుకు మించి రసాయనాలు వేయడం, రక్షణ చర్యలు పాటించకుండా నిర్లక్ష్యం చేయడం, లీకేజీలను పట్టించుకోకపోవడం, పీడనం పెరిగిన వాటిని గుర్తించకపోవడంతోనే ఎక్కువగా పేలుళ్లు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

జీడిమెట్ల పారిశ్రామికవాడలోని అరోరా ఫార్మా స్యూటికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యూనిట్‌-1లో మార్చి1న ఉదయం రియాక్టర్‌ పేలి భారీ విస్పోటనం సంభవించింది. ఈ సంఘటనలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కెమిస్ట్‌ నరేందర్‌ (26), ఒడిశాకు చెందిన కార్మికుడు కుమార్‌ సరేన్‌(25) సజీవ దహనమయ్యారు.

బొల్లారంలోని శ్రీకర ఆర్గానిక్స్‌ సంస్థలో మార్చి2న రియాక్టర్‌ పేలిన సంఘటనలో కార్మికులు అనూప్‌, సాయికమల్‌, రమేష్‌, రాజేష్‌, రామచంద్రరాజులు తీవ్రంగా గాయపడ్డారు.

2022 డిసెంబర్‌ 12న బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రియాక్టర్‌ పేలడంతో రసాయనాలు పడి ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

2022 జూలై 29న జీడిమెట్లలోని కెమికల్‌ సంస్థలో రియాక్టర్‌ పేలడంతో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు.

ఇలా పారిశ్రామిక వాడలోని పరిశ్రమల్లో తరచూ రియాక్టర్ పేలుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు నామమాత్రపు తనిఖీవల్లనే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అనేకమంతి కార్మికులు, కెమిస్ట్‌లు ప్రాణాలు కోల్పోతున్నారు.

Updated Date - 2023-03-06T16:52:30+05:30 IST