Hyderabad: చెత్తకు నిప్పంటుకొని.. ఎంత పనైంది.. అదే గానీ జరిగి ఉంటే..
ABN , First Publish Date - 2023-03-06T16:57:36+05:30 IST
హయత్‌నగర్‌లో(Hayathnagar) అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ విద్యుత్ సబ్‌స్టేషన్(Electricity Substation)కు తృటిలో..
హయత్‌నగర్, (ఆంధ్రజ్యోతి): హయత్‌నగర్‌లో(Hayathnagar) అగ్నిప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. ఓ విద్యుత్ సబ్‌స్టేషన్(Electricity Substation)కు తృటిలో ప్రమాదం తప్పింది. సబ్‌స్టేషన్ వద్ద కుప్పగా పోసిన చెత్తకు నిప్పంటుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న సబ్‌స్టేషన్ కేబుల్ వైర్లకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. మంటలు తీవ్రంగా వ్యాపిస్తుండటంతో అప్రమత్తమైన స్థానికులు, ఫైర్ సిబ్బంది (Fire Rescue Team) మంటలార్పారు. అయితే మరో పక్క ఉన్న పాఠశాలలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి.. ఒక్కసారిగి మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. సబ్‌స్టేషన్‌కు మంటలు అంటుకుని ఉంటే తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్ డివిజన్‌లోని ఆర్టీసీ బస్‌డిపో (RTC Bus Depot) రోడ్డులో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పారిశుధ్య కార్మికులు చెత్తను కుప్పగా చేసి దహనం చేశారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న విద్యుత్ కేబుల్ వైర్లకు అంటుకున్నాయి. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో స్థానికులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పి వేశారు. తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అయిత సబ్‌స్టేషన్‌కు మంటలు అంటుకొని ఉంటే త్రుటిలో ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక పక్క సరితా పాఠశాలలో టీఎ్‌సపీఎస్సీ పరీక్షలు జరుగుతుండగా ఈ ప్రమాదం జరగడంతో అటు విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పారిశుధ్య కార్మికుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే సబ్‌స్టేషన్ సమీపంలో చెత్తను పోగుచేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు స్పందించి సబ్‌స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెత్తవేయకుండా చర్యలు చేపట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.