CM KCR: ఆ సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వం!
ABN , First Publish Date - 2023-08-22T02:55:41+05:30 IST
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు(Allotment of houses to journalists) ప్రక్రియ చివరి దశలో ఉందని.. వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కేటాయింపు ప్రక్రియ తుది దశలో ఉంది
కొన్ని కులపత్రికలు.. గులపత్రికలున్నయ్
పొద్దున్నే లేచి మా మీద వ్యతిరేక వార్తలు
రాసేవాళ్లకు.. విషం చిమ్మేవాళ్లకు ఇవ్వం
ఇది ప్రభుత్వ నిర్ణయం.. ప్రభుత్వ విచక్షణ
ఎందుకిస్తామండీ? ఎందుకు ఇయ్యాలి?
పాలు పోసి పామును పెంచలేం కదా?
జర్నలిస్టులకు జ్ఞానం విజ్ఞానం ఉండాలి
మీడియా సంస్థలపై సీఎం కేసీఆర్ అక్కసు
న్యూట్రల్‌గా ఉన్న వారికి ఇస్తామని వెల్లడి
పాత్రికేయులను పాములతో పోలుస్తారా?
అవసరం తీరాక జర్నలిస్టులను కాటేసిన
కాలనాగు కేసీఆర్: వైటీపీ అధినేత్రి షర్మిల
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు(Allotment of houses to journalists) ప్రక్రియ చివరి దశలో ఉందని.. వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే.. ప్రభుత్వం మీద విషం చిమ్మే కొన్ని పేపర్లలో పనిచేసే విలేకరులకు మాత్రం ఇళ్ల స్థలాలివ్వబోమని.. న్యూట్రల్‌గా ఉన్న మిగతా మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలిస్తామని ఆయన చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్(CM KCR).. ‘‘నేను గతంలో ఉద్యమం జరిగేటప్పుడే చెప్పాను.. ఈ రాష్ట్రంలో కొన్ని కుల పత్రికలున్నాయి.. కొన్ని గుల పత్రికలున్నాయని.. న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదు. వ్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా?’’ అంటూ కొన్ని మీడియా సంస్థల(Some media organizations) పట్ల తనకున్న అక్కసును వెళ్లగక్కారు. ‘‘ఇది ప్రభుత్వం నిర్ణయం. ప్రభుత్వ విచక్షణ. పొద్దున లేస్తే.. మాకు.. మాకంటే రాష్ట్రానికి.. రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే శక్తులకు ఎందుకిస్తాం? ఎందుకియ్యాలి? పాలు పోసి పాములను పెంచలేం కదా?’’ అన్నారు.
సంస్థల విధానాలకు జర్నలిస్టులను ఎలా ఇబ్బంది పెడతారని ప్రశ్నించగా.. ‘‘జర్నలిస్టులకు కూడా ఉండాలి కదా? కీలు బొమ్మలాగా ఉండేవారు జర్నలిస్టులవుతారా? సోయి ఉండాలి కదా? ఆ మాత్రం జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా? ఇండియాలో (తెలంగాణతో) పోల్చుకోవడానికి కూడా ఇతర రాష్ట్రాలు భయపడే రాష్ట్రంలో.. ‘జీతాలు పడతలేవు’ అని రాస్తారు. ఒక్కటే దెబ్బలో మొన్న రూ.20వేల కోట్ల రుణం మాఫీ చేశాం కదా... ఇప్పుడు ఆ పేపర్.. తలకాయ ఎక్కడ పెట్టుకుంటుంది. అదొక పేపరా? ఏమనుకోవాలి.. అర్థం ఉండాలి. ద బెస్ట్ స్టేట్, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్‌బీఐ రిపోర్టులు(RBI Reports) వచ్చాయి. నీతిఆయోగ్ రిపోర్టులు వస్తాయి. పార్లమెంటులో కేంద్ర మంత్రులు లిఖిత పూర్వక సమాధానం ఇస్తారు.. అయినా కూడా.. మేం ఒకటే రొడ్డ కొట్టుడు కొడ్తం.. మా ఇష్టమొచ్చినట్లు రాస్తం అంటే అదేం పేపరండి.. దిక్కుమాలిన పేపరు. విజ్ఞత ఉన్నవారికి కూడా సిగ్గనిపిస్తుంది. పొద్దున లేస్తే.. అట్ల చెయ్యొచ్చునా.. అది జర్నలిజమాండి..!’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
నియంత కేసీఆర్..
ఉద్యమాన్ని ముందుండి నడిపిన జర్నలిస్టులను సీఎం కేసీఆర్ పాములతో పోల్చడం బాధాకరమని వైఎ్‌సఆర్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. ఆయన అక్రమాలపై, బందిపోట్ల రాష్ట్ర సమితి దోపిడీపై నిజానిజాలు బయటపెడితే విషం చిమ్మినట్లా అని ప్రశ్నించారు. ‘‘ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం జర్నలిస్టులు చేసిన పోరాటాన్ని మరిచి అధికార మదంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నడు. అవసరం తీరాక జర్నలిస్టులను కాటేసిన కాలనాగు కేసీఆర్’’ అని షర్మిల ధ్వజమెత్తారు. ‘‘జర్నలిస్టులు తమ జీవితాలను త్యాగం చేయకపోతే రాష్ట్రం వచ్చేదా? నియంత కేసీఆర్‌కు అధికారం దక్కేదా?’ అని నిలదీశారు. విషం చిమ్మే పత్రికల జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వబోమన్న కేసీఆర్ అహంకారపూరిత వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తోందన్నారు. తక్షణమే జర్నలిస్టులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘పదవులు కుటుంబానికి పంచుకున్నట్లు.. పథకాలు పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నట్లుగా.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను కేసీఆర్‌కు భజన చేసేటోళ్లకే ఇద్దామనుకుంటున్నరా? నచ్చినోళ్లుకు ఇచ్చుకునేందుకు రాష్ట్రం కేసీఆర్ అబ్బ సొత్తు కాదు. భజన చేేస్త ఇస్తాం అనడానికి ఆయనా శాశ్వతం కాదు’’ అని షర్మిల ధ్వజమెత్తారు.