టి. కాంగ్రెస్‌లో 60 మంది అభ్యర్థులు ఖరారు.. కేటాయించిన స్థానాల్లో నేతలు బిజిబిజీ.. ప్రకటన ఒక్కటే ఆలస్యం..!
ABN , First Publish Date - 2023-06-26T15:29:39+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్ మంచి జోష్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీకి జీవం వచ్చినట్టైంది. అప్పటిదాకా అంతంతమాత్రాన ఉన్న ఆ పార్టీ పరిస్థితి.. కర్ణాటక రిజల్ట్స్‌తో మొత్తం సీనే మారిపోయింది. కర్ణాటక విజయంతో మంచి ఊపు మీద ఉన్న ఆ నేతలంతా తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటుపై గురి పెట్టారు. దీంతో ఆ పార్టీ రోజురోజుకి పుంజుకుంటోంది. ప్రస్తుతం చేరికలతో స్పీడ్ అందుకుంది. తాజాగా
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ (Congress) మంచి జోష్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీకి జీవం వచ్చినట్టైంది. అప్పటిదాకా అంతంతమాత్రాన ఉన్న ఆ పార్టీ పరిస్థితి.. కర్ణాటక రిజల్ట్స్‌తో మొత్తం సీనే మారిపోయింది. కర్ణాటక విజయంతో మంచి ఊపు మీద ఉన్న ఆ నేతలంతా తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటుపై గురి పెట్టారు. దీంతో ఆ పార్టీ రోజురోజుకి పుంజుకుంటోంది. ప్రస్తుతం చేరికలతో స్పీడ్ అందుకుంది. తాజాగా పొంగులేటి, జూపల్లి హస్తం గూటికి చేరుతుండగా.. ఈ ఊపు ముందు ముందు మరింత వేగంగా ఉంటుందని నేతలు చెప్పుకొస్తున్నారు. మరికొందరు ఇతర పార్టీ వాళ్లు కాంగ్రెస్‌లో చేరతారని చెప్పుకొస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే.. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో కూడా భారీగానే కసరత్తు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే కొంత మంది అభ్యర్థుల ఎంపిక జరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో 60 సీట్లు ఖరారు అయిపోయాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వారంతా ఎవరి స్థానాల్లో వారు పని చేసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడం అనేది గత చరిత్ర అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది మునిగిపోయే నావ అంటూ తేల్చిచెప్పారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తే దూరంగా ఉన్నారు.. ఇప్పుడేమో అమిత్ షా దగ్గర మొకరిల్లారని ఎద్దేవా చేశారు. మొన్నటి దాకా బీఆర్ఎస్, బీజేపీ దాగుడు మూతలు ఆడాయని.. ఇప్పుడు బీఆర్ఎస్-బీజేపీ డ్రామాలు బయటపడ్డాయని జీవన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.