ED VS MLC Kavitha: ఈడీతో కవిత ఢీ!

ABN , First Publish Date - 2023-03-17T03:41:21+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను ఢీకొట్టారు.

ED VS MLC Kavitha: ఈడీతో కవిత ఢీ!

విచారణకు హాజరయ్యేందుకు నిరాకరణ

ప్రతినిధి ద్వారా 16 అంశాలపై ఈడీకి లేఖ

దర్యాప్తు న్యాయంగా జరగడం లేదని ఆరోపణ

మహిళగా, ఎమ్మెల్సీగా తన హక్కుల ప్రస్తావన

ఓ మహిళ విషయంలో ఆఫీసుకు పిలవనని

ఈడీ సుప్రీంకు హామీ ఇచ్చిందని వెల్లడి

సుప్రీంకోర్టు విచారణ వరకూ ఆగాలని విజ్ఞప్తి

24 వరకు ఆగం.. సోమవారం రావాలన్న ఈడీ

న్యూఢిల్లీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను ఢీకొట్టారు. గురువారం ఈడీ విచారణకు హాజరు కాకుండా అందర్నీ ఆశ్చర్యపరిచారు. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ ఏకంగా లేఖాస్త్రాన్ని సంధించారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ తాజా సమన్లలో ఎక్కడా పేర్కొనలేదని అందులో ప్రస్తావించారు. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లానని గుర్తు చేశారు. దర్యాప్తు న్యాయపరంగా, చట్టప్రకారం జరగడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు ఈ నెల 24న తన కేసు విచారణకు స్వీకరించే దాకా వేచి చూడాలని, ఏమైనా సమాచారం కావాలంటే తన అధికారిక ప్రతినిధికి చెప్పాలని, లేకపోతే తనకు ఈ-మెయిల్‌ చేయవచ్చని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉందని తెలిసి, పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు ఈడీ కార్యాలయం ముందు గుమిగూడారు.

AKY_kalvakuntla-kavitha--(1.jpg

అనూహ్యంగా కవిత రాసిన లేఖను తీసుకుని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది సోమా భరత్‌ కుమార్‌ ఈడీ కార్యాలయానికి చేరుకుని ఆ లేఖను సమర్పించారు. లేఖను పరిశీలించిన తర్వాత కొద్ది సేపటికి ఈడీఅధికారులు మార్చి 20న సోమవారం తమ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కవితకు మరో శ్రీముఖం పంపారు. ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ విచారణ జరిగేంత వరకూ ఆగాలని కవిత చేసిన అభ్యర్థనను ఈడీ తోసిపుచ్చింది. ఈ కేసులో ప్రఽధాన నిందితుడైన అరుణ్‌ రామచంద్ర పిళ్లైని గురువారం ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టిన ఈడీ ఆయనను కవితతో కలిపి ముఖాముఖి ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది. దీంతో ప్రత్యేక న్యాయస్థానం అరుణ్‌ పిళ్లై కస్టడీని మార్చి 20 వరకు పొడిగించింది. మార్చి 20న ఉదయమే కవిత-అరుణ్‌ పిళ్లైల మధ్య ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి, వాస్తవాలు రాబట్టుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందని, కవిత ఈడీ దర్యాప్తు నుంచి తప్పించుకునే అవకాశాలు లేవని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కాగా, కవిత రెండు రోజుల క్రితమే ఈడీకి లేఖ రాసి సిద్ధంగా ఉంచారని, సాధ్యమైనంత వరకు ఈడీ దర్యాప్తు తప్పించుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, మద్యం కుంభకోణంలో నిందితులైన అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ఆడిటర్‌ బుచ్చిబాబులను ముఖాముఖి కూర్చోబెట్టి ఒకరు చెప్పిన సాక్ష్యాలను మరొకరితో ధ్రువీకరింపచేయాలని, అనంతరం అరుణ్‌ పిళ్లైని కవితతో ముఖాముఖి కూర్చోబెట్టి వాస్తవాలను అంగీకరింపచేయాలని ఈడీ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా విచారణ తర్వాతఆమెను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. సుప్రీంకోర్టు బుధవారం కవిత పిటిషన్‌ను వెంటనే విచారించక పోవడం, గురువారం ఈడీ విచారణకు హాజరు కాకుండా లేఖ పంపి కవిత తప్పించుకున్నా, సోమవారం రావాల్సిందేనని వెంటనే తాఖీదు పంపడంతో ఆమె ఆత్మ రక్షణలో పడ్డట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

లేఖలో ఏముంది?

ఈడీ ప్రధాన కార్యాలయంలో దర్యాప్తు విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగీందర్‌ సింగ్‌కు సోమా భరత్‌ కుమార్‌ అందించిన కవిత లేఖలో 16 అంశాలను పేర్కొన్నారు. అవి...

2023 మార్చి 7న ఈడీ సమన్లు పంపినపుడు నేను మహిళను కాబట్టి, చట్ట ప్రకారం నన్ను డైరెక్టరేట్‌ ఆఫీసుకు పిలవకూడదు. ఆడియో, వీడియో ద్వారా జరిగే విచారణకు నేను సిద్దం. నా ఇంటికి కూడా వచ్చి విచారణ జరిపించవచ్చు అని చెప్పాను. అయినప్పటికీ మీరు అందుకు నిరాకరించి, ముఖాముఖి విచారణ జరగాల్సిందేనని పట్టుబట్టారు.

నేను చట్టాన్ని వివరించినప్పటికీ మీరు అంగీకరించక పోవడంతో, దర్యాప్తుకు సహకరించాలన్న ఉద్దేశంతో మార్చి 11న విచారణకు హాజరయ్యాను.

మార్చి 11న జరిగిన విచారణను బట్టి చూస్తే నేను నాకు తెలిసినంత మేరకూ దర్యాప్తునకు సహకరించానన్న విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. నాకు తెలిసినంత మేరకు సమాచారాన్ని ఇచ్చాను. అయినప్పటికీ చట్టానికి విరుద్ధంగా మీరు నా మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనపరుచుకున్నారు. ఫోన్‌ తేవాలని మీరు ఎక్కడా చెప్పకున్నా నా చేతిలో ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మీరు ఆరోపిస్తున్న నేరానికి నా ఫోనుకు ఏం సంబంధమో చెప్పలేదు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం సెక్షన్‌ 50(5) కింద అలాంటి అధికారం ఉందని మీరు చెప్పారు. నేను తీసుకున్న న్యాయ సలహా ప్రకారం అది చట్ట వ్యతిరేకం. పైగా ఫోన్‌లో ఉన్న అంశాలు నా ప్రైవసీ హక్కుకు సంబంధించినవి.

అంతేకాక, సూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను రాత్రి 8.30 గంటల వరకూ కూర్చోబెట్టి చివరకు 16 న రావాల్సిందిగా మరోసారి సమన్లను చేతికిచ్చారు.

సమన్లను చూస్తే అందులో ఎక్కడా వ్యక్తిగతంగా లేదా ప్రతినిధిని పంపడం ద్వారా హాజరు కావాలని చెప్పలేదు. కనుక, నేను నా తరఫున భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌ కుమార్‌ను నా ప్రతినిధిగా పంపుతున్నాను.

ఇదెలా ఉన్నా గతంలో మాదిరి దర్యాప్తుకు ఎప్పుడైనా సహకరించేందుకు నేను సిద్ధం. అయితే, అన్ని పరిస్థితుల్లోనూ మీరు చట్టానికి కట్టుబడి వ్యవహరించాల్సి ఉంటుంది. అరెస్టయిన ఒక నిందితుడితో ముఖాముఖి విచారణ జరిపిస్తామన్న పేరుతో నన్ను మార్చి 11న పిలిపించినప్పటికీ ఎవరినీ నా ముందు ప్రవేశ పెట్టక పోవడం అన్నిటికన్నా దిగ్ర్భాంతికరం. అదేమని అడిగితే ప్లాన్‌ మార్చుకున్నామని భానుప్రియ మీనా అనే అధికారి తెలిపారు.

అందువల్ల దర్యాప్తు పవిత్రమైన న్యాయ సూత్రాల ప్రకారం జరగడం లేదని, స్వేచ్ఛగా, సజావుగా నిష్పాక్షికంగా దర్యాప్తు జరగడం లేదని నాకు అనుమానాలు కలుగుతున్నాయి.

అందుకే, రాజ్యాంగపరంగా నా ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని భావించి నేను ఆర్టికల్‌ 32 కింద సుప్రీంకోర్టు తలుపు తట్టాను

మార్చి 7, 11వ తేదీల్లో జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని, విచారణను ఆడియో లేదా వీడియో ద్వారా న్యాయవాదుల సమక్షంలో, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో, స్పష్టమైన దూరాన్ని పాటించి జరిపించాలని నేను సుప్రీంకోర్టును కోరాను. నా మొబైల్‌ ఫోనును స్వాధీన పరుచుకోవడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని అభ్యర్థించాను. మహిళను కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపే విషయంలో 2018లో దాఖలైన పిటిషన్‌తో కలిపి నా పిటిషన్‌ను విచారించాలని కోరాను.

నాపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని, సమన్లపై స్టే విధించాలని, మొబైల్‌ఫోన్‌ను స్వాధీన పరుచుకునేందుకు జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలని కూడా ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించాను.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌ ముందు నా పిటిషన్‌ను ప్రస్తావించినపుడు మార్చి 24న లిస్టు చేయమని ఆదేశించారు.

ఈ రీత్యా సుప్రీంకోర్టు నా పిటిషన్‌ను విచారించి తే ల్చేంతవరకూ వేచి చూడమని నేను కోరుతున్నాను.

మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించే విషయంలో 2018లో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. సదరు మహిళను తమ కార్యాలయానికి రమ్మని ఒత్తిడి చేయబోమని ఈడీ అప్పుడు హామీపత్రం కూడా సుప్రీంకోర్టుకు సమర్పించింది.

నేను నా జీవితమంతా సమాజం కోసం అంకితం చేశాను. ఎప్పుడూ చట్టానికి కట్టుబడి ఉంటాను. ఈ దేశపు మహిళా నేతగా, పౌరురాలిగా మహిళల హక్కుకు సంబంధించి అమలులో ఉన్న చట్టానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా చూడడం నా విధి. ఒక చట్టసభ ప్రతినిధిని అయిన నా హక్కులనే ఉల్లంఘించినపుడు న్యాయ పాలన అమలు అయ్యేలా మాత్రమే కాక, చట్టాన్ని ఏ ఏజెన్సీ ఉల్లంఘించకుండా అన్ని చర్యలు తీసుకోవడం నా బాధ్యత.

అందువల్ల మీ విచారణను సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేంత వరకూ నిలిపివేయాల్సిందిగా నేను మరోసారి అభ్యర్థిస్తున్నాను

మీరు కోరిన విధంగా నా అధికారిక ప్రతినిధి సోమా భరత్‌ కుమార్‌ను పంపిస్తున్నాను. మీరడిగిన విధంగా నా బ్యాంకు స్టేట్‌మెంట్లు, వ్యక్తిగత వ్యాపార వివరాలను కూడా ఆయన ద్వారా సమర్పిస్తున్నాను. మీకేదైనా అదనపు సమాచారం, పత్రాలు కావాలంటే ఆయనను అడగవచ్చు లేదా నా ఈ-మెయిల్‌ కవిత డాట్‌ తెలంగాణ ఎట్‌ జీమెయిల్‌ డాట్‌ కామ్‌ ద్వారా నన్ను కోరవచ్చు.

Updated Date - 2023-03-18T20:39:18+05:30 IST