BRS MLAs Poaching Case: దూకుడు పెంచిన సీబీఐ.. ఎప్పుడేం జరుగుతుందో..!

ABN , First Publish Date - 2023-02-08T19:21:58+05:30 IST

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది.

BRS MLAs Poaching Case: దూకుడు పెంచిన సీబీఐ.. ఎప్పుడేం జరుగుతుందో..!
BRS MLAs Poaching Case

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు(BRS MLAs Poaching Case)లో సీబీఐ(CBI) దూకుడుగా వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే వరుసగా ఐదు లేఖలు రాసింది. కేసు వివరాలు ఇవ్వాలంటూ డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మొదటి లేఖ రాసింది. మొయినాబాద్ ఎఫ్ఐఆర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, సంబంధిత పత్రాలు తమకు ఇవ్వాలని కోరింది. సీబీఐ జనవరి 5 న రెండో లేఖ, జనవరి 9న మూడో లేఖ, జనవరి 11న నాలుగో లేఖ, ఫిబ్రవరి 6 న ఐదో లేఖ రాసింది. వాస్తవానికి డిసెంబర్ 26న హైకోర్టు ఆదేశాల తర్వాత నుంచి సీబీఐ లేఖల ద్వారా కేసీఆర్ సర్కారుపై ఒత్తిడి పెంచడం ప్రారంభించింది.

మరోవైపు పరిణామాలను గమనిస్తోన్న కేసీఆర్(KCR) సర్కారు సీబీఐ దూకుడును అడ్డుకునేందుకు శతవిధాలా యత్నిస్తోంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 17న విచారణ జరుపుతామని తెలిపింది. ఫైల్ సీబీఐకి వెళ్లకుండా హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్‌ను కోరింది. అయితే స్టే ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. 17వ తేదీనే అన్ని అంశాలను పరిశీలిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులో మెరిట్స్ ఉంటే ఇచ్చిన పత్రాలను వెనక్కు ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తామని సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు హైకోర్టులోనూ దీనిపై విచారణ జరిగింది. కేసు ఫైల్స్ ఇవ్వాలని సీబీఐ మళ్లీ లేఖ రాసిందని, సింగిల్ జడ్జి వద్ద విచారణకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్‌ను కోరారు. అయితే డివిజన్ బెంచ్ తీర్పు వచ్చాక మళ్లీ సింగిల్ జడ్జి విచారణ జరపకూడదని, సుప్రీంకోర్ట్ మాత్రమే దీనిపై సమీక్ష చేస్తుందన్నారు. దీంతో దీనికి సంబంధించి వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది.

Updated Date - 2023-02-08T20:51:22+05:30 IST