Share News

TS Election: భార్యలే ఐశ్వర్యవంతులు! టాప్‌లో ఓ మహిళా కాంగ్రెస్ అభ్యర్థి!

ABN , First Publish Date - 2023-11-14T12:24:52+05:30 IST

వారంతా మాజీ మంత్రులు, తాజా ఎమ్మెల్యేలు. నియోజకవర్గంలోనే కాదు. రాష్ట్రంలో ఉద్దండులైన నేతలు. కానీ, వాళ్ల ఆస్తులు భార్యల ఆస్తులతో పోలిస్తే చాలా తక్కువ. నగరంలో కాంగ్రెస్‌ నుంచి

TS Election: భార్యలే ఐశ్వర్యవంతులు! టాప్‌లో ఓ మహిళా కాంగ్రెస్ అభ్యర్థి!

  • పతుల కన్నా.. సతులే సంపన్నులు

  • మాజీ మంత్రులైనా, తాజా ఎమ్మెల్యేలైనా ఆస్తులన్నీ సతీమణుల పేరు మీదే

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): వారంతా మాజీ మంత్రులు, తాజా ఎమ్మెల్యేలు. నియోజకవర్గంలోనే కాదు. రాష్ట్రంలో ఉద్దండులైన నేతలు. కానీ, వాళ్ల ఆస్తులు భార్యల ఆస్తులతో పోలిస్తే చాలా తక్కువ. నగరంలో కాంగ్రెస్‌ నుంచి నలుగురు మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటే వారిలో ఇద్దరి ఆస్తులు భర్తల కంటే అధికంగా ఉండడం విశేషం. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల అఫిడవిట్‌లో తమకున్న ఆస్తుల వివరాలు, భార్యలకున్న ఆస్తుల వివరాలు వెల్లడించారు. వాటి వివరాలిలా ఉన్నాయి.

కార్పొరేటర్‌ విజయారెడ్డికిఆస్తులు అధికం

కార్పొరేటర్‌ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయారెడ్డి ఖైరతాబాద్‌ బరిలో నిల్చున్నారు. ఆమె భర్త జీవీబీ రెడ్డి కంటే విజయారెడ్డికే ఆస్తులు అధికంగా ఉన్నాయి. విజయారెడ్డి పేరు మీద సుమారు రూ.26.50 కోట్ల ఆస్తులుండగా, జీవీబీ రెడ్డి పేరు మీద రూ.19.70 కోట్ల ఆస్తులున్నాయి.

మాజీ మంత్రి దానం భార్య ఆస్తులే అధికం..

మాజీ మంత్రి, ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ కంటే ఆయన భార్య అనిత పేరు మీదనే ఆస్తులు అధికంగా ఉన్నాయి. దానం నాగేందర్‌కు రూ.22.65 కోట్ల చరాస్తులు ఉండగా, అనిత పేరు మీద రూ.46.11 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులున్నాయి. అనితకు కేవలం రూ.2 కోట్ల అప్పులు ఉండగా, దానం నాగేందర్‌కు రూ.47.55 కోట్ల అప్పులున్నాయి. దానం నాగేందర్‌కు ఆస్తులతో పోల్చితే అప్పులే అధికంగా ఉండడం గమన్హాం.

మైనంపల్లి భార్యకు 10.66 కోట్ల ఆస్తులు

మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కంటే ఆయన భార్య వాణి పేరు మీదే ఆస్తులు అధికంగా ఉన్నాయి. మైనంపల్లికి రూ.4.17 కోట్ల ఆస్తులుండగా, ఆయన భార్య వాణికి రూ.10.66 కోట్ల ఆస్తులున్నాయి. ఐదేళ్ల క్రితం మైనంపల్లి హన్మంతరావు పేరుపై రూ.5 కోట్ల ఆస్తులుండగా, మైనంపల్లి వాణికి రూ.13.60 కోట్ల ఆస్తులున్నాయి. ఐదేళ్లలో హన్మంతరావు ఆస్తి కోటి తగ్గగా, మైనంపల్లి వాణి ఆస్తి మూడు కోట్ల మేర తగ్గింది. ఆమెకు పలు బ్యాంకుల్లో అప్పులున్నాయి.

ముఠా గోపాల్‌ భార్యకు స్వల్ప అధికం

ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఆస్తుల కంటే ఆయన భార్య ఆస్తులు స్వల్పంగా ఎక్కువ ఉన్నాయి. ముఠా గోపాల్‌ ఆస్తులు రూ.3 కోట్లు ఉండగా, ఆయన భార్య ముఠా సరోజ పేరు మీద రూ.3.75 కోట్ల ఆస్తులున్నాయి. ఐదేళ్ల క్రితం ముఠా గోపాల్‌ పేరు మీద రూ.1.94 కోట్ల విలువ చేసే ఆస్తులుండగా, ఆయన భార్యకు రూ.2.68కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి.

వివేకానంద భార్యే ఐశ్వర్యవంతురాలు

కుత్బుల్లాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌ కంటే ఆయన భార్య సౌజన్య పేరు మీదే అధికంగా ఆస్తులున్నాయి. వివేకానంద గౌడ్‌ పేరు మీద రూ.9.44 కోట్ల ఆస్తులుండగా, ఆయన భార్య పేరు మీద రూ.13.31 కోట్ల ఆస్తులున్నాయి. వారి పేరు మీద పలు ప్రాంతాల్లో భూములు, ఓపెన్‌ ప్లాట్లు, ఇళ్లు ఉన్నాయి.

టాప్‌లో డాక్టర్‌ కోట నీలిమ..

జర్నలిస్టు నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోట నీలిమ సనత్‌నగర్‌ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆమె భర్త, కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీ సభ్యుడు పవన్‌ఖేర్‌కు కేవలం రూ.2.68 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అయితే, నీలిమకు రూ.52.06 కోట్ల ఆస్తులున్నాయి. ఆమెకు ఓ బ్యాంకులో రూ.9 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నాయి.

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సతీమణి ఆస్తులు రూ.13.29 కోట్లు

ఎల్‌బీనగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కంటే ఆయన భార్య కమలారెడ్డికే ఆస్తులు ఎక్కువున్నాయి. సుధీర్‌రెడ్డికి రూ.6.05 కోట్ల ఆస్తులుండగా, ఆయన భార్యకు రూ.15.52 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఐదేళ్ల క్రితం సుధీర్‌రెడ్డికి రూ.3.21 కోట్ల ఆస్తులుండగా, ఆయన భార్యకు 13.29 కోట్ల విలువ చేసే ఆస్తులుండేవి. ఓ కంపెనీలో వ్యాపార భాగస్వామిగా ఉండడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆమెకు భూములున్నాయి.

Updated Date - 2023-11-14T12:24:56+05:30 IST