Share News

Revanth Reddy: బరా బర్ ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం

ABN , First Publish Date - 2023-11-08T14:16:25+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు (బుధవారం) ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో టీపీసీసీ చీఫ్ పాల్గొని ప్రసంగించారు.

Revanth Reddy: బరా బర్ ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం

ఆదిలాబాద్: ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు (బుధవారం) ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో టీపీసీసీ చీఫ్ పాల్గొని ప్రసంగించారు. బరా బర్ ధరణి పోర్టల్‌ను (Dharani Portal) బంగాళాఖాతంలో కలుపుతామని అన్నారు. ధరణిని రద్దు చేస్తే రైతుబంధు రద్దు అవుతుందని కేసీఆర్ (CM KCR) తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధరణి ముసుగులో కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ పరిసర భూములను కబ్జా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల రూపాయలు ఉన్నోళ్లకే బీఆర్ఎస్ - బీజేపీ టికెట్లు ఇస్తే, ఓట్లున్న వారికే కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టును (Pranahita Project) కేసీఆర్ దెబ్బ తీశారన్నారు. కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు కేసీఆర్ దిగ మింగారని ఆరోపించారు. కేసీఆర్ ధన దాహనికి ప్రాణహిత ప్రాజెక్టు బలైందన్నారు. కాంగ్రెస్ కట్టిన కడెం, సదర్‌మాట్ ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించు కోలేదన్నారు. దళిత - గిరిజనుల పట్ల కాంగ్రెస్‌కు ఉన్న ప్రేమ.. దేశంలో మరే పార్టీకి లేదని రేవంత్ అన్నారు.


కేసీఆర్‌కు రేవంత్ సవాల్...

కరెంటుపై కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతున్నరని విమర్శించారు. ‘‘ఏ సబ్ స్టేషన్‌లోకైనా పోదాం.. 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే నేను నామినేషన్ వేయను. లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి’’ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసైన్డ్ భూములు, పోడు భూములకు అన్ని రకాల హక్కులు కలిపిస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీ - లంబాడీల మధ్య పంచాయతీని కాంగ్రెస్ తీరుస్తుందని తెలిపారు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. లంబాడీ - ఆదివాసులు తనకు రెండు కళ్ల లాంటివారని.. ఎవరికీ అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటామని అన్నారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌ది అని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-08T14:16:26+05:30 IST