Cyber Crime: ముంచేస్తున్న మాయగాళ్లు.. జాగ్రత్త సుమీ!

ABN , First Publish Date - 2023-01-20T17:02:08+05:30 IST

ఇలాంటి కాల్స్ ఎప్పుడో ఒకప్పుడు అందుకున్న వారే. పొరపాటున ఆ కాల్స్‌కు ప్రతిస్పందించి వారు అడిగిన వాటికి సమాధానాలు చెప్పామా? మన బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయినట్టే.

Cyber Crime: ముంచేస్తున్న మాయగాళ్లు.. జాగ్రత్త సుమీ!

‘మేం పలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది. ఇప్పుడు మీ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీ చెబితే వెంటనే యాక్టివేట్ చేస్తాం’.

‘లక్కీ డ్రాలో మీరు ఐఫోన్ గెల్చుకున్నారు. రూ. 2 వేలు పంపిస్తే రూ. 40 వేల విలువైన ఐఫోన్ మీ సొంతం’

‘కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంది.. మీ బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పండి’

హైదరాబాద్: ఇలాంటి కాల్స్ ఎప్పుడో ఒకప్పుడు అందుకున్న వారే. పొరపాటున ఆ కాల్స్‌కు ప్రతిస్పందించి వారు అడిగిన వాటికి సమాధానాలు చెప్పామా? మన బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయినట్టే. ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని షర్టు నలగకుండా చేసే ఇలాంటి సైబర్ నేరాలు (Cyber Crimes) ఇటీవల బాగా పెరిగిపోయాయి. నేరగాళ్ల ఉచ్చులోపడి సామాన్యులే కాదు, పెద్దపెద్ద చదువులు చదువుకున్న వారు కూడా మోసపోయి చేతులు కాల్చుకున్న సందర్భాలు అనేకం.

ఉచితంగా వస్తుందనో, చవగ్గా లభిస్తుందనో.. ఇలా ఏదో ఒక కారణంతో మోసగాళ్ల వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వారి మాయమాటలకు బలైపోతున్నారు. పోలీసులు ఎంతగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఫలితం ఉండడం లేదు. సైబర్ నేరగాళ్ల(Cyber Criminals)కు కఠిన శిక్షలు పడుతున్నా నేరాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో ఓ మారమూల ప్రదేశంలో ఉండి ఎంచక్కా నేరాలకు పాల్పడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. చివరికీ ఈ నేరగాళ్లు మ్యాట్రిమోనీ సైట్లను కూడా వదలడం లేదు. పెళ్లి పేరుతో వలవేసి లక్షలు కాజేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి కూడా నేరాలకు పాల్పడుతున్నారు.

చదువుకోని వారి చేతుల్లో..

పాఠశాల విద్య కూడా పూర్తి చేయని వారు సైబర్ నేరాలకు పాల్పడుతుంటే విద్యావంతులు వారి చేతుల్లో బలవుతున్నారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. కరోనా సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరగడంతో సైబర్ క్రిమినల్స్ దానిని ఆసరాగా ఉపయోగించుకుని ఖాతాలు గుల్ల చేస్తున్నారు. ఫిషింగ్, మెయిల్ స్పామ్, ర్యాన్సమ్ వేర్ దాడులు కూడా ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. 2018-2021 మధ్య దేశంలో సైబర్ నేరాలు ఐదు రెట్లు పెరిగినట్టు స్వయంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ వెల్లడించింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం నివేదిక ప్రకారం.. 2019లో 3,94,499, 2020లో 11,58,208, 2021లో 14,02,809, గతేడాది నవంబరు నాటికి 12.67 కేసులు నమోదయ్యాయి.

చెమట చుక్క చిందకుండా డబ్బులు సంపాదించాలని కొందరు, రాత్రికి రాత్రే డబ్బులు సంపాదించేయాలని ఇంకొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని వీరు దాడులకు దిగుతున్నారు. వారి వలలో చిక్కితే ఇక అయిపోయినట్టే.

అసలేంటీ సైబర్ నేరం.. ఎన్ని రకాలు?

సాంకేతికతను ఉపయోగించి నేరాలకు పాల్పడడమే సైబర్ నేరం. కంప్యూటర్‌ను సాధనంగా చేసుకుని చేసే అన్ని రకాల మోసాలు ఈ కోవలోకే వస్తాయి. వ్యక్తులు, సంస్థల కంప్యూటర్లలోకి అక్రమంగా చొరబడి అందులోని డేటాను చోరీ చేయడం, ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేసి అడిగినంత దండుకోవడం వంటివి ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరాల్లో చాలా రకాలు ఉన్నాయి. సైబర్ పోర్నోగ్రఫీ, సైబర్ స్టాకింగ్, సైబర్ డిఫమేషన్ వంటివి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని చేస్తే, ఆన్‌లైన్ గ్యాబ్లింగ్, ఫిషింగ్, క్రెడిట్ కార్డు మోసాలు వంటివి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగే దాడులు.

ఎవరికి ఫిర్యాదు చేయాలి?

సైబర్ నేరాల బారినపడిన వారు సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్‌ సెల్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మరీ అత్యవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 కింద అన్ని రకాల సైబర్ నేరాలకు శిక్షలు ఉన్నాయి.

ఇలా చేస్తే సేఫ్

ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పినా ఓటీపీ, పిన్ నంబర్లు ఎప్పుడూ, ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదు. ఎవరైనా అలా అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. బ్యాంకులు ఎప్పుడూ తమ ఖాతాదారుల రహస్య సమాచారాన్ని అడగవు. కాబట్టి బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెబితే వెంటనే అప్రమత్తం కావాలి. అలాగే, ఆఫర్ల పేరుతో ఎస్సెమ్మెస్‌ల ద్వారా వచ్చే తెలియని లింకును ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. పొరపాటున వాటిపై క్లిక్ చేస్తే మన ఫోన్‌లోని సమస్త సమచారం సైబర్ నేరగాళ్లకు చేరుతుంది. ఆ తర్వాత బ్యాంకులోని సొమ్ము ఖాళీ అవుతుంది. ఏదైనా సంస్థ నుంచి కానీ, ఇంకెక్కడి నుంచి అయినా సమాచారం కావాలనిపిస్తే అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే సంప్రదించాలి.

Updated Date - 2023-01-20T17:07:46+05:30 IST