SRHvsMI: ముంబై గెలుపు.. ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి.. ఆ ముగ్గురినీ నమ్ముకుంటే ముగ్గురూ ముంచేశారు.. పాపం ఆరెంజ్ ఆర్మీ..!

ABN , First Publish Date - 2023-04-18T23:56:31+05:30 IST

మిగిలింది ఒక్క ఓవర్. బౌలింగ్ చేస్తుంది క్రికెట్ దేవుడనిపించుకున్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్. 20 పరుగులు కొడితే విజయం హైదరాబాద్ సొంతం. కానీ.. ఇక్కడ మరో ప్రమాదం కూడా..

SRHvsMI: ముంబై గెలుపు.. ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి.. ఆ ముగ్గురినీ నమ్ముకుంటే ముగ్గురూ ముంచేశారు.. పాపం ఆరెంజ్ ఆర్మీ..!

మిగిలింది ఒక్క ఓవర్. బౌలింగ్ చేస్తుంది క్రికెట్ దేవుడనిపించుకున్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar). 20 పరుగులు కొడితే విజయం హైదరాబాద్ (Sunrisers Hyderabad) సొంతం. కానీ.. ఇక్కడ మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు వికెట్లు పడితే ప్రత్యర్థి జట్టు అయిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) విజయం తథ్యం. ఇదీ.. ఉప్పల్ స్టేడియం (Uppal IPL Match) వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో (SRHvsMI) ఛేజింగ్ చేసిన SRH పరిస్థితి. చివరకు ముంబై అభిమానులు ఆశించిందే జరిగింది. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ చేసిన 20వ ఓవర్లో తొలి బంతికి అబ్దుల్ సమద్ రనౌట్‌ కాగా.. ఐదో బంతికి రోహిత్ శర్మకు భువనేశ్వర్ క్యాచ్‌గా దొరికిపోవడంతో సన్‌రైజర్స్ జట్టు 178 పరుగులకే ఆలౌట్ అయింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమైంది. ఫలితంగా.. ఒక బంతి మిగిలి ఉండగానే 14 పరుగుల తేడాతో గెలిచి ముంబై ఇండియన్స్ జట్టు ఉప్పల్‌లో విక్టరీ జెండా ఎగురవేసింది.

FuA8wcfWIAM_sOg.jpg

సన్‌రైజర్స్ బ్యాటర్లు ఒక్క మయాంక్ అగర్వాల్, క్లసెన్ మినహాయిస్తే మిగిలిన వారెవ్వరూ రాణించలేదు. 193 పరుగుల భారీ లక్ష్యం కావడంతో బ్రూక్, రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మర్క్రమ్‌పై సన్‌రైజర్స్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఈ త్రయం అభిమానుల ఆశలను ఆవిరి చేసింది. బ్రూక్ 9 పరుగులకు, త్రిపాఠి 7 పరుగులకు, మర్క్రమ్ 22 పరుగులకే చేతులెత్తేశారు. ఆ తర్వాత.. మయాంక్ అగర్వాల్ 48 పరుగులు, క్లాసెన్ 36 పరుగులతో ఆశలు రేకెత్తించినా అవి కొంతసేపటికే ఆవిరయిన పరిస్థితి. ఎంత చెత్తగా ఆడకూడదో అంతే చెత్తగా ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ సాగింది.

FuAvJuRXwBcSuL-.jpg

ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్ అదరగొట్టాడు. పరుగులు కట్టడి చేయడమే కాకుండా ఐపీఎల్‌లో తొలి వికెట్‌ను తీసి రికార్డు సృష్టించాడు. మరో హైలైట్ ఏంటంటే.. ఎస్‌ఆర్‌హెచ్ కోల్పోయిన వికెట్లలో నాలుగు వికెట్లు టిమ్ డేవిడ్‌ క్యాచ్ పట్టినవే కావడం గమనార్హం. వాషింగ్టన్ సుందర్‌ను కూడా టిమ్ డేవిడ్ బంతిని త్రోగా విసిరి రనౌట్ చేయడం గమనార్హం. ఇలా.. ఎస్‌ఆర్‌హెచ్ పతనంలో, ముంబై ఇండియన్స్ విజయంలో టిమ్ డేవిడ్ కీలక పాత్ర పోషించాడు.

FuA5muXXsAAgAtS.jpg

ఇక.. సన్‌రైజర్స్ బ్యాటింగే కాదు.. బౌలింగ్ కూడా పేలవంగా సాగింది. సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ ఒక వికెట్ తీసినప్పటికీ భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. నటరాజన్ బౌలింగ్ చేసిన నాలుగు ఓవర్లలో ముంబై బ్యాటర్లు 50 పరుగులు సాధించారు. జాన్‌సెన్ రెండు వికెట్లు తీసినప్పటికీ 43 పరుగులు సమర్పించుకున్నాడు. భువనేశ్వర్ 4 ఓవర్లలో 31 పరుగులు, మయాంక్ మార్కండే ఓవర్లలో 35 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 33 పరుగులు రావడం గమనార్హం.

FuA9JTJWYAI2YmD.jpg

మొత్తంగా చూసుకుంటే.. సన్‌రైజర్స్ బౌలర్లు పరుగులను కట్టడి చేసే విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలనేది ఈ మ్యాచ్‌తో స్పష్టమైంది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సాగిన తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. సన్‌రైజర్స్ కెప్టెన్ మర్క్రమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. 193 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ముందు నిలిపింది. లక్ష్య సాధనలో చతికిలపడి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 178 పరుగులకే ఆలౌట్ అయింది.

Updated Date - 2023-04-19T00:00:15+05:30 IST