India VS Nepal Match : సూపర్‌-4 లక్ష్యంగా..

ABN , First Publish Date - 2023-09-04T02:38:02+05:30 IST

ఆసియాక్‌పలో(Asia cup) తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌నకు టీమిండియా(Team India) సిద్ధమైంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి పోరుకు వరుణుడు అడ్డుపడడంతో ఎలాంటి ఫలితం తేలకపోగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ కేటాయించారు. దీంతో ఇదివరకే నేపాల్‌(Nepal)పై విజయం సాధించిన పాక్‌ మూడు పాయింట్లతో గ్రూప్‌ ‘ఎ’ నుంచి సూపర్‌-4(Super-4)కు అర్హత సాధించింది.

India VS Nepal Match : సూపర్‌-4   లక్ష్యంగా..

మధ్యాహ్నం 3 గంటల నుంచి

స్టార్‌స్పోర్ట్స్‌లో.. నేడు నేపాల్‌తో భారత్‌ పోరు

పొంచి ఉన్న వానగండం

ఆసియాకప్‌ మ్యాచ్‌కు బుమ్రా దూరం!

పల్లెకెలె: ఆసియాక్‌పలో(Asia cup) తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌నకు టీమిండియా(Team India) సిద్ధమైంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి పోరుకు వరుణుడు అడ్డుపడడంతో ఎలాంటి ఫలితం తేలకపోగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ కేటాయించారు. దీంతో ఇదివరకే నేపాల్‌(Nepal)పై విజయం సాధించిన పాక్‌ మూడు పాయింట్లతో గ్రూప్‌ ‘ఎ’ నుంచి సూపర్‌-4(Super-4)కు అర్హత సాధించింది. ఇక రోహిత్‌ సేన సోమవారం నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా తదుపరి రౌండ్‌కు వెళుతుంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారే చాన్సుంది. ఒకవేళ మ్యాచ్‌ రద్దు అయితే భారత్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. రెండు పాయింట్లతో సూపర్‌-4కు వెళుతుంది. అభిమానులు మాత్రం పూర్తి మ్యాచ్‌ జరగాలనే కోరుకుంటున్నారు. నేపాల్‌పై పూర్తి స్థాయిలో రాణిస్తే భారత్‌కు కూడా తగిన ప్రాక్టీస్‌ లభించినట్టవుతుంది. అటు పసికూన జట్టు నేపాల్‌.. భారత్‌పై కనీస పోరాటాన్ని ప్రదర్శించాలనుకుంటోంది. మరోవైపు స్టార్‌ పేసర్‌ బుమ్రా(Bumrah) ఈ మ్యాచ్‌కు దూరం కానున్నట్టు తెలిసింది. భార్య సంజన తొలి బిడ్డకు జన్మనివ్వనుండడంతో బుమ్రా స్వదేశానికి వచ్చాడని సమాచారం. అయితే, అతను సూపర్‌-4 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు.

చెలరేగాల్సిందే:

పాక్‌తో మ్యాచ్‌లో టాపార్డర్‌ తడబాటుతో భారత 66 రన్స్‌కు 4 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. స్టార్‌ ఆటగాళ్లు అయినప్పటికీ పాక్‌ పేసర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడడం సగటు అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ఇలాంటి ప్రదర్శన ఎంత మాత్రం తగదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక టాపార్డర్‌లో ఆడే ఇషాన్‌ కిషన్‌తన కెరీర్‌లో తొలిసారి నెంబర్‌ 5లో బరిలోకి దిగి ఆకట్టుకున్నాడు. అతడితో పాటు హార్దిక్‌ ఆడకపోయుంటే స్కోరుబోర్డు దయనీయంగా కనిపించేది. రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయాస్‌ స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. రోహిత్‌, విరాట్‌లకు కావాల్సినంత విశ్రాంతి లభించినా ప్రయోజనం లేకపోయింది. అందుకే నేపాల్‌ మ్యాచ్‌తోనైనా భారత బ్యాటర్లు ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు ఉండకపోవచ్చు. మరోవైపు భారత బౌలర్లకు పాక్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న పేసర్‌ బుమ్రా వన్డేల్లో ఎలా రాణిస్తాడనేది చూడాల్సి ఉంది. శార్దూల్‌ స్థానంలో షమి ఆడే అవకాశముంది.

మ్యాచ్‌లు కొలంబో నుంచి తరలింపు!

ఆసియా కప్‌ సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌లను కొలంబో నుంచి తరలించే సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. వచ్చేవారం కొలంబోలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఈమేరకు నిర్ణయం తీసుకోనుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 9వ తేదీ నుంచి ఐదు సూపర్‌-4 మ్యాచ్‌లు కొలంబోలో జరగాల్సి ఉంది. అక్కడ నుంచి తరలించే మ్యాచ్‌లను దంబుల్లా లేదా పల్లెకెలెలో నిర్వహిస్తారని సమాచారం. కొలంబోలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ‘మ్యాచ్‌లను కొలంబో నుంచి తరలించే విషయమై చర్చలు జరుగుతున్నాయి’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించాడు.

తుది జట్లు (అంచనా)

భారత్‌:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), గిల్‌, విరాట్‌, శ్రేయాస్‌, ఇషాన్‌, హార్దిక్‌, జడేజా, కుల్దీప్‌, షమి, బుమ్రా, సిరాజ్‌.

నేపాల్‌:

రోహిత్‌ పౌడెల్‌ (కెప్టెన్‌), కుశాల్‌, ఆసిఫ్‌, ఆరిఫ్‌, సోమ్‌పాల్‌, గుల్షన్‌, దీపేంద్ర సింగ్‌, కుశాల్‌ మల్ల, సందీప్‌ లామిచానె, కరణ్‌, లలిత్‌.

Updated Date - 2023-09-04T03:57:00+05:30 IST