Vizag ODI: విశాఖ వన్డే మ్యాచ్‌పై గుడ్‌న్యూస్.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్..!

ABN , First Publish Date - 2023-03-19T13:00:07+05:30 IST

సాగర నగరం విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినప్పటికీ ప్రస్తుతం వాతావరణం పూర్తిగా మారింది. నగరంలో ఉదయం కురిసిన వర్షానికి..

Vizag ODI: విశాఖ వన్డే మ్యాచ్‌పై గుడ్‌న్యూస్.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్..!

విశాఖ: సాగర నగరం విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినప్పటికీ ప్రస్తుతం వాతావరణం పూర్తిగా మారింది. నగరంలో ఉదయం కురిసిన వర్షానికి పలుచోట్ల రోడ్ల పైకి వర్షపు నీరు చేరడంతో నేటి భారత్‌-ఆస్ట్రేలియా రెండో వన్డేపై (IND vs AUS 2nd ODI) అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. ప్రస్తుతం వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షం ఆగిపోవడమే కాదు స్టేడియం ప్రాంతంలో ఎండ కూడా రావడంతో అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు స్టేడియానికి చేరుకున్నాయి. ఒకవేళ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. వర్షం తెరిపిచ్చినట్టయితే 45 నిమిషాలలో పిచ్ రెడీ చేసే ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే పిచ్‌ (వికెట్‌), అవుట్‌ ఫీల్డ్‌ పాడవకుండా పూర్తిగా కవర్స్‌తో కప్పి జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అవుట్‌ ఫీల్డ్‌పై వున్న తడిని డ్రై చేసేందుకు ఆధునిక సూపర్‌ సాపర్స్‌ మిషన్‌లు మూడింటిని సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్‌ ఆటగాళ్లు రెండో వన్డేకు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనున్నారు. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేలో ఆడని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ కూడా రెండో వన్డేకు జట్టులో చేరడం మరింత బలాన్నిస్తుంది. ఇక ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను కోల్పోవడంతో పాటు తొలి వన్డేలో ఓటమి చెందిన ఆస్ట్రేలియాకు రెండో వన్డే చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేని పక్షంలో వన్డే సిరీస్‌ను కూడా చేజార్చుకున్నట్టవుతుంది. అందుకే గెలుపు కోసం ఆ జట్టు సర్వశక్తులూ ఒడ్డనుండడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్‌ ట్రాక్‌ రికార్డు అద్భుతంగా ఉంది. ఇక్కడ ఆడిన మ్యాచ్‌లలో అత్యధికం విజయం సాధించింది. దీంతో మరోమారు విజయం ఖాయమని క్రికెట్‌ అభిమానులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2023-03-19T13:00:51+05:30 IST