Asian Games 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. గోల్డ్ మెడల్ పక్కా.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-10-06T17:01:25+05:30 IST

ఆసియా గేమ్స్‌లో పురుషుల విభాగంలో టీమిండియా గోల్డ్ మెడల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఆప్ఘనిస్తాన్ కావడం గమనించాల్సిన విషయం.

Asian Games 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. గోల్డ్ మెడల్ పక్కా.. ఎందుకంటే..?

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో పురుషుల విభాగంలో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని యువ టీమిండియా అదరగొడుతోంది. తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో పతకం రావడం గ్యారంటీ. అయితే టీమిండియా గోల్డ్ మెడల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఆప్ఘనిస్తాన్ కావడం గమనించాల్సిన విషయం. వాస్తవానికి పాకిస్థాన్ లేదా శ్రీలంక ఫైనల్‌కు వస్తాయని క్రికెట్ విశ్లేషకులు భావించారు. కానీ అనూహ్యంగా ఆప్ఘనిస్తాన్ చేతిలో శ్రీలంక, పాకిస్థాన్ ఓటమిపాలయ్యాయి. రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఫైనల్లో టీమిండియా, ఆప్ఘనిస్తాన్ తలపడనున్నాయి.

ఇది కూడా చదవండి: ODI World Cup: న్యూజిలాండ్ జట్టులో అదరగొడుతున్న భారత సంతతి ఆటగాడు

కాగా తొలి సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పర్వేజ్ హుస్సేన్ 23 పరుగులు, జాకర్ అలీ 14 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు వచ్చినంత వేగంగా పెవిలియన్ చేరారు. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. టీమిండియా తరపున సాయి కిషోర్ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్ విధించిన 97 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సులభంగానే ఛేదించింది. తొలి ఓవర్‌లోనే యంగ్ సెన్సేషన్ జైస్వాల్ వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన జైస్వాల్ ఈసారి డకౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. అయితే రెండో వికెట్‌కు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో విజయాన్ని అందించారు. భారత్ 9 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 97 పరుగులు చేసి విజయం సాధించింది. తిలక్ వర్మ కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 55 పరుగులు చేశాడు. అటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అజేయంగా 40 పరుగులు చేశాడు.

Updated Date - 2023-10-06T17:01:25+05:30 IST