Share News

SA Vs BAN: డికాక్, క్లాసెన్ వీరబాదుడు.. దక్షిణాఫ్రికా మళ్లీ భారీ స్కోరు

ABN , First Publish Date - 2023-10-24T18:11:40+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జోరు మీద కనిపిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారీ స్కోరు సాధించింది. ఈనెల 21న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 399 పరుగుల భారీ స్కోరు సాధించిన సఫారీ జట్టు.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది.

SA Vs BAN: డికాక్, క్లాసెన్ వీరబాదుడు.. దక్షిణాఫ్రికా మళ్లీ భారీ స్కోరు

వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జోరు మీద కనిపిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారీ స్కోరు సాధించింది. ఈనెల 21న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 399 పరుగుల భారీ స్కోరు సాధించిన సఫారీ జట్టు.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే జరగడం విశేషం. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అయితే ఒక దశలో దక్షిణాఫ్రికా 400 రన్స్ సాధిస్తుందని క్రికెట్ అభిమానులు భావించారు. ఓపెనర్ డికాక్ 140 బాల్స్‌లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 174 పరుగులతో వీరవిహారం చేశాడు. తృటిలో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ కూడా సిక్సర్లతో చెలరేగిపోయాడు. 49 బాల్స్‌లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో క్లాసెన్ 90 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేయగలిగింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు డికాక్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే మరో ఓపెనర్ రెజా హెండ్రిక్స్ 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాండర్ డుసెన్ కూడా (1) వెంటనే అవుటయ్యాడు. దీంతో మ్యాచ్‌పై బంగ్లాదేశ్ పట్టు బిగుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ డికాక్ ఆ అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్ మార్‌క్రమ్‌తో కలిసి మూడో వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్‌క్రమ్ అవుటైన తర్వాత వాంఖడేలో పరుగుల తుఫాన్ రెట్టింపు అయ్యింది. క్లాసెన్ రావడంతోనే సిక్సర్లను టార్గెట్ చేశాడు. దీంతో మార్‌క్రమ్‌ను ఎందుకు అవుట్ చేశామా అని బంగ్లాదేశ్ అనుకుని ఉంటుంది. అంతలా క్లాసెన్ చెలరేగిపోయాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హసన్ మహమూద్ రెండు వికెట్లు తీయగా.. మెహిదీ హసన్ మిరాజ్, షోరిఫుల్ ఇస్లాం, షకీబుల్ హసన్ తలో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 383 పరుగులు చేయాలి.

Updated Date - 2023-10-24T18:21:10+05:30 IST